Thursday, January 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్‌ఎల్‌బీసీ నిర్మాణానికి స్పెషల్‌ వింగ్‌

ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణానికి స్పెషల్‌ వింగ్‌

- Advertisement -

నెలలోపు కాళేశ్వరం పునరుద్ధరణ డిజైన్లు
తుమ్మిడిహట్టి డీపీఆర్‌ త్వరలో సిద్దం
నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించం : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ (ఎస్‌ఎల్‌బీసీ) నిర్మాణాన్ని నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్ట్‌ల పురోగతిపై బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌.అంబెద్కర్‌ సచివాలయంలో సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనలో చిక్కుకున్న టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ (టీబీఎం)శకలాలను పూర్తిగా తొలగించామనీ, ప్రస్తుతం రైల్‌ ట్రాక్‌ సహాయంతో మరమ్మత్తులు కొనసాగుతున్నాయని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్‌) పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజ్‌కు సంబంధించిన డీపీఆర్‌ తయారీ కోసం సర్వేలు, పరిశోధనలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. బ్యారేజ్‌ ప్రాంతంలో అవసరమైన 73 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో టోపోగ్రాఫికల్‌ సర్వే పూర్తయిందనీ, దాంతో పాటు 85 కిలోమీటర్ల కాలువ సర్వేను కుడా పూర్తి చేశామన్నారు.

అదనంగా వార్ద, వైన్‌ గంగా నదులకు ఇరువైపులా క్రాస్‌-సెక్షన్‌ లెవల్స్‌ సర్వే పూర్తయిందని తెలిపారు. త్వరలో తుది డీపీఆర్‌ రూపొందిస్తామని మంత్రి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ బ్యారేజ్‌లకు సంబంధించి పూణేకు చెందిన సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌లపై సైట్‌ తనిఖీ నివేదికతో పాటు ప్రణాళికలు సమర్పించిందని ఆయన వివరించారు. ముగ్గురు సభ్యులతో కూడిన బందం బుధవారం మెడిగడ్డ బ్యారేజ్‌ అధ్యయనం ప్రారంభించగా, మరో ఇద్దరు సభ్యులు బోర్‌హోల్‌ ప్రాంతాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌ల వద్ద పరిశీలన పనులు ఈ నెల 22న ప్రారంభం కానున్నాయని తెలిపారు. మూడు బ్యారేజ్‌ల పునరుద్ధరణ, డిజైన్లు నెల వ్యవధిలో రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు పొందేందుకు మరింత ఒత్తిడిని పెంచాలన్నారు. పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు.

ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి దష్టికి ఇప్పటికే ఇసుకొచ్చామనీ, ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత ప్రధానమంత్రి దష్టికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్‌ల్లో మట్టి, ఇసుక మెటలు పుడుకు పోవడంతో నీటి నిలువ సామర్ధ్యం తగ్గిపోతున్నాయనీ, ఈ క్రమంలో ఆయా ప్రాజెక్ట్‌ల్లో పూడికతీత పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను ప్రస్తావిస్తూ వరుసగా సంభవిస్తున్న వరదలతో మట్టి, ఇసుక వచ్చి చేరడంతో 112 టీఎంసీల సామర్ధ్యం 90కి పడిపోయిందన్నారు. ప్రాజెక్ట్‌ పనుల్లో నిబంధనలు పాటిస్తూనే నాణ్యతాప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నీటి పారుదల ప్రాజెక్ట్‌ పనులకు సరిపడా నిధులను సమకూరుస్తామనీ, యుద్దప్రాతిపదికన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్‌, ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌లు (ఈఎన్‌సీ), చీఫ్‌ ఇంజనీర్లు (సీఈ), ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు (ఈఈ), ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -