Thursday, March 19, 2026
E-PAPER
Homeమానవిప్రత్యేక పిల్లలను తీర్చిదిద్దుతున్న టీచర్

ప్రత్యేక పిల్లలను తీర్చిదిద్దుతున్న టీచర్

- Advertisement -

ఆమె ఒక రంగస్థల కళాకారిణి. అంతేకాక స్పెషల్‌ చిల్డ్రన్‌ (బుద్ధిమాంద్యం పిల్లల)కి ఉపాధ్యాయురాలు. ఆ పిల్లల భవితను తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తున్నారు. తనకు తెలిసిన కళను ఉపయోగించుకొని వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. అనేక రంగాలలో ఆ పిల్లలను అభివృద్ధి చేస్తున్నారు. మా పిల్లలు దేనికీ పనికిరారేమో అని ఆందోళన పడే తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నారు. ఇలా ఎంతో ఓర్పు నేర్పుతో ఆ పిల్లలకు ఆటపాటల ద్వారా చదువు నేర్పుతున్నారు. ఆమె బండ్లమూడి ధనలక్ష్మి. ఆమె స్ఫూర్తిదాయక జీవిత పరిచయం నేటి మానవిలో…

ధనలక్ష్మి నోరి సేనావల్లి, లక్ష్మీనర్సింహమూర్తి దంపతులకు రెండవ సంతానం. తండ్రి బి.హెచ్‌.ఇ.ఎల్‌.లో (హైదరాబాద్‌) రామచంద్రపురంలో అర్చకులుగా పనిచేసేవారు. 1973లో ఆ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన ఆమె ఇంటర్‌ వరకు చదివారు. తండ్రి అప్పట్లో ఎన్‌.టి.ఆర్‌.కు వీరాభిమాని. ఆయనకు నాటకాలంటే ప్రాణం. దాంతో కూతురికి పౌరాణిక నాటకాలు వేయడంలో తర్ఫీదు ఇచ్చారు. ఇంటర్‌ తర్వాత ధనలక్ష్మికి యజ్ఞనారాయణతో పెండ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పిల్లలు పుట్టిన తర్వాత ఆమె ఎం.ఎ.తెలుగు, ఎం.ఎ జర్నలిజం చేశారు. ఆ తర్వాత బి.హెచ్‌.ఇ.ఎల్‌. లోని మానసిక వికలాంగుల స్పెషల్‌ కేర్‌ పాఠశాలలో టీచర్‌గా చేరి స్పెషల్‌ బి.ఇడి. పూర్తి చేశారు.

ఆటల్లోనూ మేటి…
ధనలక్ష్మి క్రీడల్లోనూ తన ప్రావీణ్యాన్ని నిరూపించుకుంటున్నారు. ప్రత్యేక పిల్లల కోసమే ఆమె ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. నేషనల్‌ కోచ్‌గా క్రికెట్‌, బొస్సీ ఆటల్లో ప్రత్యేక శిక్షణ పొందారు. ముఖ్యం గా స్పెషల్‌ కిడ్స్‌ను ఆటల్లో ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేక పిల్లల్ని తీసుకుని భారత్‌ నిర్వహించే స్పెషల్‌ కోచింగ్‌, క్రీడా పోటీలకు గోవా, ఢిల్లీ, పాండిచ్చేరి, కర్ణాటక మొదలైన ప్రాంతాలకు వెళ్లారు. పిల్లలకి ఎన్నో బహుమతులు, మెడల్స్‌ వచ్చాయి. ఇదంతా ధనలక్ష్మి కృషి, పట్టుదల, ఆమె పిల్లలకు ఇచ్చే ప్రోత్సాహానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

పురుష పాత్రల్లో…
ధనలక్ష్మి ఉపాధ్యాయురాలిగా ఉంటూనే నాటకాలు కూడా వేస్తున్నారు. ఒకప్పుడు నాటకాల్లో మహిళల పాత్రలను పురుషులే వేసేవారు. దీనికి భిన్నంగా ధనలక్ష్మి నాటకల్లో పురుష పాత్రలు వేసి ఔరా! అనిపించుకున్నారు. ఎంతో మంది మన్నలను పొందారు. సౌత్‌ జోన్‌ కల్చరల్‌ వింగ్‌లో కర్ణాటకకు వెళ్లి అంధులకు, మానసిక వికలాంగులకు డ్రామా, డాన్సుల్లో ఎలా శిక్షణ ఇవ్వాలో నేర్చుకొని వచ్చారు.

లెక్కలేనన్ని బహుమతులు
ఈ విధంగా ప్రత్యేక పిల్లల కోసం ఆమె చేస్తున్న కృషికి గాను బీహెచ్‌ఈఎల్‌ స్త్రీ సంక్షేమ కేంద్రంలో ఈమెకు లెక్కలేనని బహుమతులు వచ్చాయి. మూడుసార్లు ఆల్రౌండర్‌ అవార్డులు అందుకున్నారు. పరిషత్‌ వారు నిర్వహించే ఏకపాత్రాభినయంలో దుర్యోధనునిగా మయసభలో ఆమె చేసిన అభినయానికి, పాడిన పద్యాలకి మొదటి బహుమతి పొందారు. డాక్టర్‌ కోటయ్య ఆధ్వర్యంలో ఆమె పద్యాలు, డైలాగులు నేర్చుకున్నారు. పౌరాణిక నాటకాలలో మగ పాత్ర ధరించటానికి ఆయనే ఆమెని సంసిద్ధం చేశారు. ఢిల్లీ ఏపీ భవన్లో తొలిసారి ఉత్తమ నటి అవార్డు అందుకున్న ఈమె తొలి సాంఘిక నాటకం ‘ముగింపు లేని కథ’.

ఐదు వందలకు పైగా…
ఇప్పటి వరకు ధనలక్ష్మి 500లకు పైగా నాటకాలు వేశారు. అలాగే ఈటీవీ వారి ‘స్మైల్‌ రాజా స్మైల్‌’లో ఫైనలిస్ట్‌గా, జీ కామెడీ క్లబ్‌లో, జెమిని నవ్వుల సవాల్‌.. ఇలా ఎన్నెన్నో టీవీ ఛానల్స్‌లో తన ప్రతిభను ప్రదర్శించారు ధనలక్ష్మి. ఇంకా మేం ఫేమస్‌, టక్కు జగదీష్‌, మసూద్‌ రంగ్‌ దే.. మొదలైన సినిమాల్లో నటించారు. అలాగే డిగ్రీ పిల్లలకు న్యూస్‌ రీడింగ్‌, యాంకరింగ్‌లో శిక్షణ ఇచ్చారు. సినారే ప్రోగ్రాంలకు వ్యాఖ్యాతగా పనిచేశారు. సెయింట్‌ జాన్స్‌ కాలేజీలో సి.ఓ.సి క్లాసులు తీసుకున్నారు. వీటితో పాటు ఆమె బాల్యం నుంచి వ్యాసరచన, డిబేట్‌, డాన్స్‌, ఏకపాత్రాభినయాల్లో ఎన్నో బహుమతులు పొందారు. ఆమె వేదికపై అడుగుపెడితే గళం ఖంగుమంటూ మోగుతుంది. ప్రేక్షకులను మంత్రముద్ధులను చేస్తుంది.

  • అచ్యుతుని రాజ్యశ్రీ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -