అణుశక్తి రంగం ప్రయివేటీకరణ బిల్లుపై ప్రతిపక్షాల ఆగ్రహం
ఉన్నత విద్యను నియంత్రించే బిల్లునూ వ్యతిరేకించిన విపక్షాలు
జేపీసీకి పంపాలని డిమాండ్.. దిగొచ్చిన కేంద్రం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో రెండు కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి అణుశక్తి రంగం ప్రయివేటీకరణ బిల్లు, ఉన్నత విద్యను నియంత్రించే బిల్లు ఉన్నాయి. ఈ రెండు బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దేశ భద్రతపై ఆందోళనను వ్యక్తం చేశాయి. అంతేకాకుండా విస్తృత పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపాలని డిమాండ్ చేశాయి. దీంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఈ రెండు బిల్లులను జేపీసీకి పంపింది. సోమవారం పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కాగానే గందరగోళం నడుమ నిమిషాల్లోనే వాయిదా పడ్డాయి. లోక్‌సభ రెండు సార్లు వాయిదా పడి, మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి ప్రారంభమైంది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పౌర అణుశక్తి రంగాన్ని ప్రయివేటీకరించే, ‘సస్టైనబుల్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా’ బిల్లు (శాంతి బిల్లు)ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీన్ని సెలక్ట్ కమిటీకి లేదా జేపీసీకి పంపాలని డిమాండ్ చేశాయి. దీంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బిల్లును జేపీసీకి పంపింది.
అనంతరం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ యూజీసీ, ఏఐసీటీ, ఎన్‌సీటీఈ వంటి సంస్థలను రద్దు చేసి వాటి స్థానంలో ఒకే కమిషన్‌ను నియమించే వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ (వీబీఎస్‌ఏ) బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ, టీఎంసీ ఎంపీ సౌగత రారు, సీపీఐ(ఎం) ఎంపీ రాధాకృష్ణన్ వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లును వ్యతిరేకించారు. ”వారు (పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) బిల్లును అధ్యయనం చేయడానికి మాకు అవకాశం ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును జేపీసీకి సూచించాలని ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు.అలాగే కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాత చట్టాలను రద్దు చేయడం, లేదా వాటి స్థానంలో మార్పులు చేయడం కోసం రిపలింగ్ అండ్ అమెండింగ్ బిల్లును ప్రవేశపెట్టారు. కొత్త చట్టాలను తీసుకురావడానికి, లేదా పాత చట్టాల్లోని అనవసరమైన, పాత నిబంధనలను తొలగించడానికి దీన్ని ఉపయోగిస్తారు.
బిల్లులకు హిందీ పేర్లను పెట్టడాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్ష ఎంపీలు
విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లును ప్రవేశపెట్టగా, కీలక చట్టాలకు హిందీ పేర్లను పెట్టడాన్ని ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్‌ఎస్‌పీ ఎంపీ ఎన్‌కె ప్రేమచంద్రన్ మాట్లాడారు. బిల్లులకు హిందీలో పేర్లు పెట్టడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 348(బి)ని ఉల్లంఘించడమే నని వాదించారు. కాంగ్రెస్ సభ్యుడు జోతిమణి, డీఎంకే సభ్యుడు టి.ఎం సెల్వగణపతి, సీపీఐ(ఎం) ఎంపీ కె.రాధాకృష్ణన్ కూడా బిల్లు పేరును వ్యతిరేకించారు. ”దీనిని నేను హిందీని రుద్దడంగా చూస్తున్నాను. ఇప్పటికే, తమిళనాడు జాతీయ విద్యా విధానం-2020లో త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించినందున ఎస్‌ఎస్‌ఏ నిధులను కోల్పోయింది” అని జోతిమణి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దడానికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీ టిఆర్ బాలు మాట్లాడారు.



