– టీ20 ప్రపంచకప్ టైటిల్ భారత్ వశం
– ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఏకపక్ష విజయం
– శాంసన్, అభిషేక్, కిషన్ ధనాధన్
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత్ ముచ్చటగా మూడో ముద్దు ఇచ్చింది. 2007లో ఎం.ఎస్ ధోని తొలిసారి భారత్‌ను టీ20 ప్రపంచకప్ విజేతగా నిలుపగా.. 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా విజేతగా అవతరించింది. సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో నిలిచిన భారత్‌ను సూర్యకుమార్ యాదవ్ 2026లో చాంపియన్‌గా నిలబెట్టాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను మూడుసార్లు నెగ్గిన ఏకైక జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
అచ్చిరాదు అనుకున్న అహ్మదాబాద్‌లోనే మనోళ్లు న్యూజిలాండ్‌ను మట్టి కరిపించారు. బ్యాట్‌తో, బంతితో తిరుగులేని ప్రదర్శన కనబరిచారు. సంజు శాంసన్ (89), ఇషాన్ కిషన్ (54), అభిషేక్ శర్మ (52) ధనాధన్ అర్థ సెంచరీలతో విశ్వరూపం చూపించారు. టాప్-3 బ్యాటర్ల విధ్వంసంతో భారత్ తొలుత 255 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇదే అత్యధికం.
బ్యాటర్ల బాదుడుతో డీలాపడిన న్యూజిలాండ్.. బౌలర్ల విజృంభణకు చేతులెత్తేసింది. జశ్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ పవర్‌ప్లేలోనే కివీస్ కోరలు పీకేశారు. ఆరంభంలోనే ఆశలు ఆవిరి చేసుకున్న న్యూజిలాండ్.. టైటిల్ పోరులో 159 పరుగులకే కుప్పకూలి కనీస పోటీ ఇవ్వలేదు. ఆడుతూ పాడుతూ భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను నిలబెట్టుకున్న తొలి డిఫెండింగ్ చాంపియన్‌గా భారత్ రికార్డులు తిరగరాసింది.
నవతెలంగాణ-అహ్మదాబాద్
ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్ టీమ్ ఇండియా సొంతమైంది. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. 256 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్ కనీస పోటీ ఇవ్వలేదు. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (52, 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (43, 35 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. భారత పేసర్ జశ్‌ప్రీత్ బుమ్రా (4/15), అక్షర్ పటేల్ (3/27) ఛేదన ఆరంభంలోనే న్యూజిలాండ్ నడ్డి విరిచారు. పవర్‌ప్లేలోనే భారత్ విజయాన్ని ఖరారు చేశారు. 19 ఓవర్లలో 159 పరుగులకు న్యూజిలాండ్ కుప్పకూలింది. అంతకముందు, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ టాప్-3 బ్యాటర్లు విశ్వరూపం చూపించగా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోరు చేసింది. సంజు శాంసన్ (89, 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (54, 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (52, 21 బంతుల్లో 6 ఫోరుల, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. శివం దూబె (26 నాటౌట్, 8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆఖర్లో అదరగొట్టాడు. కివీస్ పేసర్ జేమ్స్ నీషమ్ (3/46) రాణించాడు.
టాప్‌గేర్‌లో టాప్-3
టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. ఆచితూచి ఆడిన సంజు శాంసన్ (89) సిక్సర్‌తో పరుగుల వేట షురూ చేశాడు. వరుస వైఫల్యాలతో ఒత్తిడిలో పడిన అభిషేక్ శర్మ (52) సైతం నెమ్మదిగానే ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. దీంతో తొలి రెండు ఓవర్లలో 12 పరుగులే వచ్చాయి. మూడో ఓవర్లో మొదలైన తుఫాన్.. పవర్‌ప్లేలోనే కివీస్ బౌలర్లను ముంచెత్తింది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ శివమెత్తగా.. వరుస ఓవర్లలో 24, 21, 20 పరుగులు పిండుకున్నారు. దీంతో పవర్‌ప్లేలోనే భారత్ 92/0తో నిలిచింది. ఆఫ్ స్పిన్ బలహీనత అధిగమిస్తూ పేసర్లపై పంజా విసిరిన అభిషేక్ శర్మ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 18 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 43 బంతుల్లోనే 98 పరుగులు జోడించారు. భారత్ భారీ స్కోరుకు బలమైన పునాది వేశారు. అభిషేక్ శర్మ నిష్క్రమించినా.. భారత్ దూకుడు తగ్గలేదు. సంజు శాంసన్‌కు తోడైన ఇషాన్ కిషన్ (54) రెండో వికెట్‌కు 48 బంతుల్లోనే 105 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 23 బంతుల్లోనే ఇషాన్ కిషన్ అర్థ సెంచరీ సాధించగా.. సంజు శాంసన్ 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 బంతుల్లో ఫిఫ్టీ అందుకున్నాడు. టాప్-3 బ్యాటర్ల ధనాధన్‌తో భారత్ 15 ఓవర్లలోనే 200 పరుగుల మైలురాయి దాటింది. కానీ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో జేమ్స్ నీషమ్ గొప్పగా బౌలింగ్ చేశాడు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ సహా సూర్యకుమార్ యాదవ్ (0)ను అవుట్ చేశాడు.
ఆఖర్లో శివం షో
జేమ్స్ నీషమ్ ఓ ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టగా.. భారత్ స్కోరు నెమ్మదించింది. 16-19 ఓవర్లలో భారత్ 28 పరుగులే (24 బంతుల్లో) చేసింది. 300 స్కోరుపై అభిమానులు ఆశలు పెట్టుకోగా.. 250 కొట్టినా సంతోషమే అనిపించింది. కానీ ఆఖరు ఓవర్లో శివం దూబె (26 నాటౌట్) శివమెత్తాడు. ఫోర్లు, సిక్సర్లతో దంచికొట్టాడు. చివరి 6 బంతుల్లో 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో భారత్ 255 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్య (18, 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), తిలక్ వర్మ (8 నాటౌట్, 6 బంతుల్లో) ఫర్వాలేదనిపించారు.
కివీస్ దాసోహం
న్యూజిలాండ్ లక్ష్యం 256 పరుగులు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగుల ఛేదన 229. అయినా, కివీస్ శిబిరంలో తెలియని నమ్మకం. సెమీఫైనల్లో 33 బంతుల్లోనే సెంచరీ సాధించిన ఫిన్ అలెన్‌పై ఆ జట్టు కొండంత ఆశలు పెట్టుకుంది. తొలి ఓవర్లోనే శివం దూబె క్యాచ్ వదిలేసినా.. అక్షర్ పటేల్ మాయకు అలెన్ (9) వేగంగానే డగౌట్‌కు చేరుకున్నాడు. రచిన్ రవీంద్ర (1)ను బుమ్రా సాగనంపగా.. గ్లెన్ ఫిలిప్స్ (5)ను అక్షర్ పటేల్ బోల్తా కొట్టించాడు. తొలి ఆరు ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ఛేదనలో ఆశలు ఆవిరి చేసుకుంది. బుమ్రా వరుస ఓవర్లలో 9 పరుగులకు ఓ వికెట్ పడగొట్టగా.. అక్షర్ పటేల్ సైతం కండ్లుచెదిరే మాయాజాలం చేశాడు. ఓ ఎండ్‌లో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (52) నిలబడినా.. సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగిపోగా, మరో ఎండ్ నుంచి సహకారం దొరకలేదు. అర్థ సెంచరీ తర్వాత సీఫర్ట్‌ను వరుణ్ చక్రవర్తి సాగనంపాడు. మార్క్ చాప్‌మన్ (3), డార్లీ మిచెల్ (17) ఒత్తిడిలో తేలిపోయారు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (43) ఆఖర్లో ఓటమి అంతరాన్ని రెండెంకలకు కుదించటంలో విఫలమయ్యాడు. డెత్ ఓవర్లలో మరో 3 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఐదు వికెట్ల ఘనతకు వికెట్ దూరంలో నిలిచిపోయాడు. అభిషేక్ శర్మ పార్ట్‌టైమ్ స్పిన్‌తో న్యూజిలాండ్ కథను ముగించాడు. 19 ఓవర్లలో 10 వికెట్లకు న్యూజిలాండ్ 159 పరుగులే చేసింది. 96 పరుగుల తేడాతో భారత్ అద్వితీయ విజయం సాధించింది.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : సంజు శాంసన్ (సి) మెక్‌కొంకీ (బి) నీషమ్ 89, అభిషేక్ శర్మ (సి) సీఫర్ట్ (బి) రవీంద్ర 52, ఇషాన్ కిషన్ (సి) చాప్‌మన్ (బి) నీషమ్ 54, హార్దిక్ పాండ్య (సి) శాంట్నర్ (బి) హెన్రీ 8, సూర్యకుమార్ యాదవ్ (సి) రవీంద్ర (బి) నీషమ్ 0, తిలక్ వర్మ నాటౌట్ 8, శివం దూబె నాటౌట్ 26, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 255.
వికెట్ల పతనం : 1-98, 2-203, 3-204, 4-204, 5-226.
బౌలింగ్ : మాట్ హెన్రీ 4-0-49-1, గ్లెన్ ఫిలిప్స్ 1-0-5-0, జాకడ్ డఫ్ఫీ 3-0-42-0, లాకీ ఫెర్గుసన్ 2-0-48-0, మిచెల్ శాంట్నర్ 4-0-33-0, రచిన్ రవీంద్ర 2-0-32-1, జేమ్స్ నీషమ్ 4-0-46-3.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : టిమ్ సీఫర్ట్ (సి) ఇషాన్ కిషన్ (బి) వరుణ్ 52, ఫిన్ అలెన్ (సి) తిలక్ వర్మ (బి) అక్షర్ పటేల్ 9, రచిన్ రవీంద్ర (సి) ఇషాన్ కిషన్ (బి) బుమ్రా 1, గ్లెన్ ఫిలిప్స్ (బి) అక్షర్ పటేల్ 5, మార్క్‌చాప్‌మన్ (బి) హార్దిక్ పాండ్య 3, డార్లీ మిచెల్ (సి) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ పటేల్ 17, మిచెల్ శాంట్నర్ (బి) బుమ్రా 43, జేమ్స్ నీషమ్ (బి) బుమ్రా 8, మాట్ హెన్రీ (బి) బుమ్రా 0, లాకీ ఫెర్గుసన్ నాటౌట్ 6, జాకబ్ డఫ్ఫీ (సి) తిలక్ వర్మ (బి) అభిషేక్ శర్మ 3, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (19 ఓవర్లలో ఆలౌట్) 159.
వికెట్ల పతనం : 1-31, 2-32, 3-47, 4-70, 5-72, 6-124, 7-141, 8-141, 9-152, 10-159.
బౌలింగ్ : అర్ష్‌దీప్ సింగ్ 4-0-32-0, హార్దిక్ పాండ్య 4-0-36-1, అక్షర్ పటేల్ 3-0-27-3, జశ్‌ప్రీత్ బుమ్రా 4-0-15-4, వరుణ్ చక్రవర్తి 1-0-5-1.
టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీ
చాంపియన్ (భారత్) : రూ.28 కోట్లు
రన్నరప్ (న్యూజిలాండ్) : రూ.14 కోట్లు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : జశ్‌ప్రీత్ బుమ్రా
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ : సంజు శాంసన్



