భారీ ఆధిక్యంలో జమ్మూ కశ్మీర్
కర్నాటకతో రంజీ ట్రోఫీ ఫైనల్
హుబ్లీ (కర్నాటక) : దేశవాళీ క్రికెట్‌లో సరికొత్త సంచలనం లిఖించబడుతోంది. పసికూనగా రంజీ ట్రోఫీలో అడుగుపెట్టిన జమ్మూ కశ్మీర్ అనతి కాలంలోనే చాంపియన్‌గా అవతరించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 8 సార్లు చాంపియన్ కర్నాటకపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న జమ్మూ కశ్మీర్.. నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి 477 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోరు చేసిన జమ్మూ కశ్మీర్.. కర్నాటకను తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ చేసింది. పేసర్ అకిబ్ నబి (5/54) ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించాడు. సునీల్ కుమార్ (2/51), యుధ్‌వీర్ సింగ్ (2/55), సాహిల్ (1/50) రాణించారు. దీంతో జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో 186/4తో ఆడుతున్న జమ్మూ కశ్మీర్.. గెలుపు వాకిట నిలిచింది. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (94 నాటౌట్, 160 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో మెరువగా, అబ్దుల్ సమద్ (32, 70 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. యావర్ హసన్ (1), శుభమ్ (4), పరాస్ (16) నిరాశపరిచారు. సాహిల్ (16 నాటౌట్) జతగా ఇక్బాల్ క్రీజులో అజేయంగా నిలిచాడు. రంజీ ట్రోఫీ ఫైనల్లో నేడు ఆఖరు రోజు ఆట. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో టైటిల్ ఖాయం చేసుకున్న జమ్మూ కశ్మీర్.. ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్ ఇవ్వకుండా ఆధిక్యం పెంచుకునే ఆలోచనలో ఉంది.



