పూల బొకేలకు బదులు ఆర్గానిక్ కూరగాయలతో శుభాకాంక్షలు తెలిపిన యూత్ కాంగ్రెస్ నేత రోమాల ప్రవీణ్..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. గురువారం వేములవాడ రూరల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రోమాల ప్రవీణ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ప్రభుత్వ విప్‌ను మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రోమాల ప్రవీణ్ వినూత్న రీతిలో తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. సాధారణంగా అందించే పూల బొకేలకు బదులుగా, పర్యావరణ పరిరక్షణకు నిదర్శనంగా స్వచ్ఛమైన ఆర్గానిక్ కూరగాయలను ఆది శ్రీనివాస్‌కు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక విధానం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది. ఆరోగ్యకరమైన ఆహారం ప్రాధాన్యతతో పాటు రైతుల కష్టాన్ని గౌరవించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
అనంతరం రోమాల ప్రవీణ్ మాట్లాడుతూ..శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో వేములవాడ నియోజకవర్గం ఈ ఏడాదిలో కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుండే ఆది శ్రీనివాస్‌కు మరిన్ని విజయాలు దక్కాలని, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు తోడుగా ఉంటాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వకలాభరణం శ్రీనివాస్, ఉప సర్పంచ్ పాలకుర్తి శంకరయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలకుర్తి పరశురామ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొడ్డు రాములు తదితరులు, పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



