– రాజకీయ లక్ష్యంతోనే హిందూ మతంలో విలీనం చేయాలనే కుట్ర
– సంస్కృతి, సామాజిక అస్థిత్వంపై ఇతర మతాల ప్రభావం : సెమినార్‌లో మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు
నవతెలంగాణ-ముషీరాబాద్
జనగణనలో ఆదివాసులకు ప్రత్యేక కాలమ్ కేటాయించాలని మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు ప్రభుత్వాలను కోరారు. ఆదివాసులను హిందూ మతంలో విలీనం చేయాలన్న కుట్రను గుర్తించాలని, అది రాజకీయ లక్ష్యాలతో కూడినదని అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘం పూసం సచిన్ అధ్యక్షతన ‘జనగణనలో షెడ్యూల్ ట్రైబ్స్‌కు కాలమ్ కేటాయించాలి’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసులను హిందూ మతంలో విలీనం చేయాలన్న ప్రయత్నం పూర్తిగా రాజకీయ లక్ష్యంతో కూడినదనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. ఆదివాసులు చారిత్రకంగా గ్రామ, కుల వ్యవస్థకు దూరంగా అడవుల్లో జీవించారని, క్రమంగా వారు తమ భాష, మతం, సంస్కృతిని ఏర్పరచుకుని ప్రత్యేకతను నిలబెట్టుకున్నారని తెలిపారు. వారి పోరాటంలో వారి చరిత్రే ఆయుధంగా ఉందన్నారు. వారి ప్రత్యేక మత, భాష, సంస్కృతి ఉనికిని తొలగించడాన్ని వారి చరిత్రను చెరిపివేసే ప్రయత్నంగా చూడాల్సి ఉంటుందన్నారు.తెలంగాణలో 33 షెడ్యూల్ తెగలు ఉన్నాయని, వీరి జనాభా సుమారు 33 లక్షలని వివరించారు. వీరిలో కోయ, గోండి, కొలామీ, లంబాడా, ఎరుకల భాషలు మాట్లాడేవారు ఉన్నారన్నారు. వీరి భాషలకు లిపి లేకపోవడం వల్ల మనుగడ ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఐదో షెడ్యూల్ ప్రాంతంలో 1180 షెడ్యూల్డ్ గ్రామాలు, మైదాన ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో నివసిస్తున్నారని తెలిపారు. తరతరాలుగా గిరిజన తెగలు కొండలు, నదులు, చెట్లు, జంతువులను దైవంగా భావిస్తూ, ప్రకృతినే ఆరాధ్యదైవంగా కొలుస్తూ వస్తున్నారని తెలిపారు. విగ్రహారాధనకు దూరంగా, తమ సంప్రదాయ ఆచారాలు పాటిస్తూ.. ఇతర మతాలకు దూరంగా ఉంటున్నారని చెప్పారు. ఇటీవల ఇతర మతాల ప్రభావంతో వీరి సొంత సంస్కృతి, సామాజిక అస్థిత్వం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన జనాభా లెక్కల్లో గిరిజనులు ఇతర మతాల్లో నమోదయ్యారని, ఇది వారి ప్రత్యేక మత విశ్వాసాలను అస్పష్టంగా చూపుతోందని అన్నారు. 2027 జనాభా లెక్కల్లో మతం కేటగిరీలో ”షెడ్యూల్ తెగలు” లేదా ”ప్రకృతి ఆరాధకులు” అనే ప్రత్యేక కాలమ్ చేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్, ఎర్మ పున్నం, సహాయ కార్యదర్శులు ఆత్రం తనుష్, తొడసం శంబు, కోరేంగా మాలశ్రీ, దుగ్గి చిరంజీవి, అశోక్, భాగల రాజన్న తదితరులు పాల్గొన్నారు.
జనగణనలో ఆదివాసులకు ప్రత్యేక కాలమ్ పెట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES