Sunday, September 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆత్మగౌరవ ప్రతీక-మన బతుకమ్మ

ఆత్మగౌరవ ప్రతీక-మన బతుకమ్మ

- Advertisement -

– ప్రపంచంలోనే ఇది అరుదైన పూల పండుగ
– రాష్ట్ర సాధనలో బతుకమ్మ వేడుకలు కీలకం
– ‘నవతెలంగాణ’ ఇంటర్వ్యూలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

‘బతుకమ్మ పండుగంటేనే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిమళింపజేసే వేడుక. ఈ నేల మహిళల అస్తిత్వానికి ప్రతీక. తెలంగాణ మహిళల ఐక్యతను, సృజనాత్మకతలను చాటిచెప్పే రంగు రంగుల పూల పండుగ. అందుకే బతుకమ్మ వచ్చిదంటే చాలు… తొమ్మిది రోజులపాటు మహిళమంతా సంబురాల్లో మునిగిపోతుంటారు. అటు ప్రకృతిని, ఇటు ఆది పరాశక్తిని కొలిచే అద్భుతమైన పండుగ ఇది. ప్రపంచంలోనే ఇలాంటి అరుదైన, ఘనమైన పూల పండుగ మన వారసత్వ సంపద అని చెప్పేందుకు గర్వంగా ఉంది…’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. రాష్ట్రంలో ఆదివారం నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమె ‘నవతెలంగాణ’తో ప్రత్యేకంగా సంభాషించారు.

నాటి స్వాతంత్య్రోదమ స్ఫూర్తితో…
‘బతుకమ్మ పండుగంటే నాకు ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో ఈ పండుగ కీలక పాత్ర పోషించింది. భారత సాతంత్య్రో ద్యమ సమయంలో దేశ ప్రజల్లో ఐక్యత తేవడానికి బాలగంగాధర్‌ తిలక్‌ గణపతి నవరాత్రి వేడుకలను వేదికగా మలుచుకున్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగను భాగం చేయాలని భావించి, అమలు చేశాం…’

అందరూ భాగస్వాములే…
‘బతుకమ్మ పండుగ ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్షలకు వేదికగా మారింది. మహిళలు మాత్రమే కాకుండా…చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండుగలో భాగస్వాములయ్యా రు. కవులు, కళాకారులు, మీడియా, మేధావులు, చరిత్రకారులు ప్రతి ఒక్కరూ ఆనాటి బతుకమ్మ వేడు కలను తెలంగాణ ఉద్యమానికి వేదికగా మలు చుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పునరుజ్జీవం కోసం జాగృతి ఆధ్వర్యంలో మొదలైన బతుకమ్మ వేడుకలు రాష్ట్ర సాధనకు కీలకంగా మారాయి…’

మరుగున పడి.. బయటకొచ్చి…
‘తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మరుగున పడిన మన సంస్కృతి, సాంప్రదాయాలు కూడా బతుకమ్మ పండుగ ద్వారా వెలుగులోకి వచ్చాయి. బతుకమ్మ ఆడాలంటేనే భయపడే పరిస్థితి నుంచి విదేశాల్లో ఉన్న తెలంగాణ వాళ్లు కూడా గర్వంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించేలా విశ్వవ్యాప్తంగా ఉత్సాహం నిండింది. బతుకమ్మ చరిత్ర, వైభవాన్ని నేటి తరానికి చాటి చెప్పేలా ఎన్నో పాటలు రావటంలో జాగృతి కృషి ఉంది. మన చరిత్రను భవిష్యత్‌ తరాలకు భద్రంగా అందించే పని చేశాం. ఈ క్రమంలో లక్షల మంది నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు…’

చీరెల పంపిణీని కొనసాగించాలి…
‘ఉద్యమ ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా బతుకమ్మ వైభవాన్ని చాటి చెప్పాం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. ప్రభుత్వ నిధులతో ఈ పండగను ఘనంగా నిర్వహించుకున్నాం. అంతే కాకుండా బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళ లకు ప్రభుత్వం తరఫున చీరలు అందజేసి ఆడ బిడ్డలుగా గౌరవించారు. ప్రస్తుత రేవంత్‌ ప్రభుత్వం మహిళల మీద కక్ష గట్టింది. గతేడాది బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు ఇవ్వకుండా వారిని మోసం చేసింది. మహిళల మీద ఏ మాత్రం గౌరవ మున్నా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగించాలి…’

గతంలో మాదిరి గౌరవించాలి…
‘ఒక్కో మహిళకు ఇందిరమ్మ పేరుతో రెండేసి చీరలు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. బతుకమ్మ అంటే ఇక్కడ ప్రజల బతుకుల్లో భాగం.. ఆ పేరుతో కాకుండా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలను సంతృప్తి పరిచేలా ఇందిరమ్మ పేరుతో చీరలు పంపిణీ చేయాలనే ప్రయత్నమే తెలంగాణ అస్తిత్వంపై దాడికి పాల్పడటం. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను తొలగించారు. క్రమంగా తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసే చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. కేసీఆర్‌ ప్రభుత్వంలో బతుకమ్మ వేడుకలు ఎంత ఘనంగా నిర్వహించారో… ఇప్పుడు కూడా అదే విధంగా నిర్వహించటం ద్వారా మహిళలను ప్రభుత్వం గౌరవించాలి’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -