వీరావేశంతో అన్యాయం పైకి విరుచుకుపడ్డ యోధుడు తాను చేసే ఉద్యమంలో తనకు మరణం తప్పదని తెలుసుకుంటాడు. తను మరణించే సమయం దగ్గరపడగానే.. తాను మరణించినా తన ఆశయం మరణించకూడదని కోరుకుంటాడు. తన ఉద్యమావేశాన్ని తనలాంటి మరో యోధునికి పంచాలని కోరుకుంటాడు. తన వారసత్వానికి సరైన వాడిని ఎన్నుకొని అతనికి తన ఉద్యమావేశాన్ని పంచుతాడు. అలా వారసత్వాన్ని అప్పగించేటప్పుడు ఏమేమి వారసత్వంగా అందిస్తున్నాడో పాట రూపంలో చెబుతాడు. అదే ఈ పాట.. అభ్యుదయకవి శివసాగర్ రాసిన పాట ఇది. 1998 లో ఎన్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీరాములయ్య’ సినిమాలోని ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
శివసాగర్ గొప్పకవి. విప్లవ భావాలు రంగరించి మహోజ్జ్వలమైన ఉద్యమగీతాలు రాసిన కవి. ఈ పాటలో మహోద్యమ చైతన్యాన్ని నింపాడు శివసాగర్. ఈ పాట ఆయన సినిమా కోసం రాసింది కాదు. 1970 దశకంలో ఖమ్మం జిల్లా శబరి నదీ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు కొంతమంది గిరిజనులు ‘మామ తెచ్చిన కొత్త చీర నీకిస్త అల్లుడా’ అనే జానపదాన్ని పాడుకుంటూ ఉండగా అది విన్న శివసాగర్ కి ఆ పాట నచ్చి, ఆ పాట ప్రేరణతో, లయతో ఈ పాట రాశాడు.
1967లో పశ్చిమబెంగాల్ ప్రాంతంలో ఉద్భవించిన నగ్జల్ బరీ ఉద్యమప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ ఉద్యమ ప్రభావంతో ‘నేలతల్లి చెరను విడిపించగా’ అనే శీర్షికతో ‘ఈ విప్పపూల చెట్ల సిగల..’ అనే పాటను రాశాడు శివసాగర్.
రాయలసీమ సూర్యుడిగా పేరుగాంచిన పరిటాల శ్రీరాములు జీవిత వృత్తాంతాన్ని ఆధారంగా చేసుకుని ‘శ్రీరాములయ్య’ సినిమా నిర్మించబడింది. ఇందులో శ్రీరాములయ్య అన్యాయాన్ని ఎదిరించి జైలుకి వెళతాడు. ఆ సమయంలో కామ్రేడ్ సత్యం అతనికి పరిచయమవుతాడు. అతడి ఆశయాలు, అతడి జీవితం శ్రీరాములయ్యని ప్రభావితం చేస్తాయి. సత్యంకి శ్రీరాములయ్య తనకు వారసుడిలాగా కనిపిస్తాడు. తనకు కోర్టు మరణశిక్ష విధించడంతో తాను చనిపోయేలోగా తన వారసత్వాన్ని శ్రీరాములయ్యకి అప్పగించాలనుకుంటాడు. ఆ సమయంలో ఈ పాట వస్తుంది. ఇదీ సినిమా సందర్భం.
ఒక ఉద్యమకారుడు ఇంకొక ఉద్యమకారునికి పంచే ఆస్తులు ఏముంటారు. ఇద్దరూ అరాచకాలను, అన్యాయాలను ఎదిరించేవాళ్ళే. కాబట్టి విప్పపూల చెట్ల సిగలో దాచిపెట్టిన విల్లంబులు.. అనగా ధనుర్బాణాలు నేను నీకు ఇస్తాను. వాటిని తీసుకో, యుద్ధాన్ని నడిపించు అని అంటాడు. అంతేకాదు.. లహర్ జ్వాల.. దారుల్లో దాచిపెట్టిన బల్లెములు కూడా నీకిస్తాను. అవి మనం చేసే ఉద్యమానికి ఉపయోగపడే అసలు సిసలైన ఆయుధాలు. వాటిని తీసుకో..అంటూ సత్యం శ్రీరాములయ్యకి చెబుతాడు. సత్యం చెప్పే ప్రతీ మాటలో ఆవేశం, ఆక్రోశం కనిపిస్తాయి. రైతుల పట్ల కొందరు అవినీతిపరులు చేసిన అకృత్యాలు, కుట్రలు.. శ్రీరాములయ్యని కలచివేశాయి.. ఆ తిరుగుబాటు ధోరణి అతని నరనరాన ఉన్నది కాబట్టే సత్యం చెప్పే ప్రతీమాట అతనికి ఎంతో ఉత్తేజంగా ఎక్కిందని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు.
అలాగే.. వరంగల్, ఖమ్మం మధ్య ప్రాంతంలో ఉన్న గార్ల రైల్వే స్టేషన్ దగ్గర ఉద్యమకారులు లాక్కున్న రైఫిల్లు నీకిస్తాను తమ్ముడా.. అంటాడు. శ్రీకాకుళం ప్రాంతంలోని రూపాయి కొండ దగ్గర సిపాయిల పీకలు అరాచకంగా కోసారు. అవి నీకిస్తాను అంటాడు. అంటే.. ఆ ఊచకోతను నువు దృష్టిలో ఉంచుకొని ఆ అకృత్యాలు చేసిన వారి పనిపట్టాలని చెప్పినట్టుగా భావించవచ్చు. బొడ్డాపాడు, పోతుగడ్డ, గరుడభద్ర ప్రాంతాల్లో అమాయక ప్రాణులపై ఎన్నో మెరుపు దాడులు జరిగాయి.. ఎన్నో ప్రాణాలు పోయాయి. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ అలా దాడి చేసిన వారిపై విరుచుకుపడాల్సిన బాధ్యత నీకుంది. కాబట్టి ఆ బాధ్యత నీకిస్తాను అంటాడు.
శ్రీకాకుళం ప్రాంతంలో ఆవిరికొండ అనేది ఒక ఉద్యమప్రాంతం.. ఎందరో వీరుల్ని అక్కడ అన్యాయంగా చంపారు. ఆ వీరుల నెత్తుటేరులు పారడానికి కారకులైన వారిని మట్టుపెట్టాల్సిన బాధ్యత నీకుంది.. అందుకే ఆ రక్తం నీకిస్తాను అంటాడు. అంటే.. ఆ రక్తం సాక్షిగా నువు పగ తీర్చుకోవాలని ఇక్కడి అర్థం. బుడార్ సింగి కొండ కూడా శ్రీకాకుళం ప్రాంతంలోనిదే. అక్కడి పువ్వులను ఏరి నీకిస్తాను. అక్కడి పువ్వులు ఉద్యమపరిమళాలు వెదజల్లుతాయన్న అంతర్లీనమైన భావుకతను ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. 1978 లో జగిత్యాలలో జరిగిన జైత్రయాత్ర, 1981 లో ఇంద్రవెల్లి ప్రాంతంలో అడవిబిడ్డల ఊచకోతలో నేలకొరిగిన అమరవీరుల స్ఫూర్తిపథం.. నీకు ఇస్తాను. అంటాడు.
రాయలసీమ రాళ్ళలోన రగిలిపోతున్న అగ్నికణాలు నీకిస్తాను అంటాడు. అంటే.. రాయలసీమలో కక్షలతో, కలహాలతో రగిలిపోతున్న ఆవేశాల్ని నీలో నింపుకో..అని చెప్పకనే చెప్పాడని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. రక్తంతో తడిసి వసంతమై ఎర్రగా మెరుస్తున్న దండాకారణ్యాన్ని నీకిస్తాను.. అంటాడు. అలాగే సుబ్బారావు పాణిగ్రాహి విప్లవగీతం, కత్తిలాంటి కలంపాట, ఉద్యమకారుడైన డా. మల్లిక్ పసిపాప లాంటి నవ్వు, ఆదిభట్ల కైలాసం కళ్ళలోని ఆశయపు వెలుగు, వెంపటాపు సత్యం చూపులోని ఎరుపు చురుకు… ఇవన్నీ నీకిస్తాను..అంటాడు.
ఇన్ని సంఘటనలు, ఇంతమంది మహనీయులు.. నీలో ఆవేశంగా, ఆక్రోశంగా నింపుకుని, ఆ ఆవేశాన్ని వజ్రాయుధంగా అందుకుని నువు ఉద్యమబాటలో నా వారసుడిగా పయనించాలని కామ్రేడ్ సత్యం శ్రీరాములయ్యకు చెబుతాడు.
ప్రతి వీరుడి నరనరాన ఉద్యమ కాంక్షను రగిలించే మహోత్తుంగ తరంగం ఈ పాట. ఈ పాట వింటుంటే గుండెల్లో ఓ ఉత్తేజం, ఓ చైతన్యం ప్రజ్వలిస్తుంటుంది.
పాట:
విప్ప పూల చెట్ల సిగల దాచిన విల్లమ్ములన్నీ/ నీకిస్త తమ్ముడా… నీకిస్త తమ్ముడా లహర్ జ్వాల దారిలోన దాచిన బల్లెమ్ములన్నీ/ నీకిస్త తమ్ముడా చల్… నీకిస్త తమ్ముడా/ గార్ల రైలు దారిలోన గుంజుకున్న బల్ రైఫిల్/ నీకిస్త తమ్ముడా పల్ … నీకిస్త తమ్ముడా/ అరె రూపాయి కొండలొన కోసిన సిపాయి పీక/ నీకిస్త తమ్ముడా పల్ … నీకిస్త తమ్ముడా/ అరె బొడ్డాపాడు పోతుగడ్డ గరుడ భద్ర మెరుపు దాడి/ నీకిస్త తమ్ముడా… నీకిస్త తమ్ముడా/ ఆవిరి కొండల కోనల పారిన వీరుల రక్తం/ నీకిస్త తమ్ముడా… నీకిస్త తమ్ముడా/ బుడార్ సింగి కొండలోన కోసిన పూలన్నీ ఏరి/ నీకిస్త తమ్ముడా చల్… నీకిస్త తమ్ముడా/ అరె జగిత్యాల జైత్రయాత్ర ఇంద్రవెల్లి అమరత్వం/ నీకిస్త తమ్ముడా పల్.. నీకిస్త తమ్ముడా అరే రాయలసీమ/ రాళ్ళలోన రగులుతున్న అగ్నికణం నీకిస్త తమ్ముడా/ నీకిస్త తమ్ముడా అరె రక్త వసంతాలాడే/ దండాకారణ్యమంతా/ నీకిస్త తమ్ముడా పల్. నీకిస్త తమ్ముడా/ పాణిగ్రాహి కత్తి పాట మల్లిక్ పసిపాప నవ్వు/ నీకిస్త తమ్ముడా పల్… నీకిస్త తమ్ముడా/ అరే.. కైలాసం కళ్ళ వెలుగు/ వెంపాటపు చురుకు చూపు/ నీకిస్త తమ్ముడా పల్… నీకిస్త తమ్ముడా/ నీకిస్త తమ్ముడా… నీకిస్త తమ్ముడా!
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682