Friday, September 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండ్రగ్స్‌ డాన్‌ల వెన్నులో వణుకు

డ్రగ్స్‌ డాన్‌ల వెన్నులో వణుకు

- Advertisement -

వేటాడి అంతర్రాష్ట్ర ముఠాలు, డాన్‌లకు రాష్ట్ర పోలీసుల చెక్‌
రోజుల తరబడి ఇతర రాష్ట్రాల్లో పోలీసుల విచారణ
స్థలాలు మారుస్తున్న డ్రగ్స్‌ మాఫియా
హైదరాబాద్‌లో అడుగు పెట్టేందుకు వెనుకడుగు
ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ సరఫరా
ఏజెంట్లుగా యువత, ఉన్నతవర్గాలు, సెలబ్రిటీస్‌
గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ


నవతెలంగాణ-సిటీబ్యూరో
డ్రగ్స్‌ మాఫియా కోట్లు గడిస్తోంది. దేశంలోని ప్రముఖ పట్టణాలు డ్రగ్స్‌ మాఫియాకు అడ్డాగా మారాయి. యువకులు, విద్యార్థులు, ఉన్నతవర్గాలు, సీనీ పరిశ్రమలకు చెందిన వారితోపాటు ఐటీ ఉద్యోగులను ఎంచుకుని గుట్టుచప్పుడు కాకుండా గంజాయి, డ్రగ్స్‌ సరఫరా చేస్తూ కోట్లు గడిస్తున్నాయి. మాదక ద్రవ్యాలకు అలవాటై, బానిసలుగా మారిన వారినే టార్గెట్‌ చేస్తున్న ఈ మాఫియా వారిని డ్రగ్స్‌ సరఫరాదారులుగా, ఏజెంట్లుగా మారుస్తోంది. డ్రగ్స్‌ దందా రాష్ట్రంలోనూ పెరిగిపోయింది. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం విస్తృతంగా ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో మాదకద్రవ్యాలు, గంజాయిపై రాష్ట్ర పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో డ్రగ్స్‌ డాన్‌లకు గ్రేటర్‌ హైదరాబాద్‌ అంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. డ్రగ్స్‌ను క్షేత్రస్థాయి నుంచి నివారించాలని పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ మూడు పోలీస్‌ కమిషనరేట్ల పోలీసులతోపాటు ప్రత్యేకంగా నార్కోటెక్‌, ఈగల్‌ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దించింది. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట సూరారం, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఈగల్‌ బృందాలు ఓజీ వీడ్‌ అనే మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకుని పలువురు ఇంజినీరింగ్‌ విద్యార్థులను అరెస్టు చేశాయి. జూన్‌ నెలలో రాచకొండ పోలీసులు, ఈగల్‌ బృందాలు ప్రత్యేక నిఘావేసి రూ.5 కోట్ల విలువచేసే 935 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో గోవా, ముంబయి, రాజస్థాన్‌, బెంగళూర్‌, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు పారిపోతున్న డ్రగ్స్‌ మాఫియా అక్కడే అడ్డా పెడుతోంది. అక్కడి నుంచే దందా కొనసాగిస్తోంది.

ఒకటికి పదిసార్లు..
గ్రేటర్‌ హైదరాబాద్‌లో డ్రగ్స్‌, గంజాయితోపాటు ఇతర మాదకద్రవ్యాలను సరఫరా చేయాలంటే స్మగ్లర్లు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. వారు నేరుగా నగరానికి రాకుండా ఇక్కడి ఏజెంట్లనే ఇతర రాష్ట్రాలకు రప్పించుకుని డ్రగ్స్‌ను విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక పోలీసుల హస్తం ఉండటతో ఆయా రాష్ట్రాల్లో డ్రగ్స్‌ మాఫియా రెచ్చిపోతోంది. దర్యాప్తులో భాగంగా రాష్ట్ర పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి విచారణ చేపడితే ప్రధాన స్మగ్లర్లకు తెలిసిపోతోంది. దర్యాప్తుకు సైతం స్థానిక పోలీసులు సహకరించడం లేదని అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో రోజుల తరబడి రాష్ట్ర పోలీసులు అక్కడే నిఘా వేస్తున్నారు. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర పోలీసులు జాతీయ సంస్థల సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. వారి సహకారంతోనే పూర్తి స్థాయిలో డ్రగ్స్‌ స్మగ్లర్లను కట్టడి చేయగలమని ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఇందులో భాగంగా డీఆర్‌ఐ, ఎన్‌సీబీ లాంటి జాతీయ దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేస్తున్నారు.

డ్రగ్స్‌ డాన్లకు చెక్‌..
గోవా, ఢిల్లీ, ముంబయి, రాజస్థాన్‌, బెంగళూరు తదితర రాష్ట్రాల్లో అడ్డావేస్తున్న స్మగ్లర్లతోపాటు దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ, ఓజీ వీడ్‌ గంజాయి వంటి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు. హర్యానాకు చెందిన నరేంద్ర ఆర్య గోవాలో డ్రగ్స్‌ మాఫియాకు సూత్రధారి. పోలీసులు దాడి చేయకుండా భారీ భద్రత, అందుకు తోడుగా మేలిమి జాతి కుక్కలతో కాపలా ఏర్పాటు చేసుకున్నప్పటికీ రాష్ట్ర పోలీసులు ఆయన అడ్డాపై దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో స్థానిక పోలీసులు సహకరించకున్నా కింగ్‌పిన్‌కు బేడీలు వేశారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ డాన్లుగా పేరొందిన స్టార్‌ బారు, టోనీని సైతం అరెస్టు చేసేందుకు ముంబయి, ఢిల్లీలో ప్రయత్నించిన రాష్ట్ర పోలీసులపై దాడులు నిర్వహించినా చివరకు వారి ఆగడాలకు చెక్‌ పెట్టారు. ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల్లో రాష్ట్ర పోలీసులు ఐదారు కిలోమీటర్లు ఛేజింగ్‌ చేసి వేర్వేరు చోట్ల డ్రగ్స్‌ మాఫియాను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన స్మగ్లర్లను పట్టుకునే సమయంలో పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.

కోడ్‌ భాషలో సరఫరా..
బీటెక్‌, ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత చదువులు చదువు కున్న విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, సంపన్నుల పిల్లలను, యువతను టార్గెట్‌ చేసుకుని డ్రగ్స్‌ దందా కొనసాగిస్తున్న డ్రగ్స్‌ మాఫియా కోడ్‌ భాషలో ఐడీలు క్రియేట్‌ చేసి డ్రగ్స్‌ వివరాలు, వాటి రేట్లను ప్రదర్శిస్తున్నారు. ఎక్కడా పోలీసులకు చిక్కకుండా కొన్ని సందర్భాలల్లో కొరియర్‌లో సరఫరా చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట సీతాఫల్‌మండిలో టాస్క్‌ఫోర్సు పోలీసులు, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు సరఫరాదారులను అరెస్టు చేశారు. వారి నుంచి ఏండీఏంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే తరహాలో నార్కోటెక్‌, ఈగల్‌ బృందాలు పలుముఠాలను అదుపులోకి తీసుకుని భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -