దాడులు, ప్రతిదాడులతో మూడోరోజూ భీకర పోరు
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్
కువైట్‌లో కూలిన అమెరికా యుద్ధ విమానాలు
ఇజ్రాయిల్, హిజ్బొల్లా మధ్య కాల్పులు
ఖమేనీ భార్య మన్సౌరే ఖోజాస్తే మృతి
అమెరికా-ఇజ్రాయిల్ దాడుల్లో ఆమెకు గాయాలు..
(నవతెలంగాణ-సెంట్రల్ డెస్క్)
దాడులు, ప్రతి దాడులతో మధ్య ప్రాచ్యం వణికిపోతోంది. ఇజ్రాయిల్- అమెరికా సేనలు, ఇరాన్ దళాల మధ్య వరుసగా మూడో రోజు కూడా భీకర పోరు సాగుతోంది. బాంబు దాడులతో తమ ప్రియతమ సుప్రీం నేత ఖమేనీని, సీనియర్ అధికారులను అంతం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఇరాన్ ఇజ్రాయిల్‌పై, గల్ఫ్‌లోని అరబ్ దేశాలపై పెద్ద ఎత్తున క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. మరోవైపు ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయిల్‌పై హిజ్బొల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడి చేసింది. బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసిందని లెబనాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
ఖమేనీ మరణానంతరం మరింత రెచ్చిపోయిన అమెరికా, ఇజ్రాయిల్ సైనికులు ఆదివారం ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి స్థావరాలపై బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అంతేకాక ఇరాన్ యుద్ధ నౌకలను కూడా అవి ధ్వంసం చేశాయి. కువైట్‌లో అనేక అమెరికా యుద్ధ విమానాలు నేల కూలాయి. అయితే పైలట్లు సురక్షితంగా బయట పడ్డారు. అరబ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడడాన్ని ఖండిస్తూ అమెరికా, బహ్‌రైన్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
భయం భయంగా…
పశ్చిమాసియాలో చెలరేగిన హింస రోజు రోజుకూ తీవ్రతరం అవుతోంది. ఇరాన్‌తో మొదలైన ఘర్షణ నాలుగు వారాల పాటు కొనసాగవచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన నేప థ్యంలో పశ్చిమాసియా నగరాలలో నివసిస్తున్న భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక గల్ఫ్ దేశాలలో పరిమిత సంఖ్యలలో బేస్‌మెంట్ షెల్టర్లు, భవనాలలో బాంబు షెల్టర్లు ఉండడమే దీనికి కారణం. ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న దాడులకు ప్రతిగా వైమానిక దాడులు జరగవచ్చునంటూ గల్ఫ్ దేశాలలో సైరన్లను మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దీంతో గల్ఫ్‌లో పెద్ద సంఖ్యలో ఉపాధి పొందుతున్న కేరళీయులు భయం భయంగా కాలం గడుపుతున్నారు.
ఇరాన్‌లో వెయ్యికి పైగా లక్ష్యాలపై దాడులు
‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ సందర్భంగా కువైట్‌లో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారని, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని పెంటగాన్ ధృవీకరించింది. లక్ష్యాన్ని సాధించేంత వరకూ పోరాటాన్ని ఆపేది లేదని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌లోని వెయ్యికి పైగా లక్ష్యాలపై అమెరికా సైన్యం దాడులు జరుపుతోంది. అటు ఇజ్రాయిల్ కూడా రాజధాని టెహ్రాన్‌లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటోంది. అనేక చోట్ల పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. లెబనాన్ రాజధాని, హెజ్బొల్లాకు గట్టి పట్టున్న బీరూట్‌పై ఇజ్రాయిల్ రక్షణ దళాలు వైమానిక దాడులు ప్రారంభించాయి. మరోవైపు హెజ్బొల్లాతో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో దక్షిణ లెబనాన్‌లోని పలు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించాలని ఇజ్రాయిల్ ఆదేశాలు జారీ చేసింది. తమపై దాడి చేస్తే ఊరుకునేది లేదని, ప్రతీకారం తప్పదని ఖతార్ హెచ్చరించింది. ఇరాన్ వైమానిక దాడుల కారణంగా బహ్‌రైన్, యూఏఈలోని అమెజాన్ క్లౌడ్ యూనిట్ల డేటా సెంటర్లలో విద్యుత్, కనెక్టివిటీ సమస్యలు తలెత్తాయి.
ఆరు వేల విమాన సర్వీసులు రద్దు
తన గగనతలాన్ని పాక్షికంగా, తాత్కాలికంగా మూసివేస్తున్నానని జోర్డాన్ ప్రకటించింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆరు వేలకు పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. వీటిలో ఎమిరేట్స్, ఇతిహాద్, ఇండియో విమానాలు అధిక సంఖ్యలో ఉన్నాయి.
నెతన్యాహూ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాం : ఇరాన్ గార్డ్స్
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయాన్ని, ఆ దేశ వైమానిక దళ కమాండర్ కేంద్ర కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని క్షిపణి దాడులు చేస్తున్నామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. కాగా ఇరాన్ దళాలు తమ విద్యుత్ కేంద్రంపై, ఓ ఇంధన స్థావరంపై దాడులు చేశాయని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇదిలావుండగా ఇరాన్ రక్షణ మంత్రిగా రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ మజీద్ ఎబ్‌నెల్‌రెజాను దేశాధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నియమించారు.
ఇరాన్‌లో 555 మంది మృతి
ఇజ్రాయిల్, అమెరికా దాడుల కారణంగా ఇప్పటి వరకూ 555 మంది చనిపోయారని ఇరాన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలియజేసింది. దేశంలోని 131 నగరాలపై దాడులు జరిగాయని వివరించింది. ఒక్క ఫార్స్ రాష్ట్రంలోనే 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుండగా కువైట్‌లో అమెరికాకు చెందిన అలీ అల్ సలేం వైమానిక స్థావరాన్ని, హిందూ మహా సముద్రంలోని నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని ఇరాన్ తెలిపింది. ఈ దాడులలో పదిహేను క్రూయిన్ క్షిపణులను ప్రయోగించామని చెప్పింది. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా చమురు శుద్ధి కేంద్రంపై కూడా ఇరాన్ డ్రోన్ దాడి జరిపింది. టెల్ అవీవ్‌లోని ప్రభుత్వ భవనాల సమూదాయం పైన, హైఫాలోని భద్రత-సైనిక కేంద్రాల పైన, తూర్పు జెరుసలేం పైన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దాడి చేశారు.
ఈ దాడులలో ఖైబార్ బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించారు. కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో అక్కడ నివసిస్తున్న తన దేశీయులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాక్‌లో అమెరికా సైనికులు మకాం వేసిన ఎర్బిల్ విమానాశ్రయంపై ఇరాన్ మూడు డ్రోన్లను ప్రయోగించగా వాటిని కూల్చివేసినట్లు భద్రతా దళాలు తెలిపాయి. అమెరికా దళాలకు సాయం చేస్తే దాడులు తప్పవని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్‌రైన్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్‌పై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఐరాస అణు ఏజెన్సీ ప్రతినిధులు వియన్నాలోని ఐఏఈఏలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అదే సమయంలో 35 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఏఈఏ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కూడా భేటీ అయ్యారు.
నాలుగైదు వారాలపాటు దాడులు : ట్రంప్
అవసరమైతే ఇరాన్‌పై నాలుగైదు వారాల పాటు సైనిక దాడులు కొనసాగిం చాలని భావిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. సైనిక చర్యలను ఉధృతం చేయడం కష్టమేమీ కాదని అన్నారు. అయితే ఈ పోరులో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. వెనిజులా తరహాలో ఇరాన్‌లో అధికార మార్పిడి జరగాల్సి ఉన్నదని చెప్పారు. దాడులను కొనసాగించేందుకు తమ వద్ద అవసరమైన దళాలు, క్షిపణులు, ఆయుధ సామగ్రి అందుబాటులోనే ఉన్నాయని అంటూ యుద్ధం కొనసాగితే ప్రాణనష్టం పెరుగుతుందని తెలిపారు. ఇజ్రాయిల్, అమెరికా సేనలు ఇరాన్ నౌకా దళాన్ని దెబ్బ తీశాయని, తొమ్మిది నౌకలను, నౌకాదళ కార్యాలయాన్ని ధ్వంసం చేశాయని వివరించారు. ఇరాన్‌పై జరుపుతున్న దాడులకు గల్ఫ్ సాయం అవసరమని తాను భావించడం లేదని ట్రంప్ అన్నారు.



