Thursday, January 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకాంతి లేని సంక్రాంతి

కాంతి లేని సంక్రాంతి

- Advertisement -

పల్లెల్లో కానరాని పండుగ వాతావరణం
తుపానులు, తెగుళ్లతో రైతు కుదేలు
అరకొర పంటకూ అందని గిట్టుబాటు
వెంటాడుతూనే ఉన్న యూరియా కష్టాలు
పత్తి అమ్మేందుకు, ఎరువు కొనేందుకు ఆపసోపాలు
‘రైతు భరోసా’ కోసం ఎదురుచూపు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
”ఉత్తరాయణం… మకర సంక్రమణం.. ప్రకృతి పులకించాలి.. పల్లె పరవశించాలి.. సంక్రాంతి కోలాహలంతో ఊళ్లు ‘పెద్ద పండుగ’ చేసుకోవాలి.. కానీ చీడపీడలు పాడి పంటలను ఛిద్రం చేశాయి. తుపానుల తాకిడికి పత్తి రైతు చిత్తయ్యాడు.. కపాస్‌ యాప్‌తో అరకొర పంట అంగట్లో సరుకైంది. గుబ్బ తెగులు గుబులు రేపుతుండగా.. మిరప రైతు కంట నీరు తిరుగుతోంది. ఎరువు కరువైంది. యూరియా యాప్‌ వెతలు వెంటాడుతున్నాయి.. సకాలంలో అందని పెట్టుబడి సాయంతో రైతుకు ‘భరోసా’ లేకుండా పోయింది. రంగుల వాకిళ్లే కానీ కర్షకుల జీవితం కళావిహీనంగా మారింది. బతుకంతా వ్యథలు నిండగా.. పేరుకే పెద్ద పండుగ”లా.. కాంతిలేని సంక్రాంతి తీరు ఉంది.”

విపత్తులో పత్తి రైతు
ఈ ఏడాది పత్తి పంట రైతులను చిత్తు చేసింది. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేసిన పైరు అధిక వర్షాలకు గిడసబారి కాయ పగిలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఎకరానికి 12 క్వింటాళ్లకు పైగా రావాల్సిన పత్తి తుపానుల తాకిడికి నాలుగు క్వింటాళ్ల లోపు మాత్రమే దిగుబడి వచ్చింది. ఖరీఫ్‌ ప్రారంభంలో వర్షాలు సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. పత్తి తీత దశలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిశాయి. పూత, కాయలు మచ్చలు వచ్చి పాలిపోయాయి. కనీసం పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేక రైతులు పైరును తొలగించారు. నష్టాల్లో ఆదుకునే క్రాప్‌ ఇన్సూరెన్స్‌ సైతం ప్రభుత్వం తొలగించటంతో పత్తి రైతులు ఆవేదన చెందారు. గతంలో కంటే పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. ఎకరం పత్తి సాగు చేయాలంటే కౌలుతో కలిపి రూ.50 వేల వరకు ఖర్చులు అవుతున్నాయి. ఎకరం భూమి కౌలు ధర రూ.20 వేల వరకు ఉండగా, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు కలిపి మరో రూ.25 వేలు అవుతున్నాయి. ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చి రూ.12 వేలు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అయ్యేది. కానీ కపాస్‌ యాప్‌ పేరుతో సీసీఐ పెట్టిన నిబంధనల కారణంగా నాణ్యత లేమి సాకుతో క్వింటా రూ.6 వేల లోపు ధరకే రైతులు అమ్ముకోవాల్సి వచ్చింది.

కపాస్‌ యాప్‌తో కష్టాలు
కపాస్‌ యాప్‌తో పత్తి రైతులు కష్టాలు ఎదుర్కొన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పత్తిని విక్రయించుకోవాలంటే ఆ యాప్‌లో రైతులే స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఒక కేంద్రం వద్ద రోజుకు 50 వాహనాల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారు. దీనివల్ల రైతులు రోజుల తరబడి యాప్‌లో వివరాలు నమోదు కాక ఇబ్బందులు పడ్డారు. రోజుకు ఒక మిల్లులో 50 వరకు వాహనాల్లోని పత్తినే కొనుగోలు చేస్తుండటంతో ఉదయం నుంచి మధ్యాహ్నంలోపే యాప్‌లో బుకింగ్స్‌ పూర్తయ్యాయి. ఆ తర్వాత యాప్‌లో నమోదు కాక, రైతులు అవస్థలు పడ్డారు. దాంతో రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని పలువురు రైతులు, వివిధ అవసరాల రీత్యా నిరీక్షించలేని వారు ప్రయివేటు వ్యాపారులకు క్వింటాలుకు రూ.5,500 నుంచి రూ.7,000 వరకు విక్రయించుకుని నష్టపోతున్నారు. అదే సీసీఐ ఆధ్వర్యంలో క్వింటాల్‌కు మద్దతు ధర రూ.8,116 ఇస్తున్నారు. రైతుల అవసరాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. రైతుల వద్ద అరకొర ధరలకు కొనుగోలు చేసి, అదే రైతులు, లేదంటే తెలిసిన పేరుతో స్లాట్‌ బుక్‌ చేసుకొని క్వింటాల్‌కు రూ.వెయ్యి వరకూ లాభంతో జిన్నింగ్‌ మిల్లుల్లో విక్రయించారు.

గుబ్బ తెగులతో మిర్చి రైతుకు గుబులు
మిర్చిలో గుబ్బతెగులు (గుల్ల తెగులు) ఓ తీవ్ర సమస్యగా మారింది. దీనివల్ల మొక్కలు ఎండిపోయి, పంట నాశనమవుతోంది. ముఖ్యంగా నల్లతామర పురుగు, ఇతర తెగుళ్ళ వల్ల ఇది సంభవిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. గుబ్బ తెగులు నివారణకు పురుగుమందులు, సేంద్రీయ పద్ధతులు పాటిస్తున్నా.. మూడు రోజులకోసారి పురుగు మందులు పిచికారీ చేస్తున్నా తెగుళ్లు నియంత్రణలోకి రావటం లేదని రైతాంగం వాపోతోంది. ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టి అర్ధాంతరంగా తోటలను తొలగించాల్సిన పరిస్థితి వస్తుందని అంటోంది. రాష్ట్రంలో ఈ తెగులు తీవ్రంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్‌ తదితర మండలాల్లో శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఆకుల మీద, పువ్వులలో ఎక్కువ సంఖ్యలో నల్లి చేరి గోకి, రసం పీల్చడం వల్ల ఆకులు మాడిపోయినట్లుగా అవుతున్నాయి. ఆకుల పైభాగం పసుపు రంగుకు మారి, కింది భాగం ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. పువ్వులను ఆశించి గోకటం వలన గోధుమరంగుకి మారి రాలిపోతున్నాయి. గోధుమ రంగుకి మారిన పువ్వులు ఎండిపోయి రాలిపోవడం వల్ల కాయలు సంఖ్య తగ్గుతోంది. పురుగులు కాయ దశలో ఆశించటం వలన కాయలు గిడసబారి, ఇటుక రంగులోకి మారుతున్నాయి. మిరప తోటలు గుబ్బ తెగులు కారణంగా పనికి రాకుండా పోతున్నాయి. దీనివల్ల ఒక్కో రైతు ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి నష్టపోయి పంటను వదిలేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఒకప్పడు 10 లక్షల ఎకరాల వరకూ సాగైన పంట ఇప్పుడు 2 లక్షల లోపు ఎకరాలకు మాత్రమే పరిమితమైంది.

యూరియా అందక ఆపసోపాలు
వానాకాలం సీజన్‌లో మాదిరిగానే అన్నదాతలకు యాసంగిలో కూడా యూరియా అవస్థలు తప్పటం లేదు. ఎరువు కొరత రాకుండా ప్రభుత్వం యాప్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని తీసుకొచ్చినా సక్రమంగా అమలుకాక రైతులు పాట్లు పడుతున్నారు. రైతులు పీఏసీఎస్‌లు, దుకాణాల వద్ద పడిగాపులు కాయకుండా అవసరమైన మేరకే విడతల వారీగా తీసుకోవచ్చని వ్యవసాయాధికారులు ప్రత్యేక యాప్‌ రూపొందించి స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. తొలుత ఈనెల 20 నుంచి రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, తర్వాత అన్ని జిల్లాల్లో అమలు చేశారు. ఖమ్మం జిల్లాలో ఈనెల మొదట్లో అందుబాటులోకి వచ్చిన యాప్‌తో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మొదట్లో ఖమ్మం జిల్లాను ఫెర్టిలైజర్‌ యాప్‌లో చేర్చలేదని కొందరికి మెసేజ్‌ రావడం గమనార్హం. రైతుల ఆందోళనలతో దిగొచ్చిన అధికారులు పాస్‌బుక్‌ ఆధారంగా కూపన్లు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భోగి పండుగ రోజు కూడా ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద రైతులు కిటకిటలాడటం గమనార్హం.

కోటిన్నర ఎకరాలకు అందించే అవకాశం
సంక్రాంతికి ‘రైతు భరోసా’ వస్తుందని ఆశించిన రైతాంగానికి నిరాశే మిగిలింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రెండు విడతలుగా రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేసింది. 2024-25 యాసంగి సీజన్‌లో ఆలస్యంగా రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసినప్పటికీ, మొన్నటి వానాకాలం మాత్రం సరైన సమయంలోనే రైతు భరోసా అందించింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా రైతులకు పెట్టుబడికి అందేలా సంక్రాంతి నాటికే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. కానీ అదీ అమలు కాలేదు. గత వానాకాలం సీజన్లో 69.40 లక్షల మంది రైతులకు సంబంధించిన 145.73 లక్షల ఎకరాలకు రైతు భరోసా మొత్తాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇందుకోసం మొత్తం రూ. 8,74 కోట్లు వెచ్చించింది. ఈసారి కూడా దాదాపు అంతే మొత్తంలోగానీ, ఆ సీజన్‌లో మిస్సయిన ఇతర రైతులందరికీ కలిపి కోటిన్నర ఎకరాలకు అందించే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.

‘భరోసా’ కల్పించేందుకు ప్రభుత్వం సమాయత్తం
ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులు ఆశించిన మేర విజయాలు సాధించగా, కొత్త సంవత్సరం ప్రథమార్థంలో జిల్లా, మండల పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు యాసంగి రైతు భరోసాను ‘పెట్టుబడి సాయం’ కింద ముందుగానే అందజేయడం ద్వారా ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుందని అంచనా వేసిన సీఎం రేవంత్‌రెడ్డి అందుకనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసినట్టు సమాచారం. ఇప్పటి వరకు రైతు భరోసా ఇచ్చినట్టుగానే ఎలాంటి కోతలూ లేకుండా వ్యవసాయయోగ్యమైన భూములన్నింటికీ ‘రైతుభరోసా’ అమలు చేయాలని ఆయన ఆదేశించినట్టు తెలిసింది.

పండుగ చేసుకునేట్టులేదు
ఈ ఏడాది పండుగ చేసుకునేటట్టు లేదు. రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. భోగినాడు యూరియా కోసం వెంపర్లాడాల్సి వచ్చింది. వర్షాకాలం నుంచి యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అధిక వర్షాలతో పత్తి పోయింది. మిర్చికి గుబ్బ తెగులు వచ్చింది. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఇవి చాలదు అన్నట్టు యాప్‌లను తెచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. పంట పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
– వనవాసం రాంరెడ్డి, గుండెపుడి, మహబూబాబాద్‌ జిల్లా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -