ఘనంగా అకాడమీ స్నాతకోత్సవం.. 120 మందికి పట్టాల ప్రదానం ఫ్యాషన్ రంగంలో అపార అవకాశాలు: ప్రొఫెసర్ ఆనంద్ రావు
నవతెలంగాణ – హైదరాబాద్ : నగరంలోని హీథమ్స్ (HIITMS – హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్) అకాడమీ వార్షిక వేడుకలు అంబరాన్నంటాయి. గురువారం నగరంలోని వివాహ రిసార్ట్‌లో నిర్వహించిన ‘యూత్ ఫెస్ట్ – స్నాతకోత్సవం 2026’ విద్యార్థుల కేరింతలు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య ఉత్సాహంగా సాగింది.ఫ్యాషన్ డిజైన్, మేకప్ ఆర్టిస్ట్రీ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన 120 మంది విద్యార్థులకు ఈ వేడుకలో పట్టాలను ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన JNAFAU-CFA ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.ఎల్. ఆనంద్ రావు మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయం తర్వాత వస్త్ర, ఫ్యాషన్ రంగమే రెండో అతిపెద్ద పరిశ్రమ అని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్యాషన్ రంగంలో యువతకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
40 శాతం స్కాలర్‌షిప్: డైరెక్టర్ రఫీ
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అకాడమీ డైరెక్టర్ రఫీ ఎం. మాట్లాడుతూ.. భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా మార్చాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. యువతను ప్రోత్సహించేందుకు అకాడమీ తరపున విద్యార్థులందరికీ 40 శాతం స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నట్లు ప్రకటించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ ఏ.ఆర్. కమల్ రాయ్ విద్యార్థుల నైపుణ్యాలను అభినందించారు.
నృత్యాలతో హోరెత్తించిన యువత
స్నాతకోత్సవం అనంతరం జరిగిన యూత్ ఫెస్ట్‌లో విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ, పాశ్చాత్య నృత్యాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫ్యాషన్ రంగంలో తమదైన ముద్ర వేయాలనే పట్టుదలతో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. కార్యక్రమంలో అకాడమీ సిబ్బంది సల్మా, పరశురాం, ముస్కాన్, దీక్షిత్, విఘ్నవి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అమీర్‌పేట కేంద్రంగా పనిచేస్తున్న హీథమ్స్ అకాడమీ ఫ్యాషన్ డిజైన్, మేకప్ ఆర్టిస్ట్రీ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నైపుణ్య శిక్షణ అందిస్తూ యువతకు ఉపాధి మార్గాలను చూపుతోంది.



