నాలుగు లేగ దూడలు, రెండు ఆవులు మృత్యువాత
రైతులు, గ్రామస్తుల్లో భయాందోళన
నవతెలంగాణ-కోహెడ
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మండలంలోని బస్వాపూర్, ఆరేపల్లి, కూరెళ్ళ గ్రామాల శివారులో ఆదివారం పెద్దపులి సంచరిస్తూ పశువులపై దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో నాలుగు లేగ దూడలు, రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. ఆరేపల్లి గ్రామ పరిధిలోని చంద్ర నాయక్ తండాకు చెందిన మాలోతు రమేష్ నాయక్‌కు చెందిన లేగ దూడలను పెద్దపులి చంపేసినట్లు ఆయన తెలిపారు. పులి సంచారం కారణంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత గ్రామాల సర్పంచ్‌లు బందెల సుజాత బాలకిషన్, పిల్లి బాబు, లింగంపల్లి లక్ష్మయ్య, సామాజిక మాధ్యమాలలో మెసేజ్, దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని, రాత్రి వేళల్లో జాగ్రత్తలు పాటించాలని తహాశీల్దార్ చంద్రశేఖర్, పోలీసులు గ్రామస్తులకు సూచించారు. ఎస్సై అభిలాష్, సిబ్బంది అటవీశాఖ అధికారులతో కలిసి సింగరాయ గుట్టలలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమెరా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష…
పులి సంచారం విషయం తెలుసుకున్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా అధికారులు, అటవీ శాఖ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. పులి దాడిలో మృతి చెందిన పశువులకు ప్రభుత్వం నుంచి త్వరలోనే నష్టపరిహారం చెల్లించేలా చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పులిని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని మంత్రి కోరారు.
కోహెడలో పెద్దపులి కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



