Saturday, January 17, 2026
E-PAPER
Homeకవర్ స్టోరీమహిళా జయకేతనం... ఐద్వా

మహిళా జయకేతనం… ఐద్వా

- Advertisement -

మహిళా ఉద్యమ ప్రస్థానంలో నలభై ఐదేండ్లు గడిచిపోయాయి. నలభై ఆరవ ఏడాదిలోకి అడుగుపెడుతున్న ఐద్వా 14వ మహాసభలకు సిద్ధమవుతోంది. ఆతిధ్యం ఇవ్వటానికి హైదరాబాదు నగరం సంసిద్ధమవుతోంది. ఈ సుదీర్ఘ ఉద్యమ ప్రయాణంలో ఎన్నో విజయాలు, మలుపులు, మజిలీలు. ఆ వివరాలు సోపతి పాఠకుల కోసం…

1981 మార్చి 10 – 12 తేదీలలో ఇప్పటి చెన్నై నగరం (అప్పటి మద్రాసు మహానగరం)లో జరిగిన మొదటి మహాసభ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఏర్పడింది. అంతకుముందు అనేక రాష్ట్రాలలో ఎక్కడికక్కడే రకరకాల పేర్లతో పిలవబడే సంఘాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘం’గా, పశ్చిమబెంగాల్లో ‘పశ్చిమబంగా గణతంత్ర మహిళా సమితి’గా, మహారాష్ట్రలో ‘శ్రామిక మహిళా సంఘం’గా, పంజాబ్‌లో ‘పంజాబ్‌ ఇస్త్రీ సభ’ పేరుతో, త్రిపురలో ‘త్రిపుర గణతంత్ర మహిళా సమితి’… ఇలా రకరకాల పేర్లతో అనేక రాష్ట్రాల్లో సంఘాలు ఏర్పడి పనిచేస్తూ వచ్చాయి. అవన్నీ కలిసి దేశవ్యాప్త ఉద్యమానికి దేశవ్యాప్త స్వరూపాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో అఖిల భారత స్థాయిలో ఈ సంఘం ఏర్పడింది. అది 1981లో ఏర్పడింది.

మొదటి కేంద్ర కమిటీ
మొట్టమొదటి మహాసభలో ఈ సంఘానికి అధ్యక్షురాలుగా ప్రముఖ న్యాయవాది పశ్చిమ బెంగాల్‌కు చెందిన మంజరీ గుప్త, ప్రధాన కార్యదర్శిగా గొప్ప కార్మిక, మహిళా ఉద్యమ నాయకురాలు, స్వాతంత్ర సమరయోధురాలైన సుశీల గోపాలన్‌ ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘం అప్పటి ప్రధాన కార్యదర్శి మోటూరు ఉదయం కోశాధికారిగా మరి కొంతమంది నాయకుల సారధ్యంలో కమిటీ ఏర్పడి పనిచేస్తూ వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి అప్పటి సంఘం అధ్యక్షురాలుగా ఉన్న మల్లు స్వరాజ్యం సుదీర్ఘకాలం, ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న మానికొండ సూర్యవతి కేంద్ర కార్యవర్గానికి ఎన్నికయ్యారు. ఇప్పటి జగమెరిగిన నేతలు బృందాకరత్‌, సుభాషిని ఆలీలు సహాయ కార్యదర్శులుగా, కెప్టెన్‌ లక్ష్మీ సైగల్‌, విమలారణదివే, అహల్య రంగనేకార్‌, కనక్‌ ముఖర్జీ, ఇలా భట్టాచార్య, పాప ఉమానాద్‌ వంటి నాయకులు ఉపాధ్యక్షులుగా మరి కొంతమంది నాయకులతో కమిటీ ఎన్నికయింది.

సెవెన్‌ సిస్టర్స్‌
సంఘం ఏర్పడ్డ నాటి నుండి దేశంలో స్త్రీల ఆశలకు, ఆకాంక్షలకు, వారి హక్కుల సాధనకు ఐద్వా ఒక వేదికయింది. స్త్రీలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలపై దృష్టి పెట్టింది. స్త్రీల సమస్యలను ఒక రాజకీయ ఎ జెండాలోకి తీసుకువచ్చేందుకు, అన్ని సంఘాలను ఐక్యం చేసి ఉద్యమించడానికి చాలా గట్టి ప్రయత్నం చేసింది. ఆ విధంగా కేంద్ర స్థాయిలో ఏడు మహిళా సంఘాలు కలిసి పనిచేస్తూ వచ్చాయి. వాటినే సెవెన్‌ సిస్టర్స్‌ (ఏడుగురు అక్క చెల్లెలు) అంటారు. అవే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), భారత మహిళల జాతీయ సమాఖ్య (ఎన్‌.ఎఫ్‌.ఐ.డబ్ల్యూ), అఖిల భారత మహిళా మహాసభ (ఏఐడబ్ల్యుసి), యంగ్‌ ఉమెన్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌ (వైడబ్ల్యుసిఏ), మహిళా దక్షత సమితి, జాయింట్‌ ఉమెన్స్‌ ప్రోగ్రాం (జేడబ్ల్యుపి), సెంటర్‌ ఫర్‌ ఉమెన్స్‌ డెవలప్మెంట్‌ స్టడీస్‌ (సీడబ్ల్యూడీఎస్‌).

ఐక్య ఉద్యమాలు
సమాజంలో స్త్రీల పట్ల ఉండే భావాలు మనకు తెలిసినవే. ‘ఆ ఆడది ఏం చేస్తుందిలే’ అనుకునే పరిస్థితి. ఇంటి లోపల గానీ, ఇంటి బయటగానీ స్త్రీల జీవితాల గురించి, వారి సమస్యల గురించి పట్టించుకునే దిక్కు ఉండదు. పైగా లెక్కచేయనితనం చాలా ఎక్కువ. అటువంటి స్థితిలో స్త్రీల సమస్యలు, వారి గుర్తింపు, గౌరవం కోసం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం తీసుకురావడానికి, రాజకీయ ఎజెండాలోకి, ప్రభుత్వ ఏజెండాలోకి తీసుకురావడానికి, చట్టసభల్లో చర్చించి, చట్టాల్లో మార్పులు తేవటానికి ఈ ఏడుగురు అక్కచెల్లెళ్ల కృషి అపూర్వమైనది. వారిలో కూడా ఐద్వా నాయకులుగా ఉన్న సుశీల గోపాలన్‌, బృందా కారత్‌, కనక్‌ ముఖర్జీ, విమల రణదీవే, అహల్య రంగేకర్‌ వంటి వారి కృషి అమోఘమైనది. వారికి అప్పటి కమ్యూనిస్టు ఉద్యమ నేతలు ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ వంటి నాయకుల తోడ్పాటు కూడా అపూర్వం.

వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా
వరకట్న మరణాలు, వేధింపులు అప్పుడూ ఉన్నాయి, ఇప్పుడూ ఉన్నాయి. కట్నం ఇవ్వడం, పుచ్చుకోవటం సాంప్రదాయం అనే భావం జనాల్లో బలంగా ఉన్నది. కానీ కట్నం పేరుతో ఆడపిల్లకి ఇచ్చిన డబ్బు గానీ, బంగారం లాంటి విలువైన వస్తువులు, సామాన్లకు గాని లెక్కలేదు. పైగా ఇంకా కావాలని పీడించడం ఇప్పటికీ ఉన్నది. ఆ స్థితిలో కట్నం కావాలని వేధించటాన్ని ఒక నేరంగా పరిగణించాలని పెద్ద ఉద్యమం జరిగింది. ఆ తర్వాతే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (భారత శిక్షాస్మృతి)లో సెక్షన్‌ 498బి చేర్చబడింది. ఇది కట్నం పేరుతోగాని ఇతరత్రాగాని కుటుంబంలో స్త్రీలను కనుక హింసిస్తే అందుకు శిక్షారులు.

వరకట్న చావులకు ఎక్కడా సాక్ష్యాలు దొరకవు. స్టవ్‌ అంటుకొని కోడళ్లే చచ్చిపోతారు. అది హత్యో తెలియదు, ఆత్మహత్యో తెలియదు. కానీ వేధింపులే కారణమని మాత్రం తెలుస్తుంది. అయితే దానికి సాక్ష్యం ఎట్లా సంపాదించడం. అసాధ్యంగా ఉండేది. కాబట్టే పెళ్లయిన అమ్మాయి ఏడేండ్ల లోపు గనక అసహజంగా మరణిస్తే, అందుకు ఏదో రూపంలో వేధింపులు కారణమయ్యాయి అనేది అర్థమైతే, ఆ మరణం హత్యా లేదా ఆత్మహత్యా అన్నదానితో నిమిత్తం లేకుండా దాన్ని వరకట్నం మరణంగా పరిగణించి, అందుకు బాధ్యుల్ని శిక్షించడం జరుగుతుంది. ఆ విధంగా కూడా ఐపిసి సెక్షన్‌ 306 బి చేర్చబడింది. చట్టంలో ఈ మార్పులు చిన్నది కాదు. మహిళల ఉద్యమాల ద్వారానే సాధ్యమైంది.

దురాచారాలను దునుమాడుతూ
షాబాను కేసు ఒక ప్రముఖమైనది. 70 ఏండ్ల వృద్ధ స్త్రీ షాబాను. ఆమె భర్త గొప్ప లాయరు. ఆమెకి భర్త మూడుసార్లు తలాక్‌ చెప్పి విడాకులు ఇచ్చాను అని, ఆమెకి భరణం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించాడు. కొడుకుల సహాయంతో ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆ సందర్భంగా ముస్లిం మహిళలకు కూడా మనోవర్తి కావాలని దేశవ్యాప్తంగా ఉద్యమాలు, పోస్ట్‌ కార్డు మీద సంతకాలు సేకరించాం. రాజస్థాన్‌లో రూప్‌ కన్వర్‌ అని ఒక నవవధువు. 18 ఏండ్ల యువతి. భర్త అనారోగ్యంతో చనిపోయాడు. అయితే భర్త చితిలో పడి మరణించాలి అనే సతీసహగమన దురాచారాన్ని, పాతకాలపు దురాచారాన్ని తీసుకొచ్చి ఆమెను చితిపై వేసి తగలబెట్టారు. దానిమీద కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమాలు, ప్రదర్శనలు చేశాం.

లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా
స్త్రీల మీద, చిన్న పిల్లల మీద జరిగే లైంగిక వేధింపులుకి అడ్దూ అదుపు లేదు. పని ప్రదేశాల్లో మరీ ఎక్కువ. భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుండి అసంఘటిత కార్మికులు, ఆఫీసుల్లో పెద్దపెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ల వరకు, ఎవ్వరూ ఈ వేధింపులకు మినహాయింపు కాదు. పంజాబ్‌లో పెద్ద పోలీస్‌ ఆఫీసర్‌ కెపిఎస్‌ గిల్‌ అనే చేతే అవమానానికి గురైన మరో పోలీస్‌ ఆఫీసర్‌ రూపం బజాజ్‌ కోర్టులో కేసు వేసింది. అదే దేశమంతా సంచాలం సృష్టించింది. ఇటీవల కాలంలో మీ టు ఉద్యమకారణంగా లైంగిక వేధింపుల సమస్య రాజకీయ ఎజెండాలోకి వచ్చింది. చిన్నపిల్లల మీద జరుగుతున్న వేధింపులు కూడా మనం రోజు చూస్తున్నాం. ఈ సమస్యల పైన గత 40 ఏండ్లుగా ఐద్వా పోరాడుతూ వస్తుంది. వీటన్నింటి ఫలితమే చిన్న పిల్లలపై అఘాయిత్యాల్ని నిరోధించే పోక్సో యాక్ట్‌ గాని, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం గాని అమలులోకి వచ్చాయి.

రిజర్వేషన్ల కోసం…
స్త్రీల రాజకీయ హక్కుల విషయం మరొకటి. పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కావాలనీ, అసెంబ్లీ, పార్లమెంట్లు వంటి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కావాలనీ సుదీర్ఘకాలంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. స్థానిక సంస్థల్లో అయితే రిజర్వేషన్లు వచ్చాయి. కానీ చట్టసభల్లో రిజర్వేషన్లకి పెట్టిన బిల్లులు అటక మీదే ఉన్నాయి. ఇంతవరకు వాటి అతీగతి లేదు. రాజకీయ పార్టీలు పైకి ఏమి చెప్పిన మహిళల్ని రాజకీయ హక్కుల్ని నిరాకరిస్తూనే వస్తున్నారు.

ఎందరో వీర వనితలు
వాస్తవానికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర, వారసత్వ సంపద ఉన్నాయి. మహిళా ఉద్యమం స్వాతంత్రోద్యమ కాలంలోనే మొదలైంది. స్వతంత్ర ఉద్యమంలో అంతర్భాగంగా సాగింది. దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలు, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా రైతాంగ పోరాటాలు సాగాయి. వీటన్నింటిలోనూ మహిళలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు దేశ్‌ముఖ్‌లు, జమీందారులకు వ్యతిరేకంగా భూమి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, స్త్రీల ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటంలో పురుషులతోపాటు ఎంతోమంది వీర వనితలు పాల్గొన్నారు.

మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, వీరనారి ఐలమ్మ, స్వరాజ్యేశ్వరమ్మ, మంత్రాల రాములమ్మ, సుగుణమ్మ లాంటి ఎందరో వీరవనితలు ఆ ఉద్యమం అందించిన రత్నాలే. ఆంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా మందస రైతాంగ పోరాటం చరిత్రకి ఎక్కింది. ఏడు నెలల గర్భవతి గున్నమ్మ ప్రాణత్యాగం చేసింది. చల్లపల్లి జమీందారు వ్యతిరేక పోరాటంలో బావిరెడ్డి వియ్యమ్మ ప్రాణాలు కోల్పోయింది. ఎంతోమంది మహిళలు అరెస్టులు అయ్యారు. జైళ్ళకెళ్లారు. పోలీసుల వేధింపులకు గురయ్యారు.

మహిళా కార్మికుల పోరాటాలు
కార్మిక ఉద్యమాల్లోనూ ఆంధ్ర రాష్ట్రంలో ఐ.ఎల్‌.టి.డి కార్మికులు, కేరళలో పీచు పరిశ్రమలో కార్మికులు, మహారాష్ట్రలో బట్టల మిల్లు కార్మికులు, బీహార్‌లో బొగ్గు గని కార్మికులు, పశ్చిమ బెంగాల్లో జనపనార, రైల్వే కార్మికులు, అస్సాం వంటి చోట్ల తేయాకు కార్మికులు కొన్ని లక్షల మంది ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని వర్లీ ఆదివాసి తిరుగుబాటు, త్రిపుర, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో, ఆంధ్రాలోని మన్యంలో ఆదివాసులు జరిపిన పోరాటాలు చాలా గొప్పది. ఈ ఉద్యమాలన్నీ అఖిల భారత మహిళా ఉద్యమానికి భూమికను ఏర్పరిచాయి.

ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో
స్త్రీల సమాన హక్కుల కోసం కూడా ఉద్యమాలు సాగాయి. స్త్రీల ఓటు హక్కు కోసం ఉద్యమాలు సాగాయి. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా, వితంతు పునర్వివాహాల కోసం, ప్రసూతి సౌకర్యాల కోసం, కుటుంబాల్లో స్త్రీకి మెరుగైన స్థానం కోసం, ఆస్తి హక్కుల కోసం, వివాహం, విడాకులు వంటి హక్కుల కోసం కూడా అనేక ఉద్యమాలు సాగాయి. ఈ క్రమంలోనే 1936లోనే కృష్ణా జిల్లాలో వల్లభనేని సీతామాలక్ష్మి, చండ్ర సావిత్రమ్మ, మానికొండ సూర్యవతి వంటి నేతల సారధ్యంలో తూర్పు కృష్ణ మహిళా సంఘం ప్రారంభమైంది. ఆంధ్రా ప్రాంతంలో 1947లో గుంటూరు జిల్లా చిలువూరులో మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్ర మహిళా మహాసభ జరిగింది. మానికొండ సూర్యావతి, డాక్టర్‌ కొమర్రాజు అచ్చమాంబ, మోటూరు ఉదయం వంటి నేతలు దానికి సారధ్యం వహించారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా 1973లో ఖమ్మం పట్టణంలో ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘం మూడో మహాసభ జరిగింది.

కొండపల్లి దుర్గాదేవి, ఏలూరు జయమ్మ, స్వరాజ్యేశ్వరమ్మ వంటి నేతలు సారథ్యం వహించారు. అప్పటినుండి మహిళా ఉద్యమం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నది. 1981లో సూర్యాపేటలో జరిగిన మహాసభలో మల్లు స్వరాజ్యం అధ్యక్షురాలుగా, మోటురు ఉదయం ప్రధాన కార్యదర్శిగా, మానికొండ సూర్యావతి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1984లో మిర్యాలగూడలో ఐదో మహాసభ జరిగింది. వీర వనిత చాకలి ఐలమ్మను మహాసభలో సన్మానించారు. ఆ తర్వాత మహాసభ పాలకొల్లులోను, 1993లో స్వర్ణోత్సవ మహాసభలు విజయవాడలోనూ, 1997లో నెల్లూరులోను, 2001లో గుంటూరులోనూ, 2004లో హైదరాబాదులోనూ, తదనంతరం ఖమ్మం, కర్నూలు పట్టణాలలో రాష్ట్ర మహాసభలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయి.

స్త్రీల జీవితాల్లో మార్పు కోసం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు దాటిపోయాయి. రాష్ట్రం ఏర్పడ్డాక నాలుగు మహాసభలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో మద్యం సమస్యపైన, చీప్‌ లిక్కర్‌, బెల్ట్‌ షాపులకు వ్యతిరేకంగా, ఆసుపత్రుల సమస్యలపైన, అభయహస్తం, డ్వాక్రా సమస్యల పైన, ఉపాధి హామీ సమస్యలపైన, ఒంటరి మహిళలకు అండగా, నిత్యం స్త్రీలపై సాగే హింసకు వ్యతిరేకంగా మహిళా ఉద్యమం అనేక పోరాటాలు చేసింది, చేస్తూ వస్తున్నది. రాబోయే కాలంలో కూడా స్త్రీలకు అండగా నిలబడుతుంది. స్త్రీల జీవితాల్లో మార్పులు రావాలంటే అందుకు బలమైన మహిళా ఉద్యమాలు నిర్మించటం అవసరం. నేడు అఖిల భారత కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై అతిపెద్ద బాధ్యతను పెట్టింది. అదే అఖిలభారత మహాసభల నిర్వహణ. కొత్త ఏడాదిలో జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాదు నగరం అఖిలభారత మహాసభలకు వేదిక కానున్నది. ఈ మహాసభలను జయప్రదం చేయటం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత భుజాన వేసుకోవాలి.

  • ఎస్‌.పుణ్యవతి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -