ప్రతిమనిషి పుట్టుకతోనే జీవించే హక్కుతో భూమిమీదకు వస్తాడు. మరణం అనేది ఆ హక్కుకు దూరం కావడమే! సాధారణ మరణం సహజ ప్రక్రియ. యుద్ధ మరణం అనేది ఉన్మాద చర్యతో జీవించే హక్కును అర్థాంతరంగా తుంచివేయడం. అందుకే ఏరకమైన యుద్ధమైనా వినాశ హేతువే? యుద్ధం ఒక పీడకచర్య. యుద్ధ మరణాలకు హేతుబద్దత ఉండదు. మధ్యయుగాలలో యుద్ధమంటే వీరత్వానికి ప్రతీక. అటు తర్వాత ఆయుధం ప్రధానపాత్ర వహించింది. అధికారానికి ఆయుధం ప్రాకారంగా నిలిచింది. సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ దశలో ఆయుధానిదే పైచేయి అయింది. ఇప్పుడు యుద్ధ వ్యూహాల్లో మార్పులొచ్చాయి. ఒకప్పుడు రష్యా, అమెరికా ప్రచ్ఛన్న యుద్ధస్థితి నుంచి, రష్యా అంతర్గత రాజకీయ మార్పుల తర్వాత అమెరికా ఏకధృవ ప్రపంచంగా ఎదిగింది. అంతేకాదు, తమ భూభాగంలో కాకుండా ప్రపంచం మొత్తం యుద్ధ స్థావరాలు ఏర్పరచుకొని, సైన్యాన్ని మోహరించి ప్రపంచ పోలీసుగా పెత్తనం చేస్తోంది. జనరల్ గడాఫీ, అలెండీ, సద్దాం హుస్సేన్ లాంటి ఎందరో దేశాధినేతలను హత్య చేయడంతో పాటు, ఆసియా, అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో అనేక దేశాలతో యుద్ధాలు చేసింది. చివరకు తమ వ్యాపార సామ్రాజ్యానికి పోటీరాకుండా జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబులు వేసి సాముహిక మానవహననానికి అమెరికా పాల్పడింది. వియత్నాంతో పదహారేళ్ల సుదీర్ఘ యుద్ధం తర్వాత అమెరికా దూకుడుకు కళ్లెం పడింది.
ఇప్పుడు ఇరాన్‌తో భూతల యుద్ధంతో తలపడడం అంటే చావునోట్లో తలపెట్టడమేనన్న వ్యవహారం అర్థమైన తర్వాత ఇంటా, బయట ఏకాకిగా మారిన ట్రంప్, వ్యూహం మార్చి ఇరాన్‌తో సీజ్ పైర్‌కు తాపత్రయ పడ్డాడు. వ్యూహాత్మకంగా ఊపిరి పీల్చుకోవడానికి ఇరాన్ కూడా పది షరతులతో సిద్ధమైంది. సీజ్‌పైర్ అనబడే ఒప్పందం అనేది ఇటీవల కాలంలో ముందుకొచ్చిన దౌత్య ప్రక్రియనే. ఒకప్పుడు గ్రూపుల మధ్య ఒప్పందం ఇప్పుడు దేశాల మధ్యకు మారింది. భారత్-పాకిస్తాన్, ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధాలలో ట్రంప్ ముందుకు తెచ్చిన ప్రక్రియనే ఇది. కొత్తదేం కాదు, కాకుంటే ఓటమి అంచుల్లో పరువు దక్కించుకునే ఏకైక సూచిక! ట్రంప్ రెండువారాల యుద్ధ వెసులుబాటుకు ప్రయత్నమే ఆయనలో నెలకొన్న ఓటమి భయానికి నిదర్శనం. ఇరాన్‌లో 240మంది మహిళలు, 212 మంది పిల్లలు వెరసి 2076 మంది ప్రజలు యుద్ధంలో మరణించారు, 26,500 ప్రజలు గాయపడ్డారు. మిత్రదేశం లెబనాన్‌లో మరో 13వందల మంది ప్రజలను ఇజ్రాయిల్ చంపేసింది. అంతేకాదు, యుద్ధ ప్రారంభంలోనే ఇజ్రాయిల్, అమెరికా కుట్రపూరితంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయుతుల్లా ఖొమైనీని అంతం చేసింది. అయినా ఇరాన్ తమ మౌలిక వనరుల రక్షణ దృష్టితో సీజ్‌ఫైర్‌కు అంగీకరించింది.
సుదీర్ఘ కాలం తమవెంట ఉన్న పశ్చిమ యూరప్ దేశాల యుద్ధ్ద కూటమి ”నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్’ నాటోలోని 30 దేశాలు ఇరాన్‌పై ట్రంప్ దాడికి మద్దతివ్వలేదు. సరికదా కొన్ని దేశాలు నేరుగా ఇరాన్‌కు మద్దతు తెలిపాయి. ఇక ప్రపంచ దేశాల ప్రజలతో పాటు, తనదేశంలో ప్రజలు నిరసన పతాకస్థాయికి చేరడంతో ట్రంప్ ఓ అడుగు సీజ్‌పైర్ పేరుతో వెనక్కి తగ్గాడు తప్ప, తనలోని యుద్ధ పిపాసి ఇంకా చావలేదు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చోడి చేతిలో రాయిలా ప్రపంచ దేశాలపై టారిఫ్‌ల పేరుతో విరుచుకుపడ్డాడు. గాజా విషయంలో ఇజ్రాయిల్ అమానుష కాండకు పరోక్షంగా మద్దతిచ్చాడు. పనామా అధ్యక్షుడు నోరిగోను మాదకద్రవ్యాల పేరుతో జైలు శిక్ష వేసి నిర్భందించాడు.”ఆపరేషన్ అబ్జార్వేట్ రిజర్వ్” పేరుతో ప్రజలచేత ఎన్నికైన వెనెజులా అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియాలను అర్థరాత్రి ఇంటినుంచి కిడ్నాప్ చేసి అమెరికా జైలులో నిర్బంధించాడు.
కేవలం ఆయిల్‌పై నియంత్రణ కోసం ఒకదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్థకం చేయడమే కాక, తన పదవీ కాలం ముగిసిన తర్వాత వెనెజులాలో ఎన్నికలని కుళ్లు జోకులు వేస్తున్నాడు. పక్క రాష్ట్రం మెక్సికోతో ఘర్షణ, చిన్నదీవి లాంటి దేశం క్యూబాపై మానవత్వం మరచి ఆంక్షలు పెట్టడంతో పాటు, ఇరాన్ యుద్ధం తర్వాత క్యూబా అంతు చూస్తానంటున్నాడు. మరోవైపు పక్క దేశం కెనడాను తమదేశంలో అంతర్భాగం రాష్ట్రంగా కలుపుకుంటామని అవాకులు చవాకులు పలుకుతున్నాడు. నాటోలో అంతర్భాగమైన డెన్మార్క్‌కు చెందిన గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించి నాటో కూటమి దేశాల్లో తమ పరపతి కోల్పోయాడు.
ఆప్ఘనిస్తాన్‌లోని కాందహార్ విమానాశ్రయం కావాలని పట్టుబడుతున్నాడు. ఇవన్నీ ట్రంప్ ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించకుండా వేస్తున్న చిల్లర వేషాలు తప్ప మరొకటి కాదు. మరో ముఖ్యమైన విషయం. ఎప్‌స్టీన్ పైల్స్ నుండి బయటపడడం కోసం, అత్యంత పెద్దదైన ఆసియా ఖండంలో పట్టుకోసం మరో యుద్ధోన్మాద దేశం ఇజ్రాయిల్‌తో కలిసి కుట్రపన్నాడు! ఇరాన్‌ను ఓడిస్తే తనకు ప్రపంచంలో తిరుగుండదని, యుద్ధ ప్రారంభంలోనే ఖొమైనీ లాంటి ఆయువుపట్టును లేపేస్తే, తాను వెనెజులా దేశంలా ఇరాన్‌ను కబళించి ఆధిపత్యం చెలాయించాలని చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. నలభై రోజులుగా యుద్ధంలో ఇరాన్ అటు ఇజ్రాయిల్‌తో పోరాడుతూనే, అమెరికా అవకాశ ఆధిపత్యాన్ని వ్యూహాన్ని సవాల్ చేసి నిలబడింది. ఇరానియన్ రిపబ్లిక్ గార్డుల ధైర్య సాహసాలముందు అమెరికా తలవంచక తప్పలేదు. అగ్రరాజ్య ఆధునిక యుద్ధ విమానాలను కూల్చివేయడంతో ట్రంప్ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. అంతర్గత సంక్షోభం, అధికార మార్పిడి లాంటి మాటలు ఇరాన్‌లో తుత్తునీయలు కావడం, ప్రపంచ పాలక వర్గాలు ఎలావున్నా ప్రజలు మద్దతు ఇరాన్‌కు అను కూలంగా ఉండడం, ఇరాన్ కూడా భౌగోళిక యుద్ధ తంత్రం హార్మూజ్ జలసంది మూసివేత, గల్ఫ్‌లో ఉన్న సౌదీ అరేబియా తదితర దేశాల్లో అమెరికా సైనిక శిబిరాలు, ఆయా దేశాల సాంకేతిక, ఆర్థిక వనరులపై వ్యూహాత్మకంగా దాడులు జరపడం ద్వారా అమెరికాకు వణుకు పుట్టించిందని చెప్పవచ్చు.
ఇజ్రాయిల్ కోసం అమెరికా ఇరాన్‌పై దండయాత్రకు దిగింది. తమకు అమెరికా ప్రజలతో ఎలాంటి శత్రుత్వం లేదని ఇరాన్ ప్రకటించడం ఆ దేశ కుయుక్తిని ఎండగట్టింది. అమెరికా ఇరాన్ యుద్ధంలో ఒంటరై ఏకధృవ ప్రపంచం ఏవగింపునకు గురైంది. ఈ దశలో సీజ్‌పైర్ రెండు వారాల తర్వాత శాశ్వత ఒప్పందం జరుగుతుందా? యూటర్న్ తీసుకుంటుందా? ఈ విషయం నిర్ధారించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒప్పందం జరిగింది అమెరికా-ఇరాన్ మధ్య కనుక తాము యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయిల్ తన యుద్ధ దాహం తీరక లెబనాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. అందుకు ప్రతిగా ఇరాన్ సైతం గల్ఫ్‌లో ఇజ్రాయిల్, అమెరికా అనుకూల దేశాలపై దాడులు చేస్తోంది. అమెరికా-ఇరాన్ యుద్ధం ద్వారా రష్యా ఒకింత ఆయిల్ వ్యాపార రిత్యా, ఉక్రెయిన్ వైపు అమెరికా ఆయుధ సంపత్తి అందకుండా చేయడంలో సఫలమైంది. చైనా, ఉత్తరకొరియా, రష్యా దేశాలు ఇరాన్‌కు అందించిన సాంకేతిక, ఆయుధ మద్దతు ఆ దేశం నిలబడడానికి చాలా తోడ్పాటునందించింది. హార్మూజ్ జలసంది విషయంలో చైనా, రష్యా, ప్రాన్స్ ఐక్యరాజ్యసమితిలో తమ వీటో అధికారంతో ఇరాన్‌కు మద్దతు పలకడం అమెరికా ఏకఛత్రాధిపత్యానికి ఒక రకంగా చెక్ పెట్టినట్లే!
ఎన్.తిర్మల్
9441864514



