ఫ్యాబ్‌సిటీ భూనిర్వాసితులకు ఇండ్లస్థలాలు
జాన్‌వెస్లీని అభినందించిన నిర్వాసితులు
మార్కెట్ విలువ ప్రకారం పరిహారమివ్వాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీపీఐ(ఎం) నాయకత్వంలో దశాబ్దాలపాటు పోరాడి రావిరాల-జన్నాయిగూడెం ఫ్యాబ్‌సిటీ భూ నిర్వాసితులు విజయం సాధించారు. బుధవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీని భూ నిర్వాసితులు కలిసి అభినందించారు. ఆ పోరాట ఫలితంగా వారికి ఎకరాకు 150 నుంచి 250 గజాల ఇంటిస్థలం వచ్చింది. అయితే భూమికి నష్టపరిహారం వంటి హామీలు ఇంకా నెరవేరలేదనీ, వాటి అమలుకోసం పోరాటాలను నిర్వహించాలని జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా రావిరాల-జన్నాయిగూడెంలో 224 మంది రైతుల వద్ద 827 ఎకరాల భూమిని 2004లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యాబ్‌సిటీ నిర్మాణం కోసం తీసుకున్నది. భూమి పొజిషన్‌లో ఉన్న వారికి ఎకరాకు 150 గజాలు, భూమి కోల్పోయిన సీలింగ్ రైతులకు ఎకరాకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ అమలు కోసం రైతులు రెండు దశబ్ధాలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఫ్యాబ్‌సిటీలో పారిశ్రామికవేత్తలకు మాత్రం పరిశ్రమల నిర్మాణాలకు అనుమతులిచ్చాయి. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనేక దఫాలుగా పోరాటాలు నిర్వహించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రావిరాల ప్రాంత సందర్శన నేపథ్యంలోనే సీపీఐ(ఎం) పెద్ద ఎత్తున ప్రతిఘటన కార్యక్రమాలకు పూనుకుంది. అధికారులు చర్చించి రైతులకు ఇస్తామన్న 150 నుంచి 250 గజాల స్థలాల ఉచిత రిజిస్ట్రేషన్, ఇండ్ల స్థలాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందనే ఒప్పందం జరిగింది. ఇప్పటి వరకు నలుగురికి రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ ప్రస్తుతం ఎకరా మార్కెట్ ధర సుమారు రూ.20 కోట్ల విలువ ఉంటుందని అన్నారు. ప్లాటు విలువ రూ.60 లక్షలు మాత్రమేనని తెలిపారు. ఇండ్ల స్థలాల సాధన ఒక విజయం మాత్రమేనని వివరించారు. ప్రభుత్వం సేకరించిన ఈ భూమికి నేటికీ నష్టపరిహారం చెల్లించలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాలయాపన చేయకుండా వెంటనే మిగిలిన రైతులందరికీ ప్లాట్ల కేటాయింపుతోపాటు, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మిగతా హామీల అమలు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు, కూలీలు, పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా పోరాటాల్లో సీపీఐ(ఎం) ముందుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి రామచందర్, ఆర్ స్వామి, నిర్వాసితుల నాయకుడు నర్సింహ, ప్రశాంత్, నాగేశ్, భిక్షపతి, రాజు, అశోక్ పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) దశాబ్దాల పోరాట విజయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



