Tuesday, December 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫోన్‌ట్యాపింగ్‌లో కీలక పరిణామం

ఫోన్‌ట్యాపింగ్‌లో కీలక పరిణామం

- Advertisement -

మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ నవీన్‌చంద్‌లను ప్రశ్నించిన సిట్‌
మూడోరోజు కొనసాగిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు విచారణ


నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో అసలు మూలాలను కనుక్కోవడానికి సిట్‌ అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ నవీన్‌చంద్‌లను విచారించించినట్టు తెలుస్తోంది. అంతకముందు వారిని విచారించడానికి సిట్‌ నోటీసులు ఇచ్చింది. ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ఈ ఇద్దరు అధికారులను నోటీసులో కోరింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ చేసిన ఐజీ ప్రభాకర్‌రావును అత్యంత కీలకమైన ఎస్‌ఐబీ ఓఎస్డీగా నియమించడానికి ఎలాంటి నిబంధనలను పాటించారనీ, అందుకు ఏ నియమాలు అనుమతించాయనీ, అసలు ఆయనను నియమించడానికి ఎవరు ఆదేశాలిచ్చారనే కోణంలో సోమేశ్‌కుమార్‌, నవీన్‌చంద్‌లను విచారించారని తెలిసింది.

అలాగే ఫోన్‌ట్యాపింగ్‌ జరపడానికి అవసరమైన ఫోన్‌నెంబర్లను వీరు ఇచ్చారా? ఇస్తే ఏయే నెంబర్లు ఇచ్చారని కూడా వీరి నుంచి సమాచారాన్ని సిట్‌ అధికారులు తీసుకున్నట్టు విశ్వసనీయంగా సమాచారం. కాగా అప్పటి మరో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారీలను కూడా సిట్‌ విచారించే అవకాశమున్నదని తెలిసింది. ఇదిలా ఉండగా.. తమ కస్టడీలో ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును సోమవారం మూడో రోజు కూడా సిట్‌ అధికారులు ప్రశ్నించారు. ప్రభాకర్‌రావును.. సిట్‌ చీఫ్‌గా ఉన్న సజ్జనార్‌ సైతం కొద్ది సేపు విచారించినట్టు తెలిసింది. అయితే సిట్‌ అధికారుల ప్రశ్నలు పూర్తిగా ఫోన్‌ట్యాపింగ్‌లు జరపడానికి అసలు కారకులు ఎవరనే విషయమై దృష్టిని సారించినట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -