కేంద్రం తీసుకొచ్చిన యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించడమే కాక, ఇవి వివక్ష ఆధారితంగా, సమాజాన్ని చీల్చేలా, ప్రమాదకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఇది కేంద్ర అసంబద్ధ విధానానికి చెంపపెట్టు. సుప్రీం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల ప్రకటించిన ‘ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వ ప్రోత్సాహక నియమావళి-2026’ రూల్స్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. రిజర్వుడు కేటగిరీల కిందకు రాని విద్యార్థులు, బోధనా సిబ్బందికి రక్షణ కల్పించే విషయమై న్యాయస్థానంలో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ డాక్టర్ సూర్యకాంత్ మిశ్రా, జస్టిస్ బాగ్చిలతో కూడిన బెంచ్ నిబంధనల్లోని అసమానత్వాన్ని ఎత్తిచూపింది.
సమానత్వం కోసమంటూ యూజీసీ తెచ్చిన నిబంధనలు విభజనకు దారితీసేలా ఉండటమే ఆందోళనలకు ప్రధాన కారణం. మొదట్లో ఈక్విటీ కమిటీల ఏర్పాటును వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా సమర్థించాయి. అయితే, కొత్త రూల్స్‌లో కుల వివక్ష నిర్వచనాన్ని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేసింది. దీంతో జనరల్, ఇతర కేటగిరీలకు చెందినవారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. ఈ సెగ ఢిల్లీలోని యూజీసీ ప్రధాన కార్యాలయానికి కూడా తాకింది. లోపాలను తక్షణమే సరిదిద్దాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేస్తూ, సమానత్వాన్ని దెబ్బతీసే అంశాలను లేవనెత్తింది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం కుల ఆధారిత వివక్షను తగ్గించడమే ఈ నిబంధనల లక్ష్యమని చెబుతున్నది. మరి అనుమానాల్ని, భయాల్ని నివృత్తి చేసే చర్యలకు ఎందుకు పూనుకోవడం లేదన్నదే ప్రశ్న.
ఈ నిబంధనలను రాజ్యాంగంలోని 14వ అధికరణ నుండి రూపొందించింది. ‘2012’ మాదిరిగానే సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు ప్రతిస్పం దనగా వీటిని తీసుకొచ్చింది. కానీ, మరికొన్ని అంశాలను జోడించింది. నిషేధిత ప్రవర్తనను కులం, తెగ ఆధారిత వివక్షగా నిర్వచించడం. క్యాంపసుల్లో సమాన అవకాశాల కేంద్రాలు (ఈవోసీ), సమానత్వ కమిటీల వంటి నివారణ పరిష్కార యంత్రాంగం ఏర్పాటు చేయడం. అమలులో వైఫల్యాన్ని నిబంధనల ఉల్లంఘనగా గుర్తించి సంస్థలపై చర్యలు తీసుకోవడం, జరిమానాలు విధించడం ఉన్నాయి.అయితే, ఇవి యూనివర్సిటీలకు, వాటి అనుబంధ కళాశాలల్లో తప్ప ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి కేంద్ర సంస్థల్లో అమలు కావు. ఇక్కడ కూడా అమలు చేయాలనేది వస్తున్న డిమాండ్. ఇంకా చెప్పాలంటే కొత్తవాటిలో వివక్ష నిర్మూలన పేరుతో కేంద్రం నియంత్రణ కనిపిస్తున్నది. వీసీలు, అధ్యాపకుల నియామకాలలో గవర్నర్-యూజీసీ నామినీల ఆధిపత్యం పెరిగేలా కమిటీ నిర్మాణాన్ని మార్చింది. నెట్/పిహెచ్డీ వంటి వంటి అర్హతలను కఠినతరం చేసి అర్హతల పేరుతో బహిష్కరణకు దారితీసే విధానాన్ని ప్రవేశపెట్టింది.
రాష్ట్రాల పాత్రను తగ్గించి యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కేంద్రీకృత విధానంలోకి నెట్టేలా చేసింది. వివక్షను సైతం సమగ్రమైన రీతిలో నిర్వచించడంలో కేంద్రం అసమర్థత కనిపిస్తోంది. విద్యాసంస్థల్లోని వాస్తవికతలను గమనంలోకి తీసుకోలేదు. విద్యార్థులు, బోధనాసిబ్బంది ఎదుర్కొంటున్న అన్ని రూపాల్లో వివక్షను తెలుసుకుని, నిర్వచించి, గుర్తించి, నిర్మూలించడం ముఖ్యం. సమానత్వ కమిటీకి ఎవరిని ఎంపిక చేస్తున్నారన్నది కూడా ప్రధానమే. ఇది విద్యాసంస్థల అధిపతి ఇష్టాఇష్టాలకు వదిలేయరాదు. విశ్వసనీయత, జవాబుదారితనం ఉండేలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన విద్యార్థి, ఫ్యాకల్టీ, బోధనయేతర సిబ్బంది ప్రతినిధులతో ఆ కమిటీని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే, ఎంపిక కమిటీల్లో వీసీ నామినీల ప్రాధాన్యం పెరగడం వల్ల రాజకీయ జోక్యానికి అవకాశం ఉంటుంది. విమర్శనాత్మక ఆలోచనలు గల అధ్యాపకులు పక్కనపడే పరిస్థితి వస్తుంది.
అలాగే, కమిటీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చే అప్పీళ్లను విచారించేందుకు ఆంబుడ్స్‌మన్‌ను నియమించాల్సిన అధికారాన్ని కూడా రాష్ట్రాలకే ఇవ్వాలి. అసెంబ్లీలు చేసిన చట్టాల కింద అనేక యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. అందుకు రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలకు కట్టుబడాలి. వివక్షను రూపుమాపుతామని చెప్పే కొత్త నిబంధనలు విద్యను మరింత కేంద్రీకృతం చేసి అసమానత్వానికి దారితీసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. పారదర్శకత పేరుతో ప్రజాస్వామ్య నియంత్రణను తగ్గించి నామినీల ఆధిపత్యాన్ని పెంచడం యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని కాలరాస్తుంది. సమిష్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే కులవివక్షను సమర్ధవంతంగా ఎదుర్కోగలం. ఇందులో రాష్ట్రాల పాత్ర, సామాజిక న్యాయం, అకాడమిక్ స్వేచ్ఛ ముఖ్యం. దీనికి విద్యార్థులతో పాటు అన్నివర్గాల ఐక్యత అవసరం. లేదంటే ఈ నిబంధనలు వివక్షను తుడిచేయడం కాదు, అసమానతను సంస్థాగతంగా స్థిరపరుస్తాయి. ఏమైనా సుప్రీంకోరు స్టే ఆహ్వానించదగినది. తదుపరి విచారణ మార్చి పందొమ్మిదిన జరగనుంది. ఆలోపు నిబంధనల్ని సవరించి కేంద్రం తన తప్పు సరిదిద్దుకోవాలి.
చెంపపెట్టు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



