Friday, February 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు

హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు

- Advertisement -

గాంధీనగర్‌ మహిళా వసతి గృహంలో పేలిన గీజర్‌
బాలాపూర్‌లో ఫుడ్‌ కోర్ట్‌లో మరో ప్రమాదం.. భారీ నష్టం

నవతెలంగాణ – ముషీరాబాద్‌/మీర్‌ పేట్‌
హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. గురువారం ముషీరాబాద్‌, బాలాపూర్‌లో రెండు చోట్ల మంటలు చెలరేగాయి. ముషీరాబాద్‌ గాంధీనగర్‌లోని ప్రయివేటు వసతి గృహంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుధామ ఉమెన్స్‌ హాస్టల్‌ వాష్‌ రూమ్‌లోని గీజర్‌ పేలి మంటలు మొదటి అంతస్తు అంతటా వ్యాపించాయి. గమనించి వెంటనే అప్రమత్తమైన పక్క హాస్టల్‌ యువకులు నిచ్చెన సహాయంతో అమ్మాయిలను సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు.

సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని 3 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేసింది. హాస్టల్‌లో ఉన్న దాదాపు 15 మంది విద్యార్థినులు బయటకు రావడంతో భారీ ప్రమాదం తప్పింది. సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. గీజర్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంతో బిల్డింగ్‌లో భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. విద్యార్థుల సర్టిఫికెట్లతోపాటు విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఫుడ్‌ కోర్ట్‌లో..
రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ చౌరస్తాలోని ఓ ఫుడ్‌ కోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది. పోలీసులు, హోటల్‌ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్‌ మండలం మీర్‌పేట్‌లోని బాలాపూర్‌ చౌరస్తా నుంచి బడంగ్‌పేట్‌ వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ఫుడ్‌ కోర్టులో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలెరేగాయి. అందులో పనిచేసే ఓ వ్యక్తి గమనించి మంటలను అర్పడానికి ప్రయత్నించాడు. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో హోటల్‌ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. హోటల్లో వస్తువులు, సామాగ్రి, కుర్చీలు, టేబుల్స్‌ పూర్తిగా కాలిపోయాయి. దాదాపు రూ.50లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -