Monday, October 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఆయిల్‌ఫెడ్‌ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి

ఆయిల్‌ఫెడ్‌ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి

- Advertisement -

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
ప్రభుత్వం స్పందించకుంటే రైతు పోరాటం ఉధృతం
తెలంగాణ ఆయిల్‌ పామ్‌ రైతు సంఘం నేత బొంతు రాంబాబు
ఖమ్మంలో ఆయిల్‌ పామ్‌ రైతుల రాష్ట్ర సదస్సు

నవతెలంగాణ-గాంధీచౌక్‌
ఆయిల్‌ ఫెడ్‌ సంస్థలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఆయిల్‌ పామ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మంలోని స్వర్ణ భారతి కళ్యాణమండపంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు తుంబూరు మహేశ్వరరెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పామాయిల్‌ సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినా సరైన పద్ధతిలో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఇబ్బందులు తలెత్తి నప్పుడు బాధ్యతతో పరిష్కారం చేయకపోవడంతో రైతులు ఈ సాగుకు ముందుకు రావడం లేదని తెలిపారు.

దేశంలో 50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యం నెరవేరాలంటే కేంద్ర ప్రభుత్వం పామాయిల్‌ ధర పడిపోకుండా టన్నుకు రూ.25 వేల కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు. బహుళజాతి సంస్థల ఒత్తిడికి లొంగిన ప్రభుత్వాలు పామాయిల్‌, పత్తి దిగుమతి సుంకం తగ్గింపు పూర్తిగా ఎత్తివేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఆయిల్‌ఫెడ్‌ రైతులకు సరఫరా చేసిన మొక్కలు జన్యుపరమైన లోపంతో గెలలు రాక ఐదు నుంచి ఏడేండ్లు తోటలు పెంచి, తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఆయిల్‌ పామ్‌ రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ సమస్యలు ప్రస్తావించేందుకు రాష్ట్రంలోని పార్లమెంటు సభ్యులు దృష్టి సారించాలన్నారు.

తెలంగాణ ఆయిల్‌పామ్‌ రైతు సంఘం నేత బొంతు రాంబాబు మాట్లాడుతూ.. మొక్కలు ఆయిల్‌ ఫెడ్‌ సంస్థ నర్సరీలో పెంచకుండా ప్రయివేటు నర్సరీల్లో పెంచి, సరఫరా చేయడంతో ఆప్‌ టైప్‌ వచ్చి గెలలు రాక రైతులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వానికి, ఆయిల్‌ ఫెడ్‌ సంస్థకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. కోట్ల రూపాయలు నష్టంపై సమగ్ర విచారణ జరిపి దోషులను తేల్చి, శిక్షించాలని డిమాండ్‌ చేశారు. గతంలో గెలలు రాని మొక్కల విషయంపై కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కి ఫిర్యాదు చేయడంతో, విచారణ చేపట్టిన శాస్త్రవేత్తల బృందం నివేదికను బహిరంగ పరచాలని కోరారు.

రైతులు కొక్కెరపాటి పుల్లయ్య, కారం శ్రీరాములు మాట్లాడుతూ.. ఆయిల్‌ పామ్‌ రైతులకు అవసరమైన కలెక్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాలకు అతీతంగా రైతులు ఐక్యంగా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని కోరారు. ఈ సదస్సులో సంఘం నాయకులు జోగి బాబు, చేలికాని వెంకట్రావు, దొడ్డ చక్రధర్‌ రెడ్డి, వనపర్తి జిల్లా బుచ్చన్న, నల్గొండ గురువారెడ్డి, సూర్యాపేట సంగీత రెడ్డి, చింతనిప్పు చలపతిరావు, ధనమ్మ, పాషా, సత్యనారాయణరెడ్డి, దొడ్డ లక్ష్మీనారాయణ. కొప్పుల కృష్ణయ్య, పూర్ణచంద్రరావు, అమరనేని అప్పారావు, యనమద్ది రామకృష్ణ, దొడ్డపనేని కృష్ణార్జున్‌, సంక్రాంతి పురుషోత్తం, కట్టా రాంబాబు, చావా వేణు, యనమద్ది లెనిన్‌, సంక్రాంతి నర్సయ్య, దుగిని అజయ్ తోపాటు వందలాది మంది రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -