నది చైతన్యం కవి నైజం ఒక్కటే అయినప్పుడు.. కవి కూడా సజీవధారవలె నిరంతరం సాగిపోతూ ఉంటాడు. ప్రవాహం కవిత్వమైతే ఆది పయనించే సాధనం వస్తువు, దాని ఒరవడిలయ మరియు అలికిడి మోతాదుల సింగారమే అభివ్యక్తి, కొండలూ లోయలూ ఎత్తుపల్లాలు ఒడిదుడుకులను దాటుకుంటూ సాగరసంగమమై, భూగోళం చుట్టూ పరివ్యాపితం కావడం కవిత్వ లక్షణం. ఆ కవిత్వాన్ని పాఠకుడు చదివి మునకలేసి, పులకరించి ఒడ్డుకుచేరి ఒంటిని ఆరబెట్టుకుంటూ నులివెచ్చని అనుభూతిని ఆస్వాదించటం, సర్వకాలాల ప్రళయాలకు తట్టుకొని తలెత్తుకొని నిటారుగా నిలబడగలుగడమే కవిత్వానికి సార్థకత.
చెట్టు కూలిపోవటం అనే ఊహ ఊహించతరం కానిది,రాకాసి తుఫాను గుట్టంత చెట్టును కొమ్మలను ఒడిసిపట్టి మెలితిప్పి వేళ్ళతో పెకిలించి నిలువనా కూల్చుతున్న దృశ్యం హృదయ విదారకం. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న మనిషి భళ్ళున ”చెట్టుకూలుతున్న చప్పుడు’ విని దిగ్గునలేచి హతాశుడై దిక్కులు చూడడం ఒక భీభత్స మానసిక స్థితి. కొండి మల్లారెడ్డి కవిత్వం ‘చెట్టు కూలుతున్న చప్పుడు’ చదువుతున్నపుడు.. చెట్టు కూలిపోవటమంటే చెట్టంత మనిషి నిలువునా కూలికాలి బూడిదైపోవడం.. అది ఎంత దుర్లభమో.. ”ఇంటి దుఃఖం’ కవితలో.
చెట్టంత మనిషి ఎత్తేంతో బోధపడలేదు కానీ/ కూలిపోయాకే తెలిసింది ఆ ఖాళీతనమంటే ఏమిటో/
…కష్టాల తాకిడికి పిడికెడు పిట్టైనా పర్వతమంత మనిషైనా గాయపడటం సహజమే..కానీ గాయాలను తడుముకుంటూ కూర్చోవడం కాదు..బ్రతుకును ఉత్సవంగా ఎలా మార్చుకోవాలో చెప్పిన కవిత.. ‘పలకరింపు’
”పాముతో తలపడుతున్న పక్షి తెగువను గమనించాలి/…తొడిమ తెగిపడేలోపు/ చిగురు పుట్టుకొస్తున్నంత స్వచ్ఛంగా/ బతుకొక ఉత్సవమని/ సరికొత్తగా నిర్వచించాలి..” సకలజీవులను సేదదీర్చే ఉద్యానవనానికైనా శిశిర వసంతాలుంటాయని, మనిషికీ మానుకు గల సారూప్యతను, జీవితంలోని మార్మికతను తేటతెల్లం చేస్తూ, పలుచబడిన మనసును ఎలా చిక్కబరచుకోవాలో ప్రబోధించింది ఈ కవిత.
కొన్ని జీవితాలను కంటికిరెప్పవలె కాపాడుతున్న కన్నతల్లి అడవి. వనరుల కోసం అడవి విధ్వంసమై, ఉండేలు దెబ్బకు పక్షులు చెల్లాచెదురై పోతున్నట్టుగా అడవి బిడ్డల..దుస్థితి.. ఇదొక వర్తమాన దుర్మార్గాన్ని ‘అడవి’ కవితలో.. ”పులి సంచరిస్తున్న కాలిబాట/ కొల్లగొట్టబడ్డ వనరు/ ఊపిరి సలుపకుండా ఉచ్చు బిగుస్తున్న కొండచిలువ” …మనిషంటే మాట్లాడడం.. మాట్లాడవలసిన చోట మాట్లాడలేక పోవడం, చెట్టై నీడను పరుచవలసిన చోట నిలబడి చూడటం,రాతి మనిషిలా శిలబారి పోవటం మనిషితనం కాదు.. ‘రాతి మనుషులు’ కవితలో.. ”మంచీ చెడుకు నడుమ కంచెలా నిలబడి / మాట్లాడవలసిన చోట మాట పెగులక/ నీటి బుడగల్లా పగిలిపోతున్నాం..” మనిషి తన మనసును విశాలం చేసుకోవడమే మనిషి ఉనికి..
కుళ్ళూ కుటిల మెరుగని తేట మనుషులు, తేనెలొలుకు పలుకులు పలుకక పోవచ్చు..ఆముదపు కాయవలె చిట్లవచ్చు, కుండబద్ధలు కొట్టి నడి వీధిలో సత్యాన్ని కుమ్మరించవచ్చును..
‘విత్తన భాష’ అనే కవితలో../ అబద్ధాలకు పూతలద్ది పైపై మెరుగులద్దే/ కనికట్టు విద్య అబ్బనందుకే/ కట్టే విరిచి పొయ్యిలో పెట్టినట్టుంటది.. నేటి భారతదేశ రాజకీయాలు.. ఎన్నికలూ వాగ్దానాలు.. సమాజాన్ని ఎంతగా భ్రష్టుపట్టిస్తున్నాయో.. ‘వాగ్దానం’ కవిత అద్దం పడుతున్నది. ”మల్లొక్కసారి మీ రక్తం ధారపోయండి/ నెత్తురు తడిసిన నేలలో విత్తనాలు నాటి/ రాజ్యాన్ని సేద్యం చేసుకుంటాం”
వారసత్వ రాజకీయాలు దోచుకున్న డబ్బుతో,ఎన్నికలను ఖరీదుగా మార్చి, చట్టసభల్లో ఆ కుటుంబాలే పాతుకు పోవడం చూస్తున్నాం.. ”వారసత్వపు ఊడల్ని బలంగా దింపుకునేందుకు/ ఇంకొంత కాలం/ మీ తలల్ని మా పాదాలకిందే వంచి ఉంచండి..”
విత్తం కోసం పరుగులు తీస్తూ.. కుటుంబ సభ్యులను.. ఇరుగుపొరుగును సైతం పట్టించుకొని మనిషి, తోటి మనిషి శాశ్వతంగా దూరమైనప్పుడు మనోవేదన చెందడం ఇదొక సామాజిక రుగ్మత.. ‘చేజారిపోయాక’ కవితలో కవి పడిన వేదన..
”ఎవరికెవరూకాని పరాయీకరణ వ్యామోహంలో/ చేరువౌవువుదామనుకున్న మనిషిని/ దూరం చేసుకుంటున్న ద్రోహకాలం..”
సేద్యం తెలిసిన కవి, తన జీవితానికి అన్వయించుకోవడం.. పంట పొలానికీ సమాజానికి లంకె కట్టి..అడ్డుతగిలిన ప్రతికూలతలను, దాని గాయాలను పాఠంగా తీసుకొని మెలకువతో సాగిపోతూ ‘నడక’ కవితలో..స్ఫూర్తి పొందిన తీరు..
”అయినా పంట మొక్కలతో/ నాకెప్పుడూ పేచీలేదు/ కలుపు మొక్కలతోనే నా కొట్లాట..”
‘ఒకరాత్రి.. అనేక దశ్యాలు’ కవితలో.. రైతు బ్రతుకు ఋతువు చేతిలోనో.. కాంటా పెట్టే హమాలీ చేతిలోనో చిక్కుకు పోయినప్పుడు..
నిరుద్యోగి ఎంతో కష్టపడి చదివి పరీక్ష వ్రాసిన తర్వాత లీకేజీ వ్యవహారం వార్త.. వచ్చినప్పుడు ఆయన కలం స్పందించాలి.
”వేటగాళ్ల వ్యూహాలేమిటో ఎంతకూ అంతు చిక్కవు/ పావురాలు ఉచ్చులో చిక్కుకునేదాకా/ఉపద్రవమేమిటో ఉనికిలోకి రాదు. మానవత్వం దయా దాక్షిణ్యం, భూతదయ, అక్షరాస్యత నిరక్షరాస్యతకు అతీతమైనవి.. మనిషిని ఉన్నతీకరించేది ఇవే.. మనిషిలోని ఈ గుణాలను దర్శించాలంటే కవికి, అందరిపట్లా సమదృష్టి, శ్రద్ధాసక్తులు, ప్రేమా,నిరంతరాయ పరిశీలన అవసరం.. ‘చెమటపువ్వుల చెట్టు’ కవిత బడిలో ఆయాపనిచేసే ఒకతల్లిని చూసి రాసినది..
”కుక్కలొస్తాయి కోతులొస్తాయి/ అదిలించొద్దు బెదిరించొద్దు/ బుక్కెడంత బువ్వపెడితే అవ్వే పోతాయి/ఎంతైనా ఆకలి కదా సార్”
జనన మరణాలు సహజమే..కానీ, మనిషి కాలధర్మం చేసిన మరుక్షణమే..అతడి మంచి చెడులు జ్ఞాపకాలు వలపోతల వరదలై ముంచెత్తుతాయి.. ‘రెండు కన్నీటి బోట్లు’ కవిత ద్వారా.. ”తొవ్వ పొడవూతా నువ్వు వెదజల్లిన/ జ్ఞాపకాల పరిమళాలు/ ఎద ఫలకంమీద పదిలంగా భద్రపరుచుకుంటాం..”
సమాజం కులమతాలు సిద్ధాంతాల సంఘర్షణలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చిక్కుకుపోయింది వాస్తవం..పిల్లలకు తమ అభిప్రాయాలను నూరిపోయడం వారిపై రుద్దడం కూడా చూస్తున్నాం.. ‘బహుశః’ కవితలో..
”కళ్ళకు రంగుటద్ధాలు దిగేయకండి/ చూడనీయండి వెలుగేదో నీడేదో అలవడుతుంది..
పిల్లలు స్వేచ్ఛగా ఎదుగనీయటం.. ఆత్మవిశ్వాసంతో మాట్లాడనీయడం కూడా చేయాలి..
”బహుశః కొన్నాళ్ళు పోయాక/ వాళ్ళ గుట్టు పసిగట్టి / పొరలు పొరలుగా వొలిచి నాలుగు రోడ్ల కూడలిలో /అనాచ్చాధితంగా నిలబెట్టగలిగేది వాడే..”
ఇందులోని మొత్తం నలుబదియొక్క కవితలు, క్షణం క్షణం మారే మనుషుల మనస్తత్వాలను, కాలానుగుణ మార్పులను, సమాజాన్ని బహువర్ణాలలో..వివిధ కోణాలలో దర్శింప చేస్తాయి..కవిత్వధార భాషా..మదువుగా మందలిస్తాయి..కొండి మల్లారెడ్డిగారు విషయాన్ని సూటిగా చెప్పడంలో కృతకృత్యులైనారు..
(ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ‘చెట్టు కూలుతున్న చప్పుడు’ ఆవిష్కరణ)
- పర్కపెల్లి యాదగిరి, 9299909516



