Saturday, January 3, 2026
E-PAPER
Homeమానవిఅక్షరాన్నే ఆయుధంగా మలిచిన ధిశాలి

అక్షరాన్నే ఆయుధంగా మలిచిన ధిశాలి

- Advertisement -

సావిత్రిబాయి పూలే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె 1831 జనవరి 3న మహారాష్ట్రలోని నైగాన్‌ గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి ఖండోజీ నెవాసే పాటిల్‌. చిన్న వయసులోనే జ్యోతిరావు పూలేతో ఆమె వివాహం జరిగింది. వివాహం తరువాత చదువుకు ప్రాధాన్యం ఇవ్వడం ఆమె జీవితాన్ని మార్చింది. జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో ఆమె విద్యాభ్యాసం ప్రారంభించారు. చీకటి కాలంలో జ్ఞానానికి తెరిచిన తొలి ద్వారమయ్యారు. స్త్రీకి అక్షరం హక్కుని ధైర్యంగా చెప్పిన స్వరం ఆమె. ఆత్మగౌరవ ప్రతీకగా నిలబడాలంటే స్త్రీకి విద్య అవసరమని గట్టిగా నమ్మి వ్యక్తి సావిత్రి బాయి. పూలే దంపతులు 1848లో పూణేలో తొలి బాలికల పాఠశాలను స్థాపించారు. ప్రతి బాలికకు విద్య రూపంలో బలమైన రెక్కలు సృష్టించాలనే సంకల్పం పెట్టుకున్నారు. పాఠశాలకు వెళ్ళేటపుడు ఆమెపై రాళ్ళు, చెత్త విసిరేవారు. అయినా ధైర్యం కోల్పోలేదు. అవమానాలు భరిస్తూ సాగిన ఆమె ప్రయాణం దళితులు, అణగారిన వర్గాల జీవితంలో కొత్త వెలుగయింది.

కులం గోడల్ని చీల్చిన ప్రశ్నలా ఉదయించింది. అస్పృశ్యత, బాల్యవివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు. నిన్నటి భయాలపై రేపటి వెలుగు విరజిల్లేలా నిత్యం శ్రమించారు. నిరాశతో కుమిలిపోతున్న బతుకుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేశారు. అనాథల కోసం ఆశ్రమాలు స్థాపించి చేయూతనిచ్చారు. ప్లేగు వ్యాధి వ్యాపించి ప్రజలను మింగేస్తున్న సమయంలో రోగులకు అవిశ్రాంతంగా సేవలందించారు. ఆ సేవలోనే 1897 మార్చి 10న ప్రాణాలు కోల్పోయారు. శ్రమకు గౌరవం నేర్పిన పాఠం సావిత్రిబాయి పూలే. న్యాయానికి నిలువెత్తు అక్షరమాల. ఆమె సాహసం అనేక మందికి ప్రేరణ. కాలం పరీక్షించిన వెనకడుగు వేయని సంకల్పం. ప్రశ్నించడం నేర్పిన స్వరం. భారత మహిళా ఉద్యమానికి ఆమె ఓ పునాది. విద్యే విముక్తికి మార్గమని ఆమె జీవితం నేర్పిస్తుంది. సామాజిక సంస్కరణకు మార్గదర్శి. సావిత్రి బాయి మంచి కవయిత్రి కూడా. బోధనతో సమసమాజం కోసం కృషి చేసిన ఆమె జీవితం ప్రతి యువతికీ ఆదర్శనీయం.

  • బోనాసి రేణుక, జనగాం.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -