Saturday, July 26, 2025
E-PAPER
Homeజాతీయంకేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత

- Advertisement -

– 80 శాతానికి పైగా ఖాళీగా ఉన్న రిజర్వ్‌డ్‌ కేటగిరీ స్థానాలు
– రాజ్యసభకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ :
ఓబీసీ, ఎస్టీ కేటగిరీల కింద కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మంజూరైన ప్రొఫెసర్‌ పోస్టులలో 80 శాతానికి పైగా ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. రాజ్యసభలో ఆర్జేడీ సభ్యుడు మనోజ్‌ కుమార్‌ ఝా అడిగిన ప్రశ్నకు విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్‌ సమాధానమిస్తూ కేంద్ర విశ్వవిద్యాలయాలలో కేటగిరీల వారీగా మంజూరైన, భర్తీ చేసిన ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల సమాచారాన్ని తెలియజేశారు. దాని ప్రకారం…ఓబీసీ కేటగిరీ కింద 423 ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరు కాగా కేవలం 84 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. ఎస్టీ కేటగిరీలో 144 పోస్టులు మంజూరు కాగా 24 భర్తీ అయ్యాయి. అంటే 83 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న మాట. ఎస్సీ కేటగిరీలో 308 ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరైతే 111 పోస్టులను భర్తీ చేశారు. ఈ కేటగిరీలో 64 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి అందజేసిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇక జనరల్‌ కేటగిరీ విషయానికి వస్తే 1,538 పోస్టులు మంజూరు కాగా 935 భర్తీ అయ్యాయి. ఈ కేటగిరీలో 39 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల ఖాళీలకు సంబంధించి ఎస్టీ కేటగిరీలో 307 పోస్టులకు 108, ఓబీసీ కేటగిరీలో 883 పోస్టులకు 275 భర్తీ అయ్యాయి. జనరల్‌ కేటగిరీలో 3,013 పోస్టులు మంజూరు కాగా 2,533 పోస్టులను భర్తీ చేశారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల విషయానికి వస్తే ఖాళీలు తక్కువగానే ఉన్నాయి.
ఓబీసీలలో 2,382 పోస్టులకు 1,838, ఎస్టీలలో 704 పోస్టులకు 595, ఎస్సీలలో 1,370 పోస్టులకు 1,180 పోస్టులు భర్తీ అయ్యాయి. జనరల్‌ కేటగిరీలో 6,285 పోస్టులకు 5,786 పోస్టులను భర్తీ చేశారు. మొత్తంగా చూస్తే దేశంలోని 56 సెంట్రల్‌ యూనివర్సిటీలలో 18,951 ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 10,836 జనరల్‌ కేటగిరీకి, 2,310 ఎస్సీ కేటగిరీకి, 1,155 ఎస్టీ కేటగిరీకి, 3,688 ఓబీసీ కేటగిరీకి చెందినవి. మంజూరైన 18,951 పోస్టులలో 14,061 పోస్టులను భర్తీ చేశారు. వీటిలో 9,254 జనరల్‌ కేటగిరీ, 1,599 ఎస్సీ, 727 ఎస్టీ, 2,197 ఓబీసీ కేటగిరీకి చెందినవి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -