జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
నివాళ్లర్పంచిన మంత్రి పొన్నం ప్రభాకర్, కేటీఆర్, బాలకృష్ణ తదితరులు
నవతెలంగాణ- అంబర్‌పేట
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు(82)కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావూరి భౌతిక కాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం దానం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కావూరి శ్రీకారం చుట్టారన్నారు. అందరితో సత్సంబంధాలు పెట్టుకొన్న.. అందరికీ కావాల్సిన వ్యక్తి అని కొనియాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. అలాగే కావూరి మృతదేహానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్రావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ తరుపున, వ్యక్తిగతంగా కావూరికి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కావూరి ఒక విలక్షణమైన వ్యక్తని అభివర్ణించారు. 2009లో రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలోనూ ఆయన సిరిసిల్లకు జౌళిశాఖ మంత్రిగా వచ్చారన్నారు. రాంచందర్రావు మాట్లాడుతూ.. కావూరి పేదల పెన్నిధిగా ఉంటూ, 1994లో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రారంభించారంటూ గుర్తుచేశారు.
వీరితోపాటు సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నామ నాగేశ్వర్‌రావు, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్, మాగంటి సునీతగోపీనాథ్, పలువురు నాయకులు, సినీపరిశ్రమకు చెందిన వారు కావూరి మృతదేహానికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, యరపతినేని శ్రీనివాసరావు, గిడుగు రుద్రరాజు, మాజీ ఎంపీలు హనుమంతరావు, జేడీ శీలం, టి.సుబ్బిరామిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, సినీనటుడు, నిర్మాత మురళీమోహన్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పలువురు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. గురువారం మధ్యాహ్నం తరువాత జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో కావూరికి అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.
కావూరికి కన్నీటి వీడ్కోలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



