Wednesday, October 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'నేతకాని'ల ప్రత్యేక పండుగ

‘నేతకాని’ల ప్రత్యేక పండుగ

- Advertisement -

– సీతంపేటలో మూడ్రోజుల ఉత్సవాలు ప్రారంభం
– నేడు జోడెద్దుల ప్రతిమల నిమజ్జనొం రేపు దీపావళి బతుకమ్మ వేడుకలు
నవతెలంగాణ-హసన్‌పర్తి

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల పరిధి సీతంపేట గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. దీపావళి రోజు బతుకమ్మ ఆడటం అక్కడి నేతకాని సామాజిక తరగతి ప్రత్యేకత. దీపావళి పండుగ రోజు బతుకమ్మ ఆడటం ఇక్కడ పూర్వం నుంచి వస్తున్న ఆచారం. మూడ్రోజుల పాటు జరిగే ఈ బతుకమ్మ వేడుకలకు గ్రామ నేతకానీలు ఎక్కడ స్థిరపడ్డా పండుగ రోజు గ్రామానికి చేరుకుంటారు. మంగళవారం కేదారీశ్వరస్వామి వ్రతంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలలో భాగంగా పురుషులు ఊరు శివారులోని కుంట బంక మట్టితో ప్రతిమలు తయారు చేస్తారు. ఇంట్లో రకరకాల పిండి వంటలతో తయారు చేసిన నగలు (నాగళి, కోల, దుత్తలు, గొడుగు) వంటి వ్యవసాయ పనిముట్లను జోడెద్దులకు అలంకరించి కుటుంబ సభ్యులంతా కలిసి కేదారీశ్వరస్వామి వ్రతం పూర్తి చేశారు. నేడు(బుధవారం) మగవారు మాత్రమే ప్రత్యేకంగా అలంకరించిన నగలతో కూడిన జోడెద్దుల ప్రతిమలను తీసుకొని కోలాటాలతో ఊరేగింపుగా వెళ్లి ఊరు శివారులోని కుంటలో నిమజ్జనం చేస్తారు. గురువారం మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మను ఊరు శివారులోని చెరువులో వదులుతారు. దీంతో మూడ్రోజుల దీపావళి బతుకమ్మ పండుగ ముగుస్తుంది.

ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి
నేతకాని సామాజిక తరగతి వారి ‘దీపావళి’ బతుకమ్మ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఎస్సీ సామాజిక తరగతికి చెందిన నేతకాని కులస్తులు జరుపుకునే ఈ పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. – జాడి రాజీవ్‌గాంధీ, కాంగ్రెస్‌ గ్రామ అధ్యక్షులు

నేతకానీల ప్రత్యేక పండుగ
మహారాష్ట్ర రాష్ట్రం నుంచి వలస వచ్చిన నేతకాని కులస్తులం. మేమంతా మూడ్రోజుల పాటు దీపావళి బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. ఒక్క సీతంపేటలోనే జరుపుకునే నేతకానీల ప్రత్యేక ఈ దీపావళి బతుకమ్మ వేడుకలను దేశం నలుమూలల చాటిచెప్పాలని మా ఆరాటం. దీనికి ప్రభుత్వం కూడా సహకారం అందించాలి. – చొక్కం ఉప్పలయ్య
(నేతకాని కుల సంఘం పెద్ద మనిషి)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -