Monday, February 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసౌమ్యకు కన్నీటి వీడ్కోలు

సౌమ్యకు కన్నీటి వీడ్కోలు

- Advertisement -

మోస్రా మండలంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
శ్రద్ధాంజలి ఘటించిన మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారులు
సుదర్శన్‌రెడ్డి, పోచారం, ఎక్సైజ్‌ శాఖ కార్యదర్శి, కలెక్టర్‌, సీపీ
బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా
కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

నవతెలంగాణ-కంఠేశ్వర్‌
విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ గాజుల సౌమ్య (24) అంత్యక్రియలను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి సౌమ్య మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆమె స్వస్థలమైన నిజామాబాద్‌ జిల్లా మోస్రా మండల కేంద్రానికి తరలించారు. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రఘునందన్‌రావు, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య, ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఖురేషి, డిప్యూటీ కమిషనర్‌ సోమిరెడ్డి, సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ తదితరులు సౌమ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

అంతకుముందు ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి జూపల్లి భరోసా కల్పించారు. కాగా, పోలీసు లాంఛనాలతో సౌమ్యకు తుది వీడ్కోలు పలుకగా, ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు సౌమ్య అమర్‌ హై అని దారి పొడుగునా నినాదాలు చేశారు. సౌమ్య మృతితో మోస్రా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సౌమ్య ధైర్య సాహసాలు అనన్యం : మంత్రి జూపల్లి
విధి నిర్వహణలో సౌమ్య కనబర్చిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమని మంత్రి జూపల్లి అన్నారు. ఎంతో భవిష్యత్తు కలిగిన సౌమ్య చిన్న వయసులో అశువులు బాసిందని, ఈ ఘటన యావత్‌ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. ఆమె మృతికి కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుం దని తెలిపారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తుందని ప్రకటించారు. అదేవిధంగా ఆమె కుటుంబానికి పూర్తి జీతభత్యాలతో కూడిన పెన్షన్‌ అందిస్తామన్నారు.

భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని, ఎక్సైజ్‌ సిబ్బందికి కూడా ఆయుధాలు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తోందని వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న వారిపై భవిష్యత్తులో ఎవరైనా ఈ తరహా దాడులు చేయాలంటే భయపడేలా మరింత కఠిన చట్టాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. యువతను నిర్వీర్యం చేసే గంజాయి వంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలను రాష్ట్ర పొలిమేరల వరకు తరిమికొట్టేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందడం ఆవేదన కలిగించిందని అన్నారు.

సౌమ్య మృతికి సీఎం సంతాపం
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతికి కారణమైన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -