ఫూలే, అంబేద్కర్, మార్క్స్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలి : పుస్తకావిష్కరణ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పీడిత ప్రజల విముక్తి కోసమే గద్దర్ పాటలు రాసి పాడారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ చెప్పారు. ఫూలే, అంబేద్కర్, మార్క్స్ ఆలోచనలను ముందుకు తీసుకుపోవడమే గద్దర్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో పాలధార పాట పుస్తకావిష్కరణ సభను నిర్వహించా రు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ జన నాట్యమండలి కళారూపాల కోసం తమ గ్రామానికి గద్దర్ వచ్చారనీ, అనేక మంది కళాకారులను ఆయన ప్రభావితం చేశారని గుర్తు చేశారు. ఆయన చివరి సమయంలో రాష్ట్రంలో సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం టీమాస్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. గ్రామగ్రామాన తిరిగారనీ, సామాజికంగా అణచివేతకు గురైన వారిని ఐక్యం చేశారని అన్నారు. పాటలు పాడి ప్రజలను చైతన్యం చేశారని వివరించారు. ఆయన చేతిలో ఉన్న కర్రను చూపి నిచ్చెన మెట్ల కులవ్యవస్థ ఎలా ఉందో సామాన్యులకు అర్థమయ్యేలా వర్ణించి పాట పాడేవారని గుర్తు చేశారు. శ్రామికులు, కూలీలు, రైతులు, కార్మికులు, పీడిత ప్రజల విముక్తి పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. ఆయన రాసిన పాటలు వేలాది మందిని ప్రభావితం చేశాయన్నారు.
సినీనటులు రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రభావితం చేసి అభిమానులను సంపాదించుకుంటారని చెప్పారు. కానీ గద్దర్ మాత్రం కాళ్లకు గజ్జె కట్టి గోసి కట్టుకుని గొంగడి వేసుకుని ఎర్ర రుమాలు కట్టి చేతిలో కర్ర పట్టుకుని కోట్లాది మంది కళాకారులను ప్రభావితం చేశారని అన్నారు. అలాంటి కళాకారున్ని దేశంలో ఎవరినీ చూడబోమన్నారు. ఆయన పాటలు ప్రజలను ఉర్రూతలుగించాయనీ, చైతన్యపరిచా యనివ వివరించారు. పీడిత ప్రజల విముక్తి కోసం పోరాటం చేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. సామ్రాజ్యవాదానికి, భూస్వామ్య, కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఆయన పోరాటంచ చేశారని గుర్తు చేశారు. ప్రజలను సంఘటితం చేసి వారి విముక్తి కోసం పాటలు రాసి పాడారని చెప్పారు. సమాజంలో మార్పు కోసం కృషి చేయాలనీ, దోపిడీని అంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ హక్కులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. దేశంలో మతోన్మాదులు రాజ్యం ఏలుతున్నారనీ, ప్రజాస్వామిక హక్కుల్లేవని అన్నారు. రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని చెప్పారు. గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి జీవీ సూర్యకిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రొఫెసర్ శాంతాసిన్హా, మీడియా అకాడమి మాజీ చైర్మెన్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు కె శ్రీనివాస్, ప్రొఫెసర్ సి కాశీం తదితరులు పాల్గొని ప్రసంగించారు.
పీడిత ప్రజల విముక్తి కోసమే గళమెత్తిన గద్దర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES