Saturday, December 6, 2025
E-PAPER
Homeకవర్ స్టోరీహక్కులు హరిస్తున్న కాలం…

హక్కులు హరిస్తున్న కాలం…

- Advertisement -

వర్గ సమాజంలో హక్కులకు వ్యతిరేకంగా హక్కులు తలెత్తుతాయి, అప్పుడు బలప్రయోగానిదే నిర్ణయాత్మక పాత్ర అవుతుందని మార్క్స్‌ అంటారు. సమాజానికి అతీతంగా, స్వచ్ఛమైన హక్కులు ఉండవు. సమాజం నుండి వ్యక్తిని విడదీసి, వ్యక్తిగత హక్కుల గురించి చర్చ చేయడం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రారంభం నుండి మొదలైంది. సమాజానికి వ్యక్తికి మధ్య వైరుధ్యాన్ని సష్టించడం ద్వారా ప్రజలు సామూహికంగా ఐక్యమయ్యే అవకాశాలని తగ్గించడం దాని లక్ష్యంగా ఉంటుంది. (డిసెంబర్‌ 10 హక్కుల దినోత్సవం సందర్భంగా)

దోపిడీ, అణిచివేతకు పాల్పడే వర్గాలకు, దోపిడీకి అణిచివేతకు గురయ్యే వర్గాలకు సమానమైన హక్కులు ఉంటాయి అంటే, అవి కాగితాలకు మాత్రమే పరిమితం అని, ఆచరణలో అమలకావు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే మనం భారత రాజ్యాంగం పౌరులకు హామీ ఇచ్చిన హక్కుల గురించి విశ్లేషణ చేసుకోవాలి.
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత విస్తతమైన, వివరణాత్మక రాజ్యాంగాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన ఈ రాజ్యాంగం కేవలం పాలనా నిర్మాణాన్ని మాత్రమే కాకుండా, భారతీయ పౌరుల ప్రాథమిక హక్కులను, బాధ్యతలను కూడా స్పష్టంగా నిర్వచించింది. రాజ్యాంగ రచయితలు మానవ హక్కుల సిద్ధాంతాలను భారతీయ సామాజిక-సాంస్కతిక సందర్భంతో సమన్వయం చేస్తూ, భాగం IIIలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. ఈ హక్కులు ప్రతి పౌరుడికి గౌరవంతో, స్వేచ్ఛతో, సమానత్వంతో జీవించే హామీ ఇచ్చాయి.
అయితే, స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటిన నేటి భారతదేశంలో, ఈ హక్కుల అమలు రక్షణ విషయంలో కొత్తవి, సంక్లిష్టమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం, రాజకీయ, సామాజిక మార్పులు, ఆర్థిక పరివర్తనలు రాజ్యాంగ పరమైన హక్కుల అర్థాన్ని, వాటి అనువర్తనాన్ని కొత్తగా నిర్వచించే అవసరాన్ని సష్టించాయి.
భారత రాజ్యాంగం – మానవహక్కుల చారిత్రక పునాది
భారత రాజ్యాంగం రూపకల్పనలో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ అధ్యక్షులుగా ఉన్న ముసాయిదా కమిటీ చారిత్రక పాత్ర పోషించింది. రాజ్యాంగ సభ దాదాపు మూడు సంవత్సరాల కాలంలో (1946-1949) సవివరమైన చర్చలు నిర్వహించింది. ప్రాథమిక హక్కుల చట్రం రూపొందించేటప్పుడు రాజ్యాంగ నిర్మాతలు వివిధ అంతర్జాతీయ అనుభవాల నుండి ప్రేరణ పొందారు. అయితే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 ”రాజ్యాంగ పరిహారాల హక్కు” గురించి వివరిస్తుంది. దీని ప్రకారం, ఎవరైనా తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టు హెబియస్‌ కార్పస్‌, మాండమస్‌, ప్రోహిబిషన్‌, క్వో వారంటో, సెర్టియోరారి వంటి వివిధ రకాల రిట్‌లను జారీ చేయగలదు. అందుకే డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఈ ఆర్టికల్‌ను భారత రాజ్యాంగానికి ‘గుండెకాయగా, ఆత్మ’గా అభివర్ణించారు. అయితే ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిన ఎంతమంది పౌరులకి సుప్రీంకోర్టు అందుబాటులో ఉంటుంది అనేది ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న?
ప్రాథమిక హక్కుల వర్గీకరణ
భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 12 నుండి 35 వరకు ఈ కింది ప్రాథమిక హక్కులను గుర్తించింది:
సమానత్వ హక్కు (ఆర్టికల్‌ 14-18):
చట్టం ముందు సమానత్వం, మతం, జాతి, లింగం, పుట్టిన ప్రదేశం లేదా కులం ఆధారంగా వివక్ష నిషేధం, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, అస్పశ్యత రద్దు, బిరుదుల రద్దు. చట్టం అందరినీ సమానంగా చూస్తుందనేది సారాంశం, కానీ సామాజిక జీవితంలో నేటికీ గత అసమానతలు కొనసాగుతూ ఉండడమే కాకుండా కొత్త అసమానతలు సష్టించబడుతూ, పెరుగుతూ వస్తున్న ఉదాహరణలు ఎన్నో మనకు కనిపిస్తున్నాయి. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారిని బహిరంగంగా హత్య చేయడం, హత్యలను సమర్ధించుకుంటూ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్లు కూడా మాట్లాడటం దేనికి సంకేతం. సాంఘిక బహిష్కరణలు కులం, మతం పేరుతో దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి.
ఆర్థికంగా బలమైన, సామాజికంగా ఉన్నతమైన వారికి తప్ప మిగతా ప్రజలకి సమానత్వం అనేది 75 సంవత్సరాల తర్వాత కూడా అందని ద్రాక్షగానే మిగిలి ఉంది.
స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్‌ 19-22):
వాక్కు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛ, సంఘం ఏర్పాటు స్వేచ్ఛ, సంచార స్వేచ్ఛ, స్థిర నివాస హక్కు, వత్తి స్వేచ్ఛ ఇలా భారత పౌరులకి స్వేచ్ఛ, స్వాతంత్రం గురించి ఈ ఆర్టికల్‌ చెబుతుంది. ఈ హక్కుకు రాజ్యము అనుమతించిన మేరకు మాత్రమే స్వేచ్ఛ ఉంటుందనేది ఆచరణలో మనకి అర్థమవుతుంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే నిర్బంధించడం ఉపా, జాతీయ అంతర్గత భద్రత చట్టం (ఎన్‌ఎస్‌ఎ) వంటి అనేక చట్టాలు పౌరుల స్వేచ్ఛకు హద్దులు గీస్తున్న విషయం మనం నిత్యం చూస్తున్నదే. రాజ ద్రోహం నేరం అనే చట్టం కాస్త రాజ్య ద్రోహనేరంగా మార్చబడి ప్రజల మెడలపై వేలాడుతున్న కత్తి. ఇవన్నీ పౌరుల స్వేచ్ఛను నియంత్రించేవే.
పీడనను నిరోధించే హక్కు (ఆర్టికల్‌ 23-24):
మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి, కట్టు బానిసత్వం వంటి బలవంత శ్రమ నిషేధం, 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల పిల్లలతో పని చేయించుకోవడం నిషేధం అంటే బాల కార్మికుల నిషేధం గురించి ఈ ఆర్టికల్‌లో వివరణ ఉంటుంది. వాస్తవ పరిస్థితులు పరిశీలించినప్పుడు మానవ అక్రమ రవాణాలో 2023 లెక్కల ప్రకారం ప్రపంచంలో మనం ఎనిమిదో స్థానంలో ఉన్నాం. 2024లో సుమారు 40 లక్షల మంది అక్రమంగా రవాణా చేయబడ్డట్టు వివిధ లెక్కలు చెబుతున్నాయి. అందులో 40 శాతం మంది పిల్లలు ఉన్నట్టుగా వివిధ సంస్థలు అంచనా వేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కోటి మందికి పైగా బాల కార్మికులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2025 నాటికి ఇంకా పెరుగుతూ వస్తుంది, రాజ్యాంగంలో మనం పేర్కొన్న దానికి, జరుగుతున్న పరిణామాలకు మధ్య తేడా ఎందుకు నెలకొని ఉంది అనేది పరిశీలన చేయాల్సిన అంశం.
సాంస్కతిక, విద్యా హక్కులు (ఆర్టికల్‌ 29-30):
మైనారిటీల సాంస్కతిక హక్కులు, విద్యా సంస్థలను స్థాపించే, నిర్వహించే హక్కులను రాజ్యాంగం కల్పించింది. దేశంలో నేడు మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే ధోరణి పెరుగుతుంది. వారికి కల్పించబడిన సాంస్కతిక హక్కులు కాలరాయ బడుతున్నాయి, దాడులకు గురవుతున్నాయి. వారి ఆహార అలవాట్లు, వేషధారణ ప్రశ్నార్ధకంగా మారిపోయాయి. వక్ఫ్‌ సవరణ చట్టం ద్వారా మైనార్టీల ప్రార్థన స్థలాలు, విద్యా సంస్థల నిర్వాహణ హక్కుల పై కూడా కేంద్రం నేరుగా దాడి చేసింది.
రాజ్యాంగ పరిహారాల హక్కు (ఆర్టికల్‌ 32): ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీం కోర్టుకు వెళ్లే హక్కును రాజ్యాంగం పౌరులకిచ్చింది. అయితే సుప్రీంకోర్టు అనేది దేశ రాజధానిలో ఉండే అత్యున్నత న్యాయస్థానం. సాధారణ పౌరులు అక్కడికి చేరుకొని, తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకునే అవకాశం ఉంటుందా? లక్షలు ఖర్చు చేయకుండా లాయర్లను నియమించుకోవడం సాధ్యమయ్యే పని కాదు. ఆటంకాలన్నీ అధిగమించి సుప్రీంకోర్టుకు చేరినా రాజ్యం జోక్యం లేకుండా వారికి న్యాయం చేసేది ఎవరు? ఇవన్నీ ఈ ఆర్టికల్‌కు ఉన్న పరిమితులు.
ప్రస్తుత సవాళ్లు, వివాదాస్పద విషయాలు

  1. ఆర్టికల్‌ 370 రద్దు, కాశ్మీర్లో మానవ హక్కుల సమస్యలు
    2019 ఆగస్టు 5న జమ్మూ-కాశ్మీరుకు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్‌ 370ను రద్దు చేయడం భారత రాజ్యాంగ చరిత్రలో ఒక మూల మలుపు. ఈ నిర్ణయం తర్వాత రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం అనేక రాజ్యాంగపరమైన మానవ హక్కుల ప్రశ్నలను లేవనెత్తింది.
    దీర్ఘకాలం పాటు కమ్యూనికేషన్‌ నిషేధం (ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవలు) అమలు చేయడం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ (ఆర్టికల్‌ 19(1)(a), వత్తి హక్కు (ఆర్టికల్‌ 19(1)(g)పై ప్రభావం చూపింది.
    రాజకీయ నాయకులు, కార్యకర్తలను నిర్బంధంలో ఉంచడాన్ని నివారించే వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్‌ 21)ని ప్రశ్నార్థకం చేసింది. రాజకీయ పార్టీల నాయకులను, సామాజిక కార్యకర్తలను గహ నిర్బంధంలో ఉంచారు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రం మొత్తాన్ని ఓపెన్‌ జైలుగా మార్చింది. ప్రజా సంప్రదింపులు లేకుండా రాజ్యాంగ మార్పులు చేయడం ప్రజాస్వామ్య ప్రక్రియపై సందేహాలు రేకెత్తించాయి. స్థానిక జనాభాపై భద్రతా చర్యల ప్రభావం, దౌర్జన్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
    సేవ్‌ కాశ్మీర్‌ కమిటీ ఙర యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఈ నిర్ణయం యొక్క రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తోంది. ఈ కేసు రాష్ట్రాల స్వయంప్రతిపత్తి, కేంద్ర అధికారాలు, ఫెడరలిజం యొక్క పరిమితులను నిర్వచించడంలో కీలకమైనది కానుంది.
  2. మతస్వేచ్ఛ, సెక్యులర్‌ ఫాబ్రిక్‌పై సవాళ్లు
    భారతదేశం సెక్యులర్‌ రాజ్యాంగ ఆదర్శంతో కూడిన బహుళ-మతపరమైన దేశం. అయితే, ఇటీవలి సంవత్సరాలలో మత స్వేచ్ఛపై కొత్త సవాళ్లు ఎదురయ్యాయి.
    వివిధ రాష్ట్రాలలో ”మతం మార్పిడి వ్యతిరేక చట్టాలు” ((Freedom of ReligionActs)) అమలు, ఇవి వ్యక్తిగత ఎంపిక, మత ప్రచార స్వేచ్ఛ (ఆర్టికల్‌ 25)పై పరిమితులను విధిస్తాయి. ”లవ్‌ జిహాద్‌” వంటి పదజాలం చుట్టూ రాజకీయం, ఇది అంతర్‌-మత వివాహాలను వివాదాస్పదం చేస్తోంది. మతపరమైన ప్రదేశాల స్వాధీనం చుట్టూ వివాదాలు (అయోధ్య, జ్ఞానవాపి, కాశీ మొదలైనవి) పెరిగాయి. మతపరమైన మైనారిటీల భద్రతా ఆందోళనలు ద్వేషపూరిత నేరాలు పెరిగాయి. 170 మందికి పైగా మైనార్టీలు, దళితులు మూక హత్యలకు గురయ్యారు. ‘హిజాబ్‌’ వివాదం, ఇది మత స్వేచ్ఛ, విద్యా హక్కుల మధ్య ఘర్షణను రేకెత్తించింది.
    ఈ సమస్యలు ఆర్టికల్‌ 25-28 (మత స్వేచ్ఛ హక్కు) రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణమైన సెక్యులరిజాన్ని దెబ్బతీస్తున్నాయి.
  3. నిరసన హక్కు, పౌర స్వేచ్ఛలకు పరిమితులు
    ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు అత్యంత ముఖ్యమైన అంశం. అయితే, ఇటీవలి సంవత్సరాలలో ఈ హక్కు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.
    ముఖ్య సందర్భాలు:
    CAA-NRC వ్యతిరేక నిరసనలు (2019-20):
    పౌరసత్వాన్ని మతంతో ముడి వేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి, షాహీన్‌ బాగ్‌ సిటిజన్‌ ప్రొటెస్ట్‌ చిహ్నంగా మారింది. నిరసనకారులపై దేశద్రోహం, UAPA వంటి కఠినమైన చట్టాల క్రింద కేసులు నమోదు చేయడం, కుమార్‌ కాలేజీ లాంటి వాళ్లకి సంవత్సరాల తరబడి బెయిల్‌ రాకుండా చేయడం వివాదాస్పదమైంది. నిరసనకారులపై దాడులు చేయించడం, చివరికి మతకలహాలు రెచ్చగొట్టి నిరసనని నీరుగార్చడం కోసం జరిగిన ప్రయత్నాలన్నీ నిరసన హక్కు పై నెలకొంటున్న కారుచీకట్లకు నిదర్శనం.
    – రైతుల ఆందోళన (2020-21): మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రక నిరసన. ఇంటర్నెట్‌ నిరోధం, మీడియా నియంత్రణ, నిరసన కారులను ఖలిస్తాన్‌ తీవ్రవాదులంటూ ప్రచారం చేయడం, కార్లతో తొక్కించి చంపడం, నిరసనకారుల అక్రమ అరెస్టులు, నిరసన వ్యక్తీకరణ స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తాయి.
    – భీమా కోరెగావ్‌ కేసు: సామాజిక కార్యకర్తలు, మేధావులపై UAPA క్రింద అరెస్టులు, దీర్ఘ న్యాయ విచారణ లేని నిర్బంధం. స్టాన్‌ స్వామి లాంటి 80 సంవత్సరాల పైబడిన మానవ హక్కుల కార్యకర్త అమానవీయంగా హాస్పిటల్‌ లో బేడీలతో చనిపోవడం, రెండు కాళ్లు పనిచేయని సాయిబాబా లాంటి వ్యక్తిని 10 సంవత్సరాలకు పైగా జైల్లో నిర్బంధించడం, ఇవన్నీ నిరసన హక్కును నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తున్న చర్యలే.
    నిరసన స్థలాల పరిమితులు, ”నియమించబడిన ప్రదేశాల”లో మాత్రమే నిరసన వ్యక్తం చేయాలని పరిమితులు విధిస్తారు. నిర్బంధ చట్టాలు(UAPA, NSA, sedition- ఆర్టికల్‌ 124A)ల దుర్వినియోగం చేస్తున్నారు. డిజిటల్‌ మీడియా నిరోధం, ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు, పౌర సమాజ సంస్థలపై ఆర్థిక నియంత్రణలు (FCRA) విధించడం నిరసన వ్యక్తీకరణకి ఎవరూ ముందుకు రాకుండా అడ్డుకునే చర్యలను కేంద్రం వేగంగా అమలు చేస్తుంది.
  4. పౌర సవరణ చట్టం (CAA), సమానత్వంపై సవాళ్లు
    2019లో ఆమోదించబడిన పౌర సవరణ చట్టం, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ నుండి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రిస్టియన్‌ మత అనుయాయులకు పౌరసత్వం మంజూరు చేస్తుంది, కానీ ముస్లింలను మినహాయించింది. ఇది రాజ్యాంగం నిర్దేశించిన సమానత్వానికి, సెక్యులరిజానికి విరుద్ధం.
    ఆర్టికల్‌ 14 ఉల్లంఘన మతం ఆధారంగా వర్గీకరణ ”హేతుబద్ధమైన వర్గీకరణ” పరీక్షను తప్తిపరుస్తుందా అనే ప్రశ్న? ఆర్టికల్‌ 15లో పేర్కొన్న మతం ఆధారంగా వివక్ష నిషేధాన్ని ఉల్లంఘిస్తుందా? రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం (BasicStructure) లో భాగమైన సెక్యులరిజంను బలహీనం చేస్తుందా? అనేది ఈ చట్టం వివిధ హైకోర్టులు, సుప్రీం కోర్టులో సవాలు చేయబడింది. న్యాయ తీర్పు భారత రాజ్యాంగంలో సమానత్వం, సెక్యులరిజం భావనలను కొత్తగా నిర్వచిస్తుంది.
  5. డిజిటల్‌ యుగంలో గోప్యత హక్కు
    క్షేత్రగాంగా తీర్పు (2017) – మైలురాయి:
    జస్టిస్‌ కె.ఎస్‌. పుట్టస్వామి ఙర యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో 9 మంది న్యాయమూర్తుల బెంచ్‌ ఏకగ్రీవంగా గోప్యతను ఆర్టికల్‌ 21 (జీవన, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు) కింద అంతర్లీనమైన ప్రాథమిక హక్కుగా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రజలపై సంచార సాతి యాప్‌తో ప్రజల సెల్‌ ఫోన్లు తన ఆధీనంలోకి తీసుకోవాలని చేసిన ప్రయత్నం తీవ్ర ప్రతిఘటన నేపథ్యంలో తాత్కాలికంగా వెనిక్కి తగ్గింది.
    Aadhaar వ్యవస్థతో 140 కోట్ల జనాభా బయోమెట్రిక్‌ డేటా సేకరణ, ప్రైవేట్‌ సంస్థలతో డేటా భాగస్వామ్యం, డేటా సంరక్షణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
    డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌, 2023 ద్వారా ప్రభుత్వం కొన్ని నిబంధనల నుండి మినహాయింపులు పొంది ప్రజల వ్యక్తిగత డేటా సేకరణ చేస్తున్నారు. ముఖ గుర్తింపు సాంకేతికత, పెగాసస్‌ స్పైవేర్‌ వివాదం, సెంట్రల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు సవాళ్లు విసురు తున్నాయి. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, డిజిటల్‌ చెల్లింపుల ద్వారా వ్యక్తిగత డేటా సేకరణ జరుపుతున్నారు.
    భారత రాజ్యాంగం కేవలం చట్టపరమైన పత్రం మాత్రమే కాదు – ఇది దేశం సామూహిక ఆశయాలు, విలువలు, కలల ప్రతిబింబం. 75 సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రయాణంలో, ఈ రాజ్యాంగం తన స్థితిస్థాపకతను, అనుకూలతను చాటుకుంది. ప్రాథమిక హక్కుల రక్షణ విస్తరణలో న్యాయస్థానాలు, పౌర సమాజం, మేధావులు సామాన్య పౌరులు కీలక పాత్ర పోషించారు.
    అయితే, రాజ్యాంగపరమైన ఆదర్శాలను భూమిపై వాస్తవంగా మార్చడం ఇప్పటికీ కొనసాగుతున్న పోరాటం. సామాజిక వివక్ష, ఆర్థిక అసమానత, రాజకీయ ధ్రువీకరణ, సాంకేతిక మార్పులు, ప్రపంచీకరణ వంటివి కొత్త సవాళ్లను సష్టిస్తున్నాయి.
    వర్గ రహిత సమాజం సాకారం కాకుండా హక్కులకి సమగ్రత, సంపూర్ణత సాధ్యం కాదు. అందుకే హక్కుల కోసం జరిగే పోరాటాలు వర్గ రహిత సమాజం కోసం జరిగే పోరాటాలతో ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది.
    మతపరమైన స్వేచ్ఛ హక్కు
  6. (ఆర్టికల్‌ 25-28):
  7. మనస్సాక్షి స్వేచ్ఛ, మత విశ్వాసం, ఆచరణ, ప్రచారం హక్కు, మతపరమైన వ్యవహారాల నిర్వహణ హక్కులకు రాజ్యాంగం హామీ ఇచ్చింది. భారత పౌరులు ఎవరైనా తనకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా అనుసరించే పరిస్థితులు దేశంలో ఉన్నాయా అనేది ఆత్మ విమర్శనాపూర్వకంగా పరిశీలన చేసుకోవాల్సిన సందర్భంలో మనం ఉన్నాం. అనేక బిజెపి పాలిత రాష్ట్రాలు మతమార్పిడులను నిషేధిస్తూ చట్టం చేశాయి. ప్రజల మత విశ్వాసాలలోకి ప్రభుత్వ జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. రాజ్యం అనేది మత ప్రమేయం లేని వ్యవస్థగా ఉండాల్సిన స్థితి నుండి క్రమంగా మత క్రతువులను నిర్వహించే వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రజల విశ్వాసాలని, ఆరాధన పద్ధతులని ప్రభుత్వాలే నియంత్రించే స్థితి అనేది మత స్వేచ్ఛకు పూర్తి విరుద్ధమైనది.

ఎం.డి అబ్బాస్‌
9030098032

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -