ఎర్రబడిన గోపాల్‌రావుపల్లె..
ప్రజలు, విప్లవ అభిమానుల జోహార్లతో సాగిన అంతిమయాత్ర
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
నాలుగు దశాబ్దాలపాటు ప్రజా ఉద్యమాలతో మమేకమై, మావోయిస్టు కేంద్ర కమిటీలో ఉన్నతస్థాయికి ఎదిగిన ‘కడారి సత్యనారాయణరెడ్డి’ అలియాస్ ‘కడారి’కి కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమయాత్ర జనసందోహం అశ్రునయనాల మధ్య గురువారం ముగిసింది. కడారి భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు వచ్చిన విప్లవ అభిమానులు, గ్రామస్థులతో గోపాల్‌రావుపల్లె కిక్కిరిసింది. కడారి మృతదేహం స్వగ్రామానికి చేరినప్పటి నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురిసినా, లెక్కచేయకుండా వేలాదిమంది తరలివచ్చారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఉన్న కడారి మరణంతో రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రజాసంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు గురువారం ‘కడారి’ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పౌర హక్కుల సంఘం నాయకులు, గాదె ఇన్నయ్య తదితర నేతలు మాట్లాడుతూ.. కడారి సత్యనారాయణ రెడ్డిని, మరో కేంద్ర కమిటీ సభ్యుడు రాజును ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ సరిహద్దుల్లో బూటకపు ఎన్‌కౌంటర్‌లో చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని ఆరోపించారు. ముమ్మాటికీ ఇది ప్రభుత్వం చేసిన హత్య అన్నారు. విరసం కార్యదర్శి పాణి, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నాయకురాలు పద్మకుమారి తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు సహా పలువురు రాజకీయ పార్టీల నేతలు కూడా కడారి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
‘కడారి’కి కన్నీటి వీడ్కోలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES