Monday, April 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునూర్జహాన్‌కు కన్నీటి వీడ్కోలు

నూర్జహాన్‌కు కన్నీటి వీడ్కోలు

- Advertisement -

ఆమె పోరాటాలను, అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ… అంతిమయాత్రలో పాల్గొన్న వేలాది మంది
పాడే మోసిన సీపీఐ(ఎం), సీఐటీయూ నేతలు
బాన్సువాడలో ముగిసిన నూర్జహాన్‌ అంత్యక్రియలు
వివిధ జిల్లాల నుంచి హాజరైన పలువురు
విప్లవ ఫైటర్‌గా సమాజ మార్పు కోసం కృషి చేశారని కొనియాడిన వక్తలు


నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి/బాన్సువాడ
సమసమాజ స్థాపన కోసం, దోపిడీ రహిత సమాజం కోసం, పెట్టుబడిదారి వ్యవస్థ అంతమే అంతిమలక్ష్యంగా కార్మిక హక్కుల కోసం ఉద్యమించిన నాయకురాలు, సీఐటీయూ నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌ అంతియయాత్రకు వేలాదిమంది తరలివచ్చారు. ఊపిరితిత్తుల సంబంధిత అనారోగ్యానికి గురై శనివారం నూర్జహాన్‌ కన్నుమూయగా.. ఆదివారం బాన్సువాడలో అంతిమయాత్ర నిర్వహించారు. కార్మికులు, నాయకులు కన్నీటితో వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు నూర్జహాన్‌ అంత్యక్రియలు ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సీపీఐ(ఎం), సీఐటీయూ శ్రేణులు, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి నాయకులు, కార్మికులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని, పోరాటాలను స్మరించుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నర్సన్న పాడిన పాట అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. పట్టుదల, క్రమశిక్షణతో పని చేసిన కార్యకర్త అని, విప్లవ ఫైటర్‌గా ఎర్రజెండాతో సమాజ మార్పు కోసం కృషి చేశారని నేతలు కొనియాడారు.

ఘన నివాళులు
ఆదివారం ఉదయం సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ వీరయ్య, సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌, చుక్క రాములు, సాగర్‌, బండారు రవికుమార్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్‌, ఒంగూరి రాములు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌వి రమ, పార్టీ నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల కార్యదర్శులు, కార్యదర్శివర్గ సభ్యులు, వివిధ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు అమె భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగా చివరి చూపు చూసేందుకు వేలాదిగా నాయకులు, వివిధ రంగాల కార్మికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం ఒంటి గంటకు అంతిమయాత్ర ప్రారంభం కాగా పార్టీ నాయకులు పాడె మోశారు. ఆమె కుటుంబీకులతో పాటు బంధువులు యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. బాన్సువాడ శివారు ఆర్డీవో కార్యాలయం సమీపంలోని ఈద్గాలో నూర్జహాన్‌ అంత్యక్రియలు నిర్వహించారు.

విప్లవకారణి నూర్జహాన్‌ : కేంద్ర కమిటీ సభ్యులు సాయిబాబు
నూర్జహాన్‌ మరణం నమ్మశక్యంగా లేదు. అందరితో కలివిడిగా ఉండేవారు. అకాల మరణం ఊహించనిది. ఎక్కువ రోజులు మంచానికి పరిమితం అయ్యింది లేదు. అందరినీ ద్ణుఖసాగరంలో నింపి వెళ్లిపోయింది. భర్త ఆనంద్‌, కొడుకులు సిరాజ్‌, ఆజాద్‌ వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా. పట్టుదల, క్రమశిక్షణతో పనిచేసిన కార్యకర్త. ఫైటర్‌.. విప్లవకారిణి నూర్జహాన్‌. మార్క్సిజం, లెనినిజం స్ఫూర్తి నింపుకున్న తాను.. ఎర్ర జెండాతో సమాజ మార్పు పట్ల అందరినీ మార్చేందుకు పాటల రూపంలో తన పిల్లలు సైతం పాలు పంచుకునేలా కృషి చేశారు.

నూర్జహాన్‌ ఓ ధైర్యం : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు
చిన్న వయసులోనే మన నుంచి దూరమవ్వడం తట్టుకోలేని విషయం. అటు పార్టీలో, ఇటు యూనియన్‌లో వర్గ పోరాటాలు ముండ్లదారి వంటిది. ఒక మహిళగా వాటిని దాటుకుంటూ ముందుకు సాగారు. మైనార్టీవర్గం నుంచి నాయకత్వ స్థానానికి ఎదగడం గొప్ప విషయం.

బాధలు పంచుకునేవారు : సీపీఐ(ఎం)పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్‌
ఇండ్ల స్థలాల పోరాటం మొదలుకొని అనేక సమస్యలపై పోరాటాలు చేశారు. ఆమె మృతి అనేక పోరాటాలకు లోటు. మైనార్టీ కమ్యూనిటీ నుంచి వచ్చి మతాంతర వివాహం చేసుకొని పిల్లలను సైతం ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు. 2006లో ఇండ్ల స్థలాల కోసం పోరాటాల సమయంలో ఒక వైపు పోలీసులు, మరో వైపు గుండాలతో కట్టడి చేయాలని చూసినప్పటికీ వారి దాడులను సైతం ధైర్యంగా ఎదుర్కొంది.

ఏ దిక్కు చూసినా ఆమె పోరాటాలే సాక్ష్యం : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్మి పేదలు, కష్టజీవుల, కార్మిక విముక్తి కోసం నూర్జహాన్‌ నిబద్ధతో పనిచేసింది. నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా దించకుండా పనిచేసిన పోరాట యోధురాలు. జిల్లాలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఏ దిక్కున చూసినా ఆమె పోరాటం సాక్ష్యంగా నిలిచాయి. ఆమె పట్టు పట్టిందంటే ఫలితం చూస్తారు. నా ఇంటి ఆడపడుచు.. నా చెల్లి వెళ్లిపోయింది అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

కర్తవ్యాలు ముందుంచారు :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్‌..
నూర్జహాన్‌ మరణం విషాదకరం. ఆమె ఓ మిలిటెంట్‌. ఆమె లేకున్నా మన ముందు కర్తవ్యాలు ఉంచారు. వాటిని పూర్తి చెయ్యాలి.

ఏ పోరాటంలోనైనా ముందే :సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ
ఆమె ప్రేమకు ప్రతిరూపం. మిలిటెంట్‌ ఉద్యమాలకు.. అతివాద రాజకీయాలతో కూడా జైలు జీవితం గడిపారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌ చేయిస్తూ ఫీజులు తగ్గించేది.

ఉద్యమ బంధం వీడలేదు
పార్టీలోకి వచ్చిన నాటి నుంచి తుది శ్వాస విడిచే వరకూ ఉద్యమ బంధం వీడలేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోరాటంలో ముందు నిలిచారు. ఆమె లేని లోటు పూడ్చలేనిదంటూ కేంద్రకమిటీ సభ్యులు ఎస్‌ వీరయ్య భావోద్వేగానికి గురయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -