భార్యాను కొట్టే హక్కు భర్తకు లేదా అనే మాట తరచూ మనకు వినిపిస్తూ ఉంటుంది. నిజానికి ప్రపంచంలో ఏ ఒక్క మనిషిని మరో మనిషి కొట్టే హక్కు లేదు. చట్ట పరంగా ఇది నేరం. అలాగే భార్యను కొట్టడం, హింసించడం లాంటివి గృహహింస కిందకు వస్తుంది. దీనికి శిక్షలు కూడా ఉన్నాయి. అయినా చాలా మంది భార్య అంటే తమ చేతుల్లో కీలు బొమ్మ అన్నట్టు ప్రవర్తిస్తారు. ఇష్టం వచ్చినట్టు హింసిస్తుంటారు. చుట్టు పక్కల వారు ఎవరైనా వారిస్తే ‘నా భార్య నా ఇష్టం’ అంటారు. అలాంటి ఓ కథనమే ఈ వారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో మానవి పాఠకుల కోసం…
సుప్రియా, దినేష్‌లు ఇంట్లో వాళ్లను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి పెండ్లి జరిగి రెండేండ్లు అవుతుంది. ఒక బాబు ఉన్నాడు. ఏడాదిన్నర బాబును తీసుకొని సుప్రియ ఐద్వా అదాలత్‌కు వచ్చింది. సుప్రియకు తల్లి లేదు. తండ్రి వయసులో చాలా పెద్దవాడు. తన పని కూడా తాను చేసుకోలేడు. ఆమెకు ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు ఉన్నారు. తమ్ముడికి ఇంకా పెండ్లి కాలేదు. సుప్రియకు పుట్టింటి నుండి ఆర్థిక సహకారం పెద్దగా అందే అవకాశం లేదు. అయితే ఎప్పుడైనా ఆరోగ్యం బాగోకపోతే చూపించడం, మందులు ఇప్పించడం వంటివి చేస్తుంటారు. ఆమె చిన్న చిన్న అవసరాలు ఏమైనా ఉంటే చూస్తారు.
దినేష్ మాత్రం ఈమె గురించి అస్సలు పట్టించుకోడు. ఆమెనే కాదు కనీసం బాబుకు జ్వరం వచ్చినా హాస్పిటల్‌కు తీసుకెళ్లడు. అది కూడా సుప్రియ అన్నలే చేస్తారు. ఈ మధ్య కాలంలో ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. ఏ పని సరిగ్గా చేసుకోలేక పోతుంది. అత్తగారి ఇంట్లో మొత్తం ఆమెతో కలిసి పది మంది ఉంటారు. ఆడపడుచు కూడా ఎక్కువగా వీళ్లతోనే ఉంటుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది. రెండు గదులు, చిన్న వంట గది. వీళ్లు ఉండటానికి ప్రత్యేకంగా గది లేదు. దాంతో ఆ ఇంటికి దగ్గరలోనే ఒక రూమ్ అద్దెకు తీసుకున్నారు. ఇంట్లో ఖర్చులు మొత్తం మామగారే చూసుకుంటారు. దినేష్, అతని అన్న నెలకు నాలుగు వేల చొప్పున తండ్రికి ఇస్తారు. ‘మిగిలిన డబ్బులు మీరే పెట్టుకోండి పిల్లలు ఉన్నారు కదా, మేము ఉన్నప్పుడే కొంత పొదుపు చేసుకోండి’ అంటాడు ఆయన. వీరు ఉండే రూం రెంటు కూడా ఆయనే చెల్లిస్తారు. అత్తమామలతో సుప్రియకు ఎలాంటి సమస్యా లేదు.
ప్రేమించి పెండ్లి చేసుకున్న దినేష్తోనే ఆమె సమస్య. ప్రతి చిన్న విషయానికి సుప్రియను కొడుతుంటాడు. బాబు ఏడుస్తున్నా, వంట రుచిగా లేకపోయినా ఇలా ఏదో ఒక వంకతో ఆమెను కొడతాడు. తల్లి అడ్డువస్తే ఆమెను కూడా తిడతాడు. ‘నీ అండ చూసుకునే ఆమె ఇలా ప్రవర్తిస్తుంది’ అంటూ తల్లిపై రంకెలు వేస్తాడు. ఒక సందర్భంలో ‘నా చెల్లిని ఎందుకు ఇలా కొడుతున్నావు’ అని సుప్రియ అన్నలు అడిగితే వాళ్లను కూడా కొట్టడం, ఈ విషయం సుప్రియ వదిలనకు చెప్పడం వంటివి చేస్తున్నాడు. దాంతో వాళ్లెవరూ సుప్రియ ఇంటికి రావడం లేదు. ఆమెకేమైనా అవసరం ఉంటే బయట నుండి బయటే ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఇలా ఆమెను మానసికంగా, శారీరకంగా హింసిస్తు న్నాడు. దాంతో ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది.
వాళ్ల వదిన ఇంటికి వస్తే ఆస్పత్రికి తీసుకెళ తానంది. దాంతో బాబును, అత్తను తీసుకొని అక్కడకు వెళ్లింది. ఆమె సుప్రియను డాక్టర్ దగ్గర చూపించి మందులు ఇప్పించి వెళ్లిపోయింది. దీనికి కూడా దినేష్ సుప్రియను కొట్టాడు. దాంతో తల్లి అతన్ని బాగా తిట్టింది. ఇంటి పక్కన వాళ్లు కూడా వచ్చి కోప్పడ్డారు. దాంతో అతను అక్కడి నుండి వెళ్లిపోయాడు. దినేష్ కోపంగా ఉన్నాడని అత్త ఆ రాత్రికి సుప్రియను అక్కడే నిద్రపొమ్మంది. రూమ్‌కి రానందుకు మళ్లీ వచ్చి విపరీతంగా కొట్టి వెళ్లాడు.
‘దినేష్‌ని పెండ్లి చేసుకున్నప్పటి నుండి దెబ్బలు తినడం తప్ప ఏ రోజూ సంతోషంగా లేను. పెండ్లి తర్వాత మూడు నెలలు మాత్రమే నన్ను బాగా చూసుకున్నాడు. తర్వాత నుండి ఏదో ఒక వంకతో టార్చర్ పెడుతూనే ఉన్నాడు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఆమె చెప్పింది మొత్తం విన్న తర్వాత దినేష్ తల్లిదం డ్రులను పిలిచి మాట్లాడితే ‘సుప్రియ తప్పు ఏమీ లేదు. మా అబ్బాయికి ఎంత చెప్పినా అర్థం కాదు. భార్య అంటే ఏం చెప్పినా వినాలి, ఎదురు మాట్లాడకూడదు అనుకుంటున్నాడు. వాడి దృష్టిలో భార్యంటే ఒక మర బొమ్మ. సుప్రియ బాధ చూడలేక మీ దగ్గరకు పంపించాము. మీరే మా వాడితో మాట్లాడి సరి చేయండి’ అన్నారు.
దినేష్‌ని పిలిపించి మాట్లాడితే అతని మాటలు ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి. ‘నేను మగాడిని నేను చెప్పినట్టు వినాల్సిందే. నేను ఎప్పుడు తెచ్చి పెడితే అప్పుడే ఆమె తినాలి. అది కావాలి ఇది కావాలి అని అడిగే హక్కు ఆమెకు లేదు’ అన్నాడు. దానికి సుప్రియ ‘బాబుకు పాలు కావాలంటే వెంటనే పట్టాలి కదా, దానికి కూడా టైం కావాలంటే ఎలా, జ్వరం వస్తుంది వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి అప్పుడు ఎలా’ అన్నది. ‘నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తీసుకెళతాను’ అంటాడు. పనికి వెళ్లమంటే ఆరోగ్యం బాగోలేదంటాడు, హాస్పిటల్‌కు వెళ్లమంటే డబ్బులు లేవంటాడు. ఇలా తిక్క తిక్క సమాధానాలు చెప్పాడు. అతని మాటలు, ప్రవర్తన చూసిన తర్వాత ఏదో మానసిక సమస్య ఉన్నట్టు అనిపించింది.
దినేష్ తల్లిదండ్రులను పిలిచి ‘మీ అబ్బాయికి భార్యా, కొడుకు అంటే ఎలాంటి బాధ్యత లేదూ. చివరకు తల్లిదండ్రులను కూడా గౌరవించడం లేదు. బాధ్యతా రాహిత్యంగా ఉన్నాడు. అసలు అతను తన బాధ్యతలను గుర్తించలేకపోతున్నాడు. కనీసం చెప్పింది విని అర్థం చేసుకునే స్థితిలో కూడా లేడు. భార్యను మాత్రం తన బానిస అనుకుంటున్నాడు. ఇప్పుడు అతనిపై కేసు పెడితే గృహహింస కింద జైలుకు వెళతాడు. అప్పుడు సుప్రియకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అయితే మీ అబ్బాయి మానసిక స్థితి సరిగ్గా ఉన్నట్టు లేదు. ఒకసారి అతన్ని హాస్పి టల్లో చూపిస్తే మంచిది. అప్పటికీ అతనిలో మార్పు రాకపోతే అప్పుడేం చేయా లో ఆలోచిద్దాం’ అని చెప్పి పంపించారు. అప్పటి వరకు సుప్రియ అతనితో ఉండకుండా అత్తమామలతోనే ఉంటానని చెప్పింది.
– వై వరలక్ష్మి, 9948794051