Saturday, February 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేయూ హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ బిల్లుల అవినీతిపై పారదర్శకంగా విచారణ జరిపించాలి

కేయూ హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ బిల్లుల అవినీతిపై పారదర్శకంగా విచారణ జరిపించాలి

- Advertisement -

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాకతీయ విశ్వవిద్యాలయం హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ బిల్లుల అవినీతిపై పారదర్శకంగా విచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రజనీకాంత్‌, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం హాస్టళ్లలో విద్యార్థుల మెస్‌ బిల్లుల విషయంలో వెలుగులోకి వస్తున్న అవకతవకలపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందాల్సిన మెస్‌ నిధులు సరైన విధంగా వినియోగం కాకపోవడం, బిల్లులు పెండింగ్‌లో ఉంచడం, డమ్మీ పేర్లతో బిల్లులు బుక్‌ చేయడం వంటి ఆరోపణలు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయని వారు తెలిపారు. హాస్టళ్లలో 70 శాతానికి పైగా విద్యార్థులకు ఇండెంట్‌, స్కాలర్‌షిప్‌లు సమయానికి రాకపోవడంతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో మెస్‌ నిధుల దుర్విని యోగం జరిగిందనే ఆరోపణలు విద్యార్థుల ఆహార హక్కును హరించడమేనని విమర్శించారు. పేద, దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులు అధికంగా ఆధారపడే ఈ హాస్టల్‌ వ్యవస్థను అవినీతి బారిన పడడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పేర్లతో డమ్మీ బిల్లులు బుక్‌ చేసి, అసలు లబ్ధిదారులకు సరైన భోజనం అందకుండా చేయడం తీవ్రమైన దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. మెస్‌ కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందనే అనుమానాలు వ్యక్తమవుతు న్నాయని తెలిపారు. వెంటనే పూర్తి స్థాయి, స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.
కేయూ హాస్టల్‌ మెస్‌ బిల్లులపై న్యాయపరమైన, పారదర్శక విచారణ కమిటీని వెంటనే నియమిం చాలనీ, డమ్మీ బిల్లులు, అవకతవకలకు బాధ్యులైన అధికారులపై సస్పెన్షన్‌ సహా క్రిమినల్‌ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలనీ, పెండింగ్‌లో ఉన్న మెస్‌ బిల్లులు, స్కాలర్‌షిప్‌లు తక్షణమే విడుదల చేయాలని వారు కోరారు. విద్యార్థుల ప్రతినిధులతో కలిసి హాస్టల్‌ మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేయా లనీ, భవిష్యత్తులో ఇలాంటి అవినీతి జరగకుండా ఆన్‌లైన్‌ పారదర్శక బిల్లింగ్‌ వ్యవస్థ అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. పేద విద్యార్థుల ఆహారంపై దోపిడీకి పాల్పడే వారిని కఠినంగా శిక్షించకపోతే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -