No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeట్రెండింగ్ న్యూస్కమ్యూనిస్టు యోధునికి కన్నీటి వీడ్కోలు

కమ్యూనిస్టు యోధునికి కన్నీటి వీడ్కోలు

- Advertisement -

– సురవరం సేవలను స్మరించుకున్న పలువురు నేతలు, వామపక్ష శ్రేణులు
– భౌతికకాయానికి తెలంగాణ, ఏపీ సీఎంలు రేవంత్‌, చంద్రబాబు ఘన నివాళులు
– రెడ్‌ సెల్యూట్‌ చేసిన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు,రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తదితరులు
– డిప్యూటీ సీఎం భట్టి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాళి
– అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర
– గాంధీ ఆస్పత్రికి భౌతికకాయం అప్పగింత


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అగ్రనేత, ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకరరెడ్డికి పలువురు జాతీయ, రాష్ట్ర నేతలు, వామపక్ష శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. ఎర్రజెండా ముద్దుబిడ్డగా దేశానికి, ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సురవరం ఆశయాల సాధనకు కంకణబద్ధులవుతామంటూ ప్రతినబూనారు. ‘జోహార్‌.. జోహార్‌.. సురవరం, సాధిస్తాం మీ ఆశయాలను, వర్ధిల్లాల్లి ఎర్రజెండా…’ అంటూ వామపక్ష నేతలు ఆయనకు రెడ్‌ సెల్యూట్‌ చేశారు. శుక్రవారం రాత్రి కన్నుమూసిన సురవరం భౌతికకాయాన్ని ఆయన కుమారుడు నిఖిల్‌ అమెరికా నుంచి రావాల్సి ఉన్నందున ఆదివారం ఉదయం వరకు గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రి మార్చురీలో ఉంచిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 9.30 గంటలకు అక్కడి నుంచి భౌతికకాయాన్ని హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌కు తరలించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ నేత కె.నారాయణ, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, ఎస్‌.వీరయ్య, టి.జ్యోతి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తదితరులు సురవరం భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో తమకు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఉన్న బంధాన్ని, అనుబంధాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మఖ్దూం భవన్‌ నుంచి ఎర్రదండు కవాతు ముందు భాగాన నిలవగా… సురవరం అంతిమయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వరకు రెడ్‌షర్టు వాలంటీర్లు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సీపీఐ నేతల సమక్షంలో సురవరం కుటుంబ సభ్యలు ఆయన భౌతికకాయాన్ని గాంధీ వైద్య కళాశాలకు అప్పగించారు.

సురవరం సేవలు గుర్తుండేలా సర్కార్‌ నిర్ణయం : సీఎం రేవంత్‌ రెడ్డి
సురవరం సుధాకర్‌రెడ్డి సేవలు చరిత్రలో నిలిచిపోయేలా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సుధాకరరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…తెలంగాణ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన వారిని తమ ప్రభుత్వం మరిచి పోదని స్పష్టం చేశారు. ఈ నేల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరును హార్టికల్చర్‌ యూనివర్సిటీకి, జైపాల్‌ రెడ్డి పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి, సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టామని గుర్తు చేశారు. అలాగే సురవరం సుధాకర్‌ రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా మంత్రి వర్గంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. పేదలు, బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత సుధాకర్‌రెడ్డి అని కొనియాడారు. ‘విద్యార్థి దశ నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. పాలమూరు జిల్లా బిడ్డ జాతీయ స్థాయి నేతగా ఎదగటం మనందరికీ గర్వకారణం. ఆ జిల్లాకు వన్నె తెచ్చిన గొప్పనేతల్లో ఆయన ఒకరు. అధికారం ఉన్నా లేకున్నా తన సిద్ధాంతాలను ఎప్పుడూ వీడలేదు. జీవితాంతం రాజీపడని నిరాడంబర జీవితాన్ని గడిపారు. సురవరం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి సేవలకు గుర్తుగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది మా పీఏసీ సమావేశంలో కూడా సురవరం సేవలను స్మరించుకున్నాం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. సురవరం మరణం తెలంగాణకు తీరని లోటు’ అని సీఎం పేర్కొన్నారు.

దేశానికి తీరని లోటు : ఏపీ సీఎం చంద్రబాబు
సురవరం మరణం దేశానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సుధాకర్‌రెడ్డి దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఢిల్లీలో వివిధ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన ఉద్యమంలో ఆయనతో కలిసి నడిచానని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం సీపీఐకి ఎంత నష్టమో.. సమాజానికి కూడా అంతే నష్టమన్నారు. ఆయన పేదల కోసం చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు. గతంలో సుధాకర్‌రెడ్డితో కలిసి పోరాటాలు చేశానని అన్నారు. ‘నేనంటే ఆయనకు ప్రత్యేక అభిమానం ఉండేది. ఆయన్ను జీవితంలో ఎప్పుడూ మరచిపోలేను. వ్యక్తిగతంగా నేను చేసే పనులను ఆయన ప్రోత్సహించేవారు’ అని సురవరంతో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలిపారు.

గొప్ప మానవతా వాది :మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
సుధాకర్‌రెడ్డి గొప్ప మానవతావాదని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. చివరి వరకు పేదల కోసం పని చేసిన గొప్ప వ్యక్తని కొనియాడారు. ‘ఆయన గొంతుకు ఆపరేషన్‌ అయినప్పుడు కలిశాను. మళ్ళీ ప్రజా జీవితంలోకి వస్తారని అనుకున్నా. ఇంతలోనే ఆయన మననుంచి దూరమయ్యారు. ఆయన లేని లోటు తీరనిది’ అని వ్యాఖ్యానించారు.

ఆయన జీవితం ఆదర్శనీయం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
సురవరం రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజల పక్షాన ఆయన పోరాడారని అన్నారు. సురవరం మరణంతో దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో ఆయనది గొప్ప పాత్ర : కేటీఆర్‌
తెలంగాణ ఉద్యమంలో సురవరం సుధాకర్‌రెడ్డి గొప్ప పాత్ర పోషించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ప్రత్యేక రాష్ట్రానికి సీపీఐ మద్దతునిచ్చే విధంగా చేయటంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే క్రమంలో సురవరంతో కలిసి పనిచేసే అవకాశం తమ పార్టీకి దక్కిందని అన్నారు. సురవరంతో ఉన్న అనుభవాలను తమ పార్టీ అధినేత కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారనీ, ఆయన తరపున సుధాకర్‌ రెడ్డికి నివాళులర్పిస్తున్నామని చెప్పారు.

కార్మిక,ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు : ఎంఎ బేబీ,సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి
సురవరం సుధాకర్‌రెడ్డి మరణం కార్మిక, ప్రజాఉద్యమాలకు తీరని లోటని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ అన్నారు. తెలంగాణలో కార్మిక ఉద్యమాలను బలమైన శక్తిగా తయారుచేయడంలో సురవరం ఎంతో కృషి చేశారన్నారు. నల్గొండ నుంచి రెండు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన సురవరం..శ్రామికవర్గ సమస్యలపైనే ప్రధానంగా మాట్లాడేవారని గుర్తు చేశారు. ఢిల్లీలో సీపీఐ(ఎం) కార్యాలయంలో జరిగిన వామపక్ష సమావేశాలకు హాజరయ్యే సీపీఐ బృందానికి సురవరం నాయకత్వం వహించేవారని చెప్పారు. ప్రజా సమస్యలపై ఆయన లోతుగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు చూపేవారన్నారు. సురవరం నిరాడంబరత, విషయ పరిజ్ఞానంతో చివరి వరకు కమ్యూనిస్టు విలువలకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. దేశంలో మతతత్వం విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తుల ఐక్య ఉద్యమాలు ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. ఆయన మరణం పట్ల సీపీఐ (ఎం) పక్షాన నివాళులర్పిస్తున్నామని తెలిపారు. సురవరం కుటుంబ సభ్యులకు బేబి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సిద్ధాంతం కోసం చివరివరకు నిలబడ్డారు : బీవీ రాఘవులు
సురవరం సుధాకర్‌రెడ్డి గొప్ప ప్రజాసేవకుడని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు చెప్పారు. మననుంచి ఆయన దూరమైనా ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరముందన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. సురవరం తనకు మంచి స్నేహితుడని చెప్పారు. విలువలకోసం, నమ్మిన సిద్ధాంతం కోసం చివర వరకూ నిలబడ్డాడని గుర్తు చేశారు. ఏ విషయాన్నైనా ఆయన చాలా స్పష్టంగా చెబుతారని తెలిపారు. సురవరం మరణం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలకు తీరని లోటని నివాళులర్పించారు. సురవరం కుటుంబ సభ్యులకు, సహచరులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఎర్రజెండా ముద్దుబిడ్డ సురవరం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ
ఎర్రజెండా ముద్దుబిడ్డ సురవరం సుధాకర్‌రెడ్డి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ అన్నారు. ఆదర్శ కమ్యూనిస్టు యోధుడని చెప్పారు. వామపక్ష ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. వామపక్ష ఐక్యత కోసం కృషి చేశారని గుర్తు చేశారు. కులతత్వం, మతతత్వం పెచ్చరిల్లుతున్న ప్రస్తుత తరుణంలో ధీటైన ప్రజాఉద్యమాలను నిర్మించాల్సిన సమయంలో అనుభవమున్న కమ్యూనిస్టు నేతలు లేకపోవటం బాధాకరమన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలను విచ్చలవిడిగా కొనసాగుస్తున్నదనీ, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదమేర్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాలకు సుధాకర్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిదన్నారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

కార్మిక వర్గ పక్షపాతి సురవరం : సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు
సురవరం కార్మిక వర్గ పక్షపాతని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు అన్నారు. ఆయన జీవితకాలం ప్రజలకోసమే బతికారని గుర్తు చేశారు. అనేక ప్రజాఉద్యమాలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. దేశంలో భయంకర పరిస్థితులు నెలకుంటున్నాయనీ, ఇట్లాంటి క్లిష్టపరిస్థితుల్లో సుధాకర్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని చెప్పారు. ఆయన ఆశయాలను కొసాగించటమంటే..మతోన్మాదానికి వ్యతిరేకంగా బలమైన ప్రజాఉద్యమాలను నిర్మించటమేనని చెప్పారు.

ప్రజాఉద్యమాలకు తీరని లోటు : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌

సురవరం సుధాకర్‌రెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ చెప్పారు. వ్యవసాయ కార్మికుల పోరాటాలతో ఆయనకు ప్రత్యక్ష సంబంధముందని గుర్తు చేశారు. పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న కాలంలో వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం తనదైన పాత్ర పోషించారని తెలిపారు. ప్రజాఉద్యమాలకు వారు లేని లోటు తీర్చలేనిదన్నారు.

పోరాటాలకు పునరంకితమవ్వాలి : పి.మధు, సీపీఐ (ఎం)సీనియర్‌ నేత, మాజీ ఎంపీ
దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్ష దిగ్గజం సురవరం సుధాకర్‌ రెడ్డి మృతి అత్యంత బాధాకరమని సీపీఐ (ఎం) సీనియర్‌ నేత, మాజీ ఎంపీ పి.మధు నివాళులర్పించారు. రైతులు,కూలీలు, కార్మికులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన బాధలకు గురిచేస్తుందని చెప్పారు. అది మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటోంది, ఈ నేపథ్యంలో సురవరం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలి. అప్పుడే ఆయనకు నిజమైన నివాళని తెలిపారు.

ప్రజా ఉద్యమాల సారధి : జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
ప్రజా ఉద్యమాల సారధి సురవరం సుధాకర్‌ రెడ్డి మరణం అణగారిన వర్గాలకు తీరని నష్టమని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. పార్లమెంటేరియన్‌గా ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రజలకు ఆయన చేసిన సేవ మరువలేనివని చెప్పారు.

పలువురు వామపక్ష నేతలు నివాళి
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సురవరం సుధాకర్‌ రెడ్డి బౌతిక కాయానికి పలువురు వామపక్ష నేతలు నివాళులర్పించారు. సీఐటీయు జాతీయ కార్యదర్శి సుదీప్‌ దత్తా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య, టి.జ్యోతి, టి సాగర్‌, రాష్ట్ర నాయకులు ఆర్‌ వెంకట్రాములు, ఎంవి రమణ, టి స్కైలాబ్‌బాబు,పి ఆశయ్య, సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహా రెడ్డి, సీపీిఐ (ఎంఎల్‌ )న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య, సిపిఐ (ఎంఎల్‌ ) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీిఐ (ఎంఎల్‌ ) లిబరేషన్‌ కార్యదర్శి మూర్తి, ఎస్‌యుసిఐ కార్యదర్శి మురహరి, ఎంసీపీఐ(యు) కార్యదర్శి ఆశోక్‌ ఓంకార్‌, జి రవి, జనశక్తి కార్యదర్శి అమర్‌, అరుణోదయ విమలక్క, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్‌, ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, మధు,మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమ, కేజీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఎల్‌ పద్మ, అన్మేష్‌, ఎన్డీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌ వెంకటేశ్వరరావు, జె చలిపతి రావు, బి ప్రదీప్‌, ఎం శ్రీనివాస్‌, జి ఝాన్సీ, వి సంధ్య, అరుణక్క, వ్యకాస ఉపాధ్యక్షులు బి పద్మ తదితరులు నివాళులర్పించారు.

పలువురి నివాళి
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో ఉంచిన ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. చివరి వరకు నిబద్దత కలిగిన కమ్యూనిస్టు నేతగా ప్రజాపక్షం వహించారని కొనియాడారు. ఆయనతో తమకున్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎంవి.రమణ. శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, పొన్నం ఫ్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, వేం.నరెందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, గోరటి వెంకన్న ఆయన పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. మాజీ మంత్రులు కె.జానారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పువ్వాడ అజరుకుమార్‌, నిరంజ్‌రెడ్డి, మాజీ ఎంపీలు బి.వినోద్‌కుమార్‌, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పౌర హక్కుల నాయకులు ఫ్రొఫెసర్‌ హరగోపాల్‌, టీజేఎస్‌ నేత కోదండరామ్‌, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ మొలుగూరి కుమార్‌, సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్‌.నారాయణమూర్తి, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు, ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌, ప్రముఖ పాత్రికేయులు రామచంద్రమూర్తి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు సురవరానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad