నవతెలంగాణ – తిరువనంతపురం : కేరళలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిడెడ్ స్కూల్స్‌లో పనిచేస్తున్న సుమారు 20,000మంది ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించనున్నట్లు బుధవారం ప్రకటించింది. రెండు వారాల్లోగా ప్రతిపాదనలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. క్రమబద్ధీకరణపై తుది తీర్పు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్‌కుట్టి బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో విభిన్న ప్రతిభావంతుల కోసం రిజర్వేషన్ల అమలు, ఉపాధ్యాయుల నియామకాలను ఆమోదించడం సహా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న న్యాయ సంక్లిష్టతలను పరిష్కరించడంలో భాగంగా ఈచర్య తీసుకున్నట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం 2017 ప్రకారం ఎయిడెడ్ పాఠశాలల్లో వారికి నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయడం తప్పనిసరి అని అన్నారు. గతంలో 1996 చట్టం ప్రకారం మూడు శాతం రిజర్వేషన్ ఉండేది. న్యాయ వివాదం కారణంగా ఎయిడెడ్ పాఠశాలల్లో కోటాను అమలు చేయడంలో జాప్యం చట్టపరమైన వివాదాలకు దారితీసిందని అన్నారు.
”1996 నుండి రిజర్వేషన్లను పునరాలోచించి అమలు చేయాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. అయితే అది ఇప్పటికే ఉన్న వేలాదిమంది ఉపాధ్యాయులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని ప్రభుత్వం వాదించింది. తర్వాత రాష్ట్రం అప్పీలు దాఖలు చేసిందని అన్నారు. డివిజన్ బెంచ్ తీర్పు ప్రకారం. 2021 తర్వాత నియమించబడిన ఉపాధ్యాయలును రోజువారీ వేతన స్థితికి తగ్గించినట్లు సమాచారం ఉంది” అని ఆయన అన్నారు.
నాయర్ సర్వీస్ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విభిన్న ప్రతిభావంతులకు కేటాయించిన పోస్టులను మినహాయించి, జనరల్ కేటగిరీ నియామకాలకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే ఎన్‌ఎస్‌ఎస్ పాఠశాలలకు మంజూరు చేసిన ప్రయోజనాన్ని ఇతర ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలకు కూడా విస్తరించాలని కోరుతూ రాష్ట్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని అన్నారు. అయితే కేసును ఏప్రిల్‌కు వాయిదా వేసినట్లు చెప్పారు. రాష్ట్రం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది న్యాయ సలహా ఆధారంగా, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్లు తుది ఫలితానికిలోబడి, ఇతర యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులను కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించిందని మంత్రి తెలిపారు.
ఎన్‌ఎస్‌ఎస్ పాఠశాలల్లో జనరల్ కేటగిరీ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. అన్ని ఎయిడ్‌ఎడ్ పాఠశాలల యాజమాన్యాలకు వర్తించేలా ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం చట్టబద్ధంగా సాధ్యమైనంతవరకు చెస్తోందని ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే.



