Tuesday, March 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిర్మాణాత్మక షెడ్యూల్‌ రూపొందించాలి

నిర్మాణాత్మక షెడ్యూల్‌ రూపొందించాలి

- Advertisement -

– ప్రతి శాఖ సన్నద్ధం కావాలి
– అధికారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి : నేటి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌పై సీఎస్‌ రామకృష్ణారావు సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నేడు నిర్వహించబోయే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు అవసరమైన నిర్మాణాత్మక షెడ్యూల్‌ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో జరిగే కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎస్‌ సోమవారం ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ల సమావేశానికి ప్రతి శాఖ సన్నద్ధం కావాలని సూచించారు. ఆ సమావేశంలో అర్థవంతమైన చర్చలు, కార్యాచరణకు ఉపయోగపడేలా నిర్మాణాత్మక షెడ్యూల్‌ ఉండాలని ఆదేశించారు. ఆ సమావేశంలో చర్చించబోయే ముఖ్యమైన అంశాలను సీఎస్‌ ఉన్నతాధికారులకు వివరించారు. కాన్ఫరెన్స్‌ మొదటి సెషన్‌లో జిల్లా కలెక్టర్లకు జనగణనను నిర్దేశించిన సమయంలో పారదర్శకంగా పూర్తి చేసే విధులపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. రెండో సెషన్‌లో ఈనెల 6 నుంచి జూన్‌ 12 వరకు అమలు చేయనున్న ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్లకు వివరించనున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ప్రగతి నివేదిక, ప్రజాపాలన కార్యక్రమాలపై కూడా సమీక్షిస్తారని వెల్లడించారు. అభివృద్ధి పనులు, భూసేకరణ ప్రక్రియ, సకాలంలో అటవీశాఖ అనుమతులపై ఈ సెషన్‌ ఉంటుందన్నారు. ప్రతి శాఖ సమగ్రంగా తమ లక్ష్యాలను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేందుకు ఏ విధమైన వ్యవస్థతో ముందుకెళ్తారో రోడ్‌ మ్యాప్‌ను వివరించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ప్రగతి నివేదిక, ప్రజాపాలన కార్యక్రమాలను జిల్లాల్లో అమలు చేయాలని ఆయన సూచించారు. సమావేశానికి వచ్చే అధికారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ శివధర్‌ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్‌ రంజన్‌, సంజరు కుమార్‌, వికాస్‌ రాజ్‌, ముఖ్య కార్యదర్శులు సందీప్‌ కుమార్‌ సుల్తానియా, అహ్మద్‌ నదీమ్‌, కార్యదర్శులు లోకేశ్‌ కుమార్‌, క్రిస్టినా జెడ్‌ చొంగ్తు, సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌ ప్రియాంక, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -