యుద్ధ సమాచారంతో ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ కన్నీటిని కాసులుగా మార్చుకుంటున్న వైట్‌హౌస్!
మార్కెట్లలో భారీ వ్యాపారం..వేల కోట్లు ఆర్జిస్తున్న కంపెనీలు
గతంలోనూ ఇదే తరహా అక్రమ వ్యాపారం
కొన్ని కేసుల్లో నిందితులకు శిక్షలు
అయినా తీరుమార్చుకోని కార్పొరేట్లు
యుద్ధం ఏ దేశానికీ లాభం కాదు. కానీ వ్యాపారవేత్తే దేశాధ్యక్షుడు అయితే ‘నాకేంటి?’ అని అలోచించకుండా ఉంటాడా? ఇరాన్-ఇజ్రాయిల్, అమెరికా యుద్ధంలో ఇప్పుడిదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ యుద్ధ సమాచారంతో ఇజ్రాయిల్, అమెరికాకు చెందిన అనేక కార్పొరేట్ కంపెనీలు వేలకోట్ల ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేస్తున్నాయనే సమాచారం ఇప్పుడు బయటకు పొక్కింది. కొన్ని కంపెనీల లెక్కల్ని కూడా అంతర్జాతీయ మీడియా ప్రస్తావిస్తోంది.
ఇరాన్‌పై ఆయా దేశాలు దాడులు చేయకముందు ఆ కంపెనీల షేర్ల ధరలు ఎంత ఉన్నాయి? ఇప్పుడెలా పెరిగాయి? అనే సమాచారాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ముఖ్యంగా అందరి వేళ్లు వైట్‌హౌజ్ వైపే చూపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వతహాగా కార్పొరేట్ వ్యాపారస్తుడు కావడంతో ‘రహస్య యుద్ధ సమాచారం’ ఆధారంగా జరుగుతున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిని ఆరోపణలు అనేకంటే అంకెలతో సహా నిరూపిస్తుండటంతో ‘వాస్తవాలు’ అనడమే సరైందేమో!
నవతెలంగాణ-సెంట్రల్ డెస్క్(వాషింగ్టన్)
పశ్చిమాసియాలోని యుద్ధాన్ని వైట్‌హౌస్ వ్యాపారంగా మలుచుకుంటుందనడానికి అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. ముందస్తు యుద్ధ రహస్య సమాచారాన్ని తమకు అనుకూలంగా మలచుకుని అమెరికాలోని అనేక కార్పొరేట్ పెద్దలు, రాజకీయ నాయకులు భారీగా లాభాలు గడిస్తున్నారని అంత ర్జాతీయ మీడియా పేర్కొంటుంది. 2026 ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభం ముందూ, తర్వాత కీలక రహస్య సమాచారం ద్వారా కొద్ది మంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి భారీగా రాబడులను పెంచుకున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు బహిరంగం కావడానికి కొన్ని గంటల ముందే దానికి అనుగుణంగా ట్రేడింగ్ జరగడం వెనుక వైట్ హౌస్ నుంచి అందుతున్న ముందస్తు సమాచారమే కారణమనే అనుమానాలు బలపడుతున్నాయి.
పశ్చిమాసియా యుద్ధ రహస్య సమాచారాన్ని ఉపయోగించుకుని అమెరికాలోని కొందరు ట్రేడర్లు మార్కెట్‌లో దాదాపు 1.5 బిలియన్ల నుంచి 1.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.15 వేల కోట్లు) విలువైన అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్టు అంచనా. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలు వెలువడటానికి కొన్ని నిమిషాల ముందే చమురు మార్కెట్లలో భారీ ఎత్తున బెట్టింగ్‌లు జరగడం, తద్వారా అజ్ఞాత వ్యక్తులు కోట్లాది రూపాయల లాభాలను ఆర్జించడం ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనుమానాలను బలపరుస్తున్నాయి. ప్రారంభంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను కొట్టిపారేసిన వైట్‌హౌస్ ఇప్పుడు స్వరం మార్చింది. సున్నితమైన సమాచారంతో ముడిపడి ఉన్న ఫ్యూచర్స్ మార్కెట్లలో బెట్టింగ్‌లు కట్టవద్దని తన సిబ్బందిని హెచ్చరించింది.
ఇవిగో సాక్ష్యాలు..
ఈ ఏడాది జనవరిలో వెనిజులాలో అమెరికా సైనిక చర్యకు దిగడానికి ముందే పాలీమార్కెట్ వంటి ముందస్తు మార్కెట్లలో అనుమానాస్పద బెట్టింగ్‌లు కనిపించాయి. మార్చి మొదటి వారంలో ఇరాన్‌పై అమెరికా దాడి చేయబోతోందని అధికారికంగా తెలియడానికి కొన్ని గంటల ముందే కొందరు బెట్టింగ్‌లు కాశారు. కేవలం కొద్దిమంది అజ్ఞాత ట్రేడర్లు ఏకంగా 1.2 మిలియన్ల లాభాన్ని పొందడం వెనుక ఇన్‌సైడర్ సమాచారం ఉందనే అనుమానం ఉంది.
మార్చి 23 ఉదయం అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ దాడుల నిలిపివేత గురించి ట్వీట్ చేసే కొద్ది నిమిషాల ముందే, మార్కె ట్‌లో సుమారు 500 నుండి 830 మిలియన్ డాలర్ల విలువైన ఆయిల్ ఫ్యూచర్స్ చేతులు మారాయి. ప్రకటన రాగానే చమురు ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ఆ ముందస్తు ట్రేడర్లు ఊహించని లాభాలు పొందారు. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసు కావచ్చని చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా -ఇరాన్ మధ్య 15రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించడానికి గంటల ముందు సుమారు 950మిలియన్ డాలర్ల విలువైన చమురు బెట్టింగ్‌లు జరిగాయి. ప్రకటన తర్వాత చమురు ధరలు 15 శాతం పడిపోవడంతో ఆ ముందస్తు ట్రేడర్లు మళ్ళీ భారీగా లాభపడ్డారు.
వీరే వారు…
అమెరికాలో కొంతమంది ఎంపీలు, ఉన్నతాధికారులు తమకు లభించే గోప్య సమాచారం ఆధారంగా స్టాక్స్ కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తున్నారన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిరూపించడం కష్టమైనా, అనేక సందర్భాల్లో దోషులకు శిక్షలు పడిన ఘటనలు ఉన్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడే పెద్ద వ్యాపారవేత్త కావడంతో ఆయన సంపద పెరుగుదలపైనా ‘ఇన్‌సైడర్’ అనుమానాలు బలపడుతున్నాయి. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు కేవలం జియోపాలిటికల్ అంశమే కాదనీ, ఆర్థిక మార్కెట్లలో గోప్య లాభాల రాజకీయంగా కూడా మారుతున్నాయని నిరూపితమవుతున్నాయి.
గతంలోనూ…
ఇన్‌సైడ్ ట్రేడింగ్ కేసుల్లో గతంలో అమెరికాకు చెందిన కొన్ని కంపెనీలు, వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అమెరికాలో అత్యంత పెద్ద ఇన్‌సైడ్ ట్రేడింగ్ కేసుల్లో రాజ్ రాజరత్నం కేసు ఒకటి. గల్లియన్ గ్రూప్ అనే హెడ్జ్ ఫండ్ ద్వారా రాజ్ రాజరత్నం గోప్య సమాచారం ఆధారంగా ట్రేడింగ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. టెక్నాలజీ కంపెనీల్లోని ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించినట్టు నిరూపితమవడంతో 2011లో కోర్టు అతన్ని దోషిగా తేల్చి 11 ఏండ్ల జైలుశిక్ష విధించింది.ఈ కేసు ద్వారా ఇన్‌సైడ్ సమాచారం ఆధారంగా భారీ లాభాలు పొందడం ఎలా జరుగుతుందో బాహ్య ప్రపంచానికి స్పష్టంగా తెలిసింది. మరో కేసులో ప్రముఖ వ్యాపారవేత్త మార్తా స్టీవర్ట్ ఇమ్‌క్లోన్ సిస్టమ్స్ కంపెనీ షేరు పడిపోతుందనే గోప్య సమాచారం ముందే తెలుసుకుని అమ్మేసింది.
ఆ తర్వాత ఆమెపై కేసు నమోదు చేసి శిక్ష విధించారు. అమెరికా ఎంపీ క్రిస్ కొలిన్స్ ఒక బయోటెక్ కంపెనీ విఫలమవుతుందని ముందే తెలుసుకుని తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు షేర్లు అమ్మి నష్టాన్ని తప్పించుకున్నారు. ఆ తర్వాత అతను దోషిగా తేలాడు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో రాజకీయ నాయకులు కూడా గోప్య సమాచారాన్ని దుర్వినియోగం చేస్తారని ఈ ఘటన నిరూపించింది. అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ముందు కూడా ఇలాంటి ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎయిర్‌లైన్ కంపెనీల షేర్లపై భారీగా కొనుగోళ్లు జరిగాయి. దాడుల తరువాత వాటి విలువ అమాంతం పెరిగింది. అయితే వీటిపై విచారణలు చేసినా, ఆధారాలు లేకపోవడంతో నిరూపణ కాలేదు.
సహించం : వైట్‌హౌస్
వైట్‌హౌస్ మొదట ఈ ఆరోపణలను పట్టించుకోకపోయినా ఏప్రిల్ నాటికి తన సిబ్బందికి అంతర్గత హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత కచ్చితమైన సమయంలో జరుగుతున్న ఈ లావాదేవీలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయనీ, ఇలాంటి అక్రమ లాభార్జనను సహించబోమని అధికారులు హెచ్చరించారు. ఈ పరిణామం మార్కెట్ పారదర్శకతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణ పెట్టుబడిదారులకు లేని సమాచారం కొందరికి మాత్రమే లీక్ అవ్వడం వల్ల మార్కెట్‌పై నమ్మకం సన్నగిల్లుతోంది. దీనిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజీ కమిషన్ (ఎస్‌ఈసీ), సీఎఫ్‌టీసీ వంటి నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగి విచారణ జరపాలని అక్కడి చట్టసభ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఇన్‌సైడ్ ట్రేడింగ్ అంటే…
ప్రభుత్వ నిర్ణయాలు, యుద్ధ సంబంధిత గోప్య సమాచారం ముందుగానే తెలుసుకుని, ఆ సమాచారాన్ని ప్రజలకు వెల్లడించే ముందు స్టాక్ మార్కెట్లలో లావాదేవీలు చేయడాన్ని ఇన్‌సైడ్ ట్రేడింగ్ అంటారు. అమెరికాలో ఇది చట్ట విరుద్ధం. దీన్ని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) పర్యవేక్షిస్తుంది. ఇరాన్‌పై ఆంక్షలు లేదా సైనిక చర్యలు చేపట్టే ముందు, ఆయిల్, డిఫెన్స్, షిప్పింగ్ కంపెనీల షేర్లలో అసాధారణ మార్పులు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ అర్థికరంగ నిపుణులు విశ్లేషిన్నారు. రహస్య ప్రభుత్వ సమాచారాన్ని ప్రభుత్వంలో ఉన్నవారు కార్పొరేట్ లాబీలకు ముందుగానే సమాచారం ఇవ్వడంతో ఈ ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగుతుంది. ఈ విషయం తెలియని సామాన్య ప్రజలు లక్షల కోట్లు నష్టపోతారు. ఆ సొమ్మంతా ‘ఇన్‌సైడర్ల’ ఖాతాల్లోకి వెళ్లిపోతుంది.
ఆయిల్ మార్కెట్‌లో…
ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరిగే ముందు క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్‌లో భారీ కొనుగోళ్లు నమోదయ్యాయి. యుద్ధ వార్తలు వెలువడిన వెంటనే ధరలు పెరగడంతో, ఈ లావాదేవీలు చేసినవారికి అనూహ్య లాభాలు వచ్చాయి. ఇన్‌సైడర్ ట్రేడింగ్ వల్లే ఇది సాధ్యమైందనే అనుమానాలకు అనేక ఆధారాలు లభించాయి.
తాజాగా..
ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో అమెరికాకు చెందిన ఆయిల్ ఫ్యూచర్స్, డిఫెన్స్ కంపెనీల షేర్లలో అసాధారణ పెరుగుదల కనిపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ తయారీ సంస్థల్లో ఒకటైన లాక్‌హీద్ మార్టిన్ కంపెనీ యుద్ధ ఉద్రిక్తతల సమయంలో షేర్ల ధరలు అనూహ్యంగా పెరుగుతుండటం గమనార్హం. అలాగే వ్యాన్‌గార్డ్, బ్లాక్‌రాక్ వంటి ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ పబ్లిక్ కంపెనీ, మిస్సైల్స్, రాడార్ టెక్నాలజీ తయారీ సంస్థ అయిన రైథియన్ టెక్నాలజీస్ షేర్లు కూడా భారీగా పెరిగాయి. ఈ సంస్థలు అమెరికా రక్షణ శాఖతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తుంటాయి. మధ్యప్రాచ్య దేశాలకు సరఫరా పెరిగినప్పుడల్లా ఈ కంపెనీల లాభాలు అనూహ్యంగా పెరుగుతుండటం గమనార్హం!
యుద్ధానికి ముందు…
అమెరికా ఏ దేశంపైనైనా దాడులు చేయడం మొదలు పెట్టడానికంటే ముందు ఆ దేశ రక్షణ కంపెనీలైన లాక్‌హీద్ మార్టిన్, రైథియోన్ టెక్నాలజీస్ వంటి సంస్థల షేర్లు వేగంగా పెరుగుతుంటాయి. ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేది ప్రధానంగా అమెరికాలోని ప్రధాన రాజకీయపార్టీల నేతలే కావడం గమనార్హం!



