– ముగ్గురు విద్యార్థులు మృతి
– గేట్ కీపర్ నిర్లక్ష్యమే కారణం?
కడలూరు: రైలు పట్టాలు దాటుతున్న స్కూల్ వ్యాన్‌ను ఓ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరులో చోటుచేసుకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే రైలు పట్టాలపై నుంచి స్కూల్ వ్యాన్ వెళ్లడానికి మూసిన గేటు తెరవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేలింది. దీంతో ఆ గేట్‌కీపర్‌ను విధుల నుంచి తొలగించినట్టు రైల్వే శాఖ తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్పందించారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం 7:45 గంటల ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ను దాటుతున్న స్కూల్ వ్యాన్‌ను వేగంగా వస్తున్న 56813 ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో స్కూల్ వ్యాన్ చాలా దూరంలోకి ఎగిరిపడడంతో నుజ్జునుజ్జయ్యింది. ఈ వ్యానులోని ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులు ఓ ప్రయివేటు పాఠశాలలో చదువుతున్నారు. ఆరో తరగతి చదువుతున్న నిమిలేష్ (12), 11వ తరగతి చదువుతున్న సరుమతి (16), చెజియన్ (15)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో విశ్వేష్ (16), వ్యాన్ డ్రైవర్ శంకర్ (47) తీవ్రంగా గాయపడి కడలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
గేటు కీపర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం
గేటు కీపర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వే శాఖ తెలిపింది. రైలు వస్తుందని గేటు మూసివేయగా, ఆ గేటును తీయాలని వ్యాన్ డ్రైవర్ కీపర్‌ను కోరడంతో గేటు తెరిచాడని పేర్కొంది.