ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ విడుదల చేయాలి : యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉద్యోగుల రెండో పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవి మాట్లాడుతూ. ఐదేండ్లకోమారు అమలు చేయాల్సిన వేతన సవరణను ఎనిమిదేండ్లవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం సమంజసం కాదన్నారు. గత ప్రభుత్వం 30 నెలలు ఆలస్యం చేసిందని, ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. ఇప్పటికే 32 నెలలు గడిచినందున ఇంకా జాప్యం చేయకుండా, పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని సంఘాలతో చర్చించి సమంజసమైన ఫిట్మెంట్‌తో 2023 జులై 1 నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని తప్పుబట్టారు.
2024 మార్చి నుండి రిటైరైన ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని, డిఎ వాయిదాలను విడుదల చేయాలని కోరారు. నూతన రాష్ట్రపతి ఉత్తర్వులు 2018కి అనుగుణంగా ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలను రూపొందించి డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ తదితర పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయడం ద్వారా విద్యాశాఖలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల సీఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కెేజీబీవీ, యుఆర్‌ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని, గురుకులాల్లో ఉపాధ్యాయులపై బోధనేతర పని భారం తగ్గిం చాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అయితే ఉద్యోగులు, పెన్షనర్లపై చందా భారాన్ని తగ్గించాలని. 1000 రూపాయల లోపు ఉండే విధంగా చూడాలని కోరారు.
ఉద్యోగుల నుంచి 1.5 శాతం వసూలు చేసి ప్రభుత్వం సైతం 1.5 వాటాదనం ఇస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ వాటా ఉంటుందా? ఉద్యోగుల డబ్బులని ప్రభుత్వం వాడుకుంటుందా? అని సందేహం పై చర్చ కొనసాగుతుందని అన్నారు. గురుకులాలు, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ పాఠశాలలు, కెజిబివి, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కూడా తొలిదశలోనే ఇహెచ్‌ఎస్‌ను అమలు చేయాలని అన్నారు .టెట్ మినహాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అర్హత మార్కులను తగ్గించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాస్ చారి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, ఉపాధ్యక్షురాలు బడుగు అరుణ, కోశాధికారి వడిత్య రాజు, జిల్లా కార్యదర్శులు మోర్తాల శ్రీనివాస్ రెడ్డి, నలపరాజు వెంకన్న, ఎ.చిన వెంకన్న, కొమర్రాజు సైదులు తదితరులు పాల్గొన్నారు.



