జైపూర్ : అదానీ గ్రూప్ సంస్థకు వ్యతిరేకంగా తీర్పు చెప్పడమే ఆ న్యాయమూర్తి చేసిన నేరం. తీర్పు ఇచ్చిన రోజే ఆయనపై బదిలీ వేటు పడింది. వివరాలలోకి వెళితే…రాజస్తాన్ ప్రభుత్వానికి చెందిన కంపెనీకి ఆర్థికంగా నష్టం కలిగించే విధంగా అదానీ గ్రూప్ సంస్థ రవాణా చార్జీల రూపంలో రూ.1,400 కోట్లు వసూలు చేసిందని జైపూర్ వాణిజ్య కోర్టు జడ్జి దినేష్ కుమార్ గుప్తా జులై ఐదోతేదీన తీర్పు చెప్పారు. అదే రోజు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వాణిజ్య కోర్టుల జడ్జీలను హైకోర్ట్ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తాయి. కాగా రాజస్తాన్ హైకోర్టు అదే రోజు గుప్తాను రాజధానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీవర్ జిల్లాకు బదిలీ చేసింది. రెండు వారాల తర్వాత గుప్తా ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. అదానీ గ్రూప్ సంస్థపై జడ్జి గుప్తా యాభై లక్షల రూపాయల జరిమానా విధించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, అదానీ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందాన్ని ఆడిట్ చేయాల్సిందిగా కాగ్‌ను కోరాలని రాజస్తాన్ సర్కారును ఆదేశించారు. వీటన్నింటిపై హైకోర్టు స్టే ఇచ్చింది. కాగా తన బదిలీపై వ్యాఖ్యానించేందుకు జడ్జి గుప్తా నిరాకరించారు.
వివాదం ఏమిటి?
2007లో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఛత్తీస్‌గఢ్ అడవిలోని ఓ బొగ్గు గనిని రాజస్తాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్‌కు కేటాయించింది. ఇది రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన విద్యుదుత్పత్తి సంస్థ. ఒప్పందం ద్వారా…థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును తవ్వడానికి ఆ సంస్థకు అనుమతి లభించింది. అయితే రాజస్థాన్ ప్రభుత్వ కంపెనీ అదానీ గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకుని బొగ్గు తవ్వకాలను దానికి ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చింది. ఈ ఉమ్మడి భాగస్వామ్యంలో అదానీ సంస్థకు 74 శాతం వాటాలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో తవ్విన బొగ్గును రైలు ద్వారా రాజస్తాన్‌కు రవాణా చేయాల్సి ఉండగా అందుకోసం అదానీ నేతృత్వంలోని జాయింట్ వెంచర్ కొన్ని నిర్మాణాలు ప్రారంభించింది.
ఈ తరుణంలో రాజస్థాన్ ప్రభుత్వ కంపెనీ, అదానీ గ్రూప్ సంస్థ కలిసి ఓ రవాణా ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. రైల్వే సైడింగ్స్ నిర్మాణం పూర్తయ్యే వరకూ బొగ్గును రోడ్డు మార్గం ద్వారా రైల్వే స్టేషన్లకు రవాణా చేసే పనిని ఆ ఏజెన్సీకి అప్పగించారు. ఒరిజనల్ ఒప్పందంలో రోడ్డు రవాణా ప్రస్తావనే లేదు. కానీ రోడ్డు మార్గం ద్వారా బొగ్గును రవాణా చేసినందుకు అదానీ నేతృత్వంలోని జాయింట్ వెంచర్ రాజస్థాన్ కంపెనీకి రూ.1,400 కోట్లకు పైగా బిల్లు పంపింది. ఆ బిల్లును రాజస్తాన్ కంపెనీ చెల్లించింది. అయితే చెల్లింపులు ఆలస్యమైనందున వడ్డీ కూడా ఇవ్వాల్సిందేనని అదానీ సంస్థ డిమాండ్ చేసింది. దీనిపై రాజస్తాన్ ప్రభుత్వ కంపెనీ జైపూర్ వాణిజ్య కోర్డును ఆశ్రయించింది.
అదానీ సంస్థకు వ్యతిరేకంగా తీర్పు.. రాజస్తాన్‌లో జడ్జి బదిలీ
- Advertisement -
- Advertisement -



