మన దేశంలో చాలామంది పేద కళాకారులు తమ పొట్ట నింపుకోవడం కోసం అష్టకష్టాలు పడుతుంటారు. వాళ్ళని పోషించడానికి వాళ్ళ కళే ఆధారమవుతుంటుంది. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వీథుల్లో బాగోతాలు ఆడుతూ, వినోదాలు చేస్తూ, వాయిద్యాలు మోగిస్తూ, పాటలు పాడుతూ ఉంటారు. చూసే జనం వాళ్ళ కళను మెచ్చి, వాళ్ళపై జాలి చూపించి ఎంతో కొంత ఇస్తే దానినే మహాప్రసాదంగా స్వీకరించి వెళ్లిపోతుంటారు. అలాంటి పేద కళాకారుల జీవితాల్ని మన కళ్ళముందుంచుతుందీ పాట. మహాకవి గుర్రం జాషువా రాసిన సినిమాపాట ఇది. 1959 లో డి.యోగానంద్ దర్శకత్వంలో వచ్చిన ‘వచ్చిన కోడలు నచ్చింది’ సినిమాలోని ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
మహాకవి, పద్మభూషణ్ డా.గుర్రం జాషువా గురించి తెలుగు సాహిత్య లోకానికి పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతీ తెలుగువాడి నాలుకపై జాషువా పద్యం నాట్యం చేస్తుంటుంది. ‘గబ్బిలం’, ఫిరదౌసి’, క్రీస్తుచరిత్ర’ లాంటి కావ్యాలతో ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో ఒక శకాన్ని సష్టించిన మహాకవి జాషువా తెలుగు సినీరంగంలోకి ప్రవేశించి ఒకే ఒక్క సినిమాపాట రాశాడు. ఆ పాటే ఇది. ఆయన రాసిన పద్యాలెన్నో చాలా సినిమాల్లో సందర్భానుగుణంగా వాడుకున్నారు. కాని ఈ పాట అలా సందర్భాన్ని బట్టి వాడుకున్నది కాదు. జాషువా సినిమా కోసమే రాసిన పాట ఇది. ఆ పాటనిపుడు చూద్దాం.
బక్కచిక్కిన శరీరాలతో ఊరూరా తిరుగుతూ, పోషణ కోసం ఎన్నో బాధలు పడే పేద కళాకారుల జీవితాల్ని పట్టి చూపించాడీపాటలో జాషువా. వెన్నెల పరుచుకున్న దారుల్లో పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, ఊరేగింపులా వచ్చిన జనాన్ని అలరిస్తూ, నవ్విస్తూ వినోదాన్నిస్తూ వచ్చిన డబ్బులతో తమ ఖాళీ కడుపుల్ని నింపుకుంటుంటారు వాళ్ళు.
వారి పాటలో గాయాల స్వరాలు పాయలుగా సాగుతున్నాయి. లోన మానని గాయాలున్నా, చెప్పుకోలేని కష్టాలున్నా పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. ఆడుతుంటారు. పాడుతుంటారు.
అమ్మలూ..అయ్యలూ అంటూ సంబోధిస్తూ పాటను ప్రారంభిస్తారు. ఇవి వందపైసలుంటేనే గడిచే రోజుల కాలం..భయపడడం ఎందుకు..ప్రమాదం లేదులే..అంటూ తమను తాము సమర్థించుకుంటూ ఇలా అంటున్నారు. వినూ ఓ చిన్న బాబూ..డబ్బు ఉన్న సాబూ..చూడండి. మేం పేదవాళ్ళం. గతిలేని వాళ్ళం..ఏది మీ జేబు..చూపించండి. ఆ జేబులో ఉన్న రూపాయి మాకు ఇవ్వండి అంటూ అడుక్కుంటారు.
ఈ రోజులు స్వార్థపు రోజులు. డబ్బులు అడిగే బిచ్చగాళ్ళను ధనవంతులు చులకనగా చూస్తూ, ఈసడించుకుంటూ దూరంగా నెట్టివేస్తుంటారు. వాళ్ళ కష్టాన్ని పట్టించుకోకపోగా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటారు. మేము ఎవరి కడుపులు కొట్టలేదు. మాకు తెలిసిన విద్య ద్వారా, కళ ద్వారా పదిమందికి వినోదాన్నిచ్చి, ఆనందింపజేసి వారిచ్చే అణా నో, పదిపైసలో తీసుకొని సంతోషంగా వెళ్ళిపోయే వాళ్ళం. మీరు డబ్బులు ఇచ్చి మరిచిపోవచ్చు. కాని మీ దగ్గర తీసుకున్న డబ్బులతో కడుపు నింపుకున్న మేము మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. అంటూ వాళ్ళు దీనంగా వేడుకుంటారు.
ఇది గానా భజానా..ఇది వినోదాలకు ఖజానా..రండి..చూడండి. వచ్చి ఆనందించండి. అంటూ పాడుతుంటారు. వాళ్ళు మొత్తం ముగ్గురుంటారు. ఒకడు మగవాడు..వాయిద్యాలు వాయిస్తూ గెంతుతూ ఉంటే, ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఒకరి స్వరానికి ఒకరు వంత పాడుతూ అడుక్కుంటారు. ఇది కులాసా కాదు అన్నా..మీకు వినోదం కలిగించడానికి ఈ వేషం వేశాం..కాని మేం మా సరదా కోసం వేయలేదు. ఇది కూటికోసం మేం వేసిన వేషం. కూటికోసం కోటివిద్యలు అంటారు కదా..అలా కూటికోసం వేసే కోటివేషాల్లో ఇదొకటి. తమాషా బతుకుమాది..దొరల జేబుల దాగియున్న రూపాయి దయతో మా చెంతకు వస్తే చాలు మా బతుకు బండి నడుస్తుంది..అని అంటున్నారు. పైసా ఇస్తే సలాం పెడతాం. మీరు పైసా ఇవ్వకపోయినా మేం ఏమీ అనం. గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతాం.. అందరూ డబ్బులు ఇవ్వకపోవచ్చు. కొందరే ఇవ్వొచ్చు. మరికొందరు కట్టుకుని విడిచిన పాత వస్త్రాలు ఇస్తారు. తినే ఆహారపదార్థాలు ఇస్తారు. ఏది ఇచ్చినా తీసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అంతేకాని మాకిదే కావాలి. ఇది వద్దు..అంటూ డిమాండ్ చేసేవాళ్ళం కాదు.
మా పై జాలి చూపించండి. మమ్మల్ని కనికరించండి. మా బతుకుబండిని ముందుకు నడిపించండి. ఘరానా బాబులు మీరంతా.. మా గోడు వినండి. మా తమాషా బతుకులు చూడండి.. అంటూ ఆడుతుంటారు. పాటలు పాడుతుంటారు. ఒక వీథి నుంచి ఇంకో వీథికి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరుకి వెళుతుంటారు. ఇది పగటి వేషాలు వేసుకునే అమాయకుల జీవితాల్ని ప్రతిఫలింపజేసే పాట..
గుర్రం జాషువా అంటేనే వేదనాభరితమైన జీవితానుభవంతో మానవ జీవితాల్ని వ్యాఖ్యానించిన కవి. ఆయన పద్యాల్లో కరుణరసమే ప్రధానంగా కనిపిస్తుంది. అస్పశ్యత, ఈసండింపులు.. చెలరేగిన సమాజాన్ని గురించి తన పద్యాల్లో పట్టి చూపించిన జాషువా ఇలాంటి పాటను రాశాడేమిటి అనుకోవడానికి వీలు లేదు..ఎందుకంటే..సినిమాకవి ఎలాంటి పాటైనా రాయడానికి సిద్ధంగా ఉండాలి. అయినా..ఈ ఈ పాట వినోదాత్మకంగా కనబడుతున్నా ఇందులో పేద కళాకారుల కన్నీటి జీవితాలు కనబడుతున్నాయి. స్వతంత్ర భారతంలో ఇంకా.. ఆకలితో అలమటించే ఇలాంటి అమాయకులున్నారని స్పష్టంగా తెలుస్తోంది. సినిమాకవిగా నిలబడడానికి పుష్కలమైన లక్షణాలు ఉన్నవాడు కవి. కాని అతనికి సినీపాటల రచన అంత పెద్దగా నచ్చకే రాయలేదు. ఈ పాటలో సునో, దేఖో, గరీబు, సాబు, జరాసైరో, సలాం..వంటి ఉర్దూపదాలు.. అలవోకగా ప్రయోగించారు.
ఇది సినిమా కోసం రాసిన పాటే అయినా మనకు ఊరి ఊరిలో, వీథి వీథిలో కనిపించే పేదల బతుకుల గాథల్ని మన కళ్ళ ముందుంచుతుంది.
పాట:
అయ్యలూ.. అమ్మలూ.. ఇవే నూరు నయా పైసల రోజులూ/ బెదరిపోనేలా హారు రె..రాం.. హారు ప్రమాదము లేదులే/ బాబు జరాసైరో/ జరాసైరో జరాసైరో/ సునో చిన్న బాబూ మనీ ఉన్న సాబూ/ దేఖో హం గరీబూ ఏది పక్క జేబు/ ఇదే గానాభజానా వినోదాల ఖజానా.. రారండీ/ ఓ ఘరానా బాబులూ..ఓ బడా షరాబులూ/ దేఖో హం గరీబూ..ఏది పక్క జేబు/ కులాసా కాదు భాయీ/ కూటి కోసం కోటి వేషాలు/ తమాషా తమాషా బ్రతుకు మాదీ/ దొరల జేబుల దాగియున్నాదీ/ దయతో సాగిపోతుంది/ తమాషా సాగిపోతుంది/ పైసా ఇస్తే సలాం పెడతాం/ సలాం..సలాం పయిసా నైతో గుడ్ బై కొడతాం.. గుడు బై..వినండి/ మొగాన చెప్పేశాం/ చెప్పేశాం/ ఘరానా బాబులు మీరండీ/ తమాషా బ్రతుకులు మావండీ.
డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682