Tuesday, July 15, 2025
E-PAPER
Homeజాతీయంఆంక్షలను ధిక్కరించి... అమరవీరులకు ఘన నివాళి !

ఆంక్షలను ధిక్కరించి… అమరవీరులకు ఘన నివాళి !

- Advertisement -

అడ్డంకుల కంటే ఉన్నతమైనది మా సంకల్పం
జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యలు
శ్రీనగర్‌ :
లెప్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) పాలనా యంత్రాంగం వైఖరిని ధిక్కరించి జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తన సీనియర్‌ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం శ్రీనగరంలోని మజర్‌-ఇ-షుహదా చేరుకుని అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. డోగ్రా పాలకుడికి వ్యతిరేకంగా 1931 జులై 13న తిరుగుబాటు చేసిన 22మంది పౌరులను ఊచకోత కోసిన ప్రాంతమైన ఖ్వాజా బజార్‌లోని నక్ష్‌బండ్‌ సాహిబ్‌ సమాధి వద్దకు అబ్దుల్లా నడుకుకుంటూ వెళ్ళడం కనిపించింది.


సమాధి ప్రవేశమార్గాన్నిó భద్రతా బలగాలు మూసివేయడంతో ముఖ్యమంత్రి ఆ ఆవరణ గోడ ఎక్కి దూకి లోపలకు వెళ్ళారు. అక్కడ ముఖ్యమంత్రి నివాళులు అర్పించకుండా నిలువరించేందుకు పోలీసు అధికారి ఒకరు ప్రయత్నించారు. మరోవైపు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఫరూక్‌ అబ్దుల్లా కూడా పార్టీ నేతలతో కలిసి వెళ్ళి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. సెక్యూరిటీ చెక్‌పాయింట్లను దాటుకునేందుకు గానూ సీనియర్‌ క్యాబినెట్‌ మంత్రి సకీనా ఇట్టూ కూడా ద్విచక్ర వాహనంపై ఆ ప్రదేశానికి చేరుకున్నారు.


ఆనాడు చనిపోయింది అమరవీరులు కాదు, అల్లరి మూక అంటూ బీజేపీ ప్రభుత్వం అమరవీరుల దినోత్సవం రోజున గల శలవును రద్దు చేసింది. 2019లో జమ్మూ కాశ్మీర్‌ ప్రత్యేక హోదాను కేంద్రం రుద్ద చేసిన తర్వాత నుండి అధికారిక శలవు దినాల జాబితాలో జులై 13ని తొలగించారు. అమరవీరులకు ి నివాళి అర్పించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఆదివారం ప్రభుత్వ, ప్రాంతీయ పార్టీల నేతలను వెళ్ళనివ్వకుండా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ యంత్రాంగం అడ్డుకుంది.


”ఈ చట్ట పరిరక్షకులు నన్ను తోసేశారు, పెనుగులాటల్లో పక్కకు నెట్టేశారు. నా నేరం ఏమిటి? 1931 జులై 13నాటి అమరవీరుల సమాధుల వద్దకు నివాళులు అర్పించాలనుకోవడమేనా? యూనిఫారంలో వున్న వారు కొన్నిసార్లు చట్టాన్ని కూడా మరిచిపోతుంటారు. నన్నెవ్వరూ ఆపలేరు, నన్నెవ్వరూ కొట్టలేరు, వారు అడ్డంకులు ఏర్పాటు చేశారు, కానీ మా సంకల్పం అంతకంటే ఉన్నతంగా వుంది. ” అని ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాను ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ”శాంతి భద్రతలను పరిరక్షించడమే మా బాధ్యత అని చెప్పుకునేవారు నివాళి అర్పించడానికి మమ్మల్ని అనుమతించకపోవడం దురదృష్టకరం, అక్కడకు వెళ్ళాలని కంట్రోల్‌ రూమ్‌కు చెప్పగానే బంకర్‌ వెహికల్‌ను ఆదివారం అర్ధరాత్రి వరకు మా నివాసం బయట పార్క్‌ చేసి వుంచారు. ఈ రోజు కూడా వాహనాలు అడ్డుపెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని చూశారు. జులై 13న ఆ ఆంక్షలు వుంటే, ఈ రోజున ఏ చట్టం కింద నన్ను ఆపారు? ” అని ఆయన ప్రశ్నించారు. ఇది స్వేచ్ఛాయుతమైన దేశం. కానీ ఎల్‌జి యంత్రాంగం మాత్రం మేం వారి బానిసలమని అనుకుంటారు., కానీ మేం ప్రజలకు సేవలకులమని అన్నారు. తమ పార్టీ పతాకాన్ని చించివేయడానికి కూడా వారు ప్రయత్నించారని అన్నారు. ఈరోజు ఆపితే రేపు వస్తాం, లేదా వచ్చే నెల వస్తాం, అంతేకానీ వారు మమ్మలను ఆపలేరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోలీసుల చర్యపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్త ంచేసిన ఎన్‌సి ఎంఎల్‌ఎ తన్వీర్‌ సాదిక్‌ మాట్లాడుతూ, ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎన్నికవని ప్రభుత్వం నిర్బంధించడం భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారని వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం లేదని ప్రపంచానికి చాటి చెప్పాలను కుంటున్నారా? అని ప్రశ్నించారు.
మమత ఖండన

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చర్యలను ఖండించారు. అమరవీరుల సమాధులను సందర్శించడంలో తప్పేంటి? పౌరుల ప్రజాస్వామ్య హక్కులను లాగేసుకోవడమే ఇదని విమర్శించారు. ముఖ్య మంత్రి అబ్దుల్లాకు జరిగిన ఘటనదిగ్భ్రాంతికరం, సిగ్గుచేటైన విషయమని ట్వీట్‌ చేశారు.
”అధికారం కొంచెమే నేర్పుతుంది, కానీ అధికారం లేకపోవడం మరింత ఎక్కువ నేర్పుతుంది.”అంటూ హురియత్‌ చైర్మన్‌ మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రతి రోజూ వివిధ రూపాల్లో సామాన్యులైన కాశ్మీరీలు ఎదుర్కొనే నిరంకుశవాద తలబిరుసుతనాన్ని, తదనంతరర నిస్సహాయ పరిస్థితులను ఈనాడు ముఖ్యమంత్రి రుచి చూశారని వ్యాఖ్యానించారు. ప్రజలకు ప్రధమ ప్రాధాన్యత ఏంటనే విషయమై దృష్టి మరల్చేందుకు ఈ అనుభవం ఆయనకు పనికొస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -