తల్లితోపాటు ఆరునెలల బాలుడూ మృతి
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో ఘటన
ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే..
నవతెలంగాణ – నాంపల్లి
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని కోపం పెంచుకున్న ఓ మహిళ.. ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో తల్లితోపాటు ఆరు నెలల బాలుడు మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన శనివారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని కేతేపల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతెపల్లి గ్రామానికి చెందిన మీసాల సుజాతకు గుర్రంపోడు మండలం పిట్టలగూడెం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. భర్త చనిపోవడంతో సుమారు 10 ఏండ్లుగా తల్లిగారి గ్రామమైన కేతెపల్లిలో నివాసముంటోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు సంతానం. అదే గ్రామానికి చెందిన కుందేళ్ల నగేష్‌తో సుజాతకు అతనికి పెండ్లి కాకముందు నుండే వివాహేతర సంబంధం ఉన్నట్టు సమాచారం. నగేష్‌కు మర్రిగూడ మండలం సరంపేట గ్రామానికి చెందిన జంగిలి చంద్రయ్య కుమార్తె మమతతో ఐదేండ్ల కింద వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు సంతానం. అయితే, తన వివాహేతర సంబంధానికి నగేష్ భార్యనే అడ్డుగా ఉందని భావించిన సుజాత శనివారం మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో అతని ఇంటికి వెళ్లింది.
నగేష్ భార్య మమత(25)తో గొడవ పడి కంట్లో కారం కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆ సమయంలో మమత సంకలో ఆరు నెలల కొడుకు కూడా ఉన్నాడు. మంటలకు తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటికి పరుగులు తీసిన మమత బాలున్ని కాపాడుకునేందుకు విసిరేసింది.. కానీ, మంటలు వ్యాపించి ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. బాలునికి కూడా తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు నాంపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో.. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడు కూడా మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని దేవరకొండ డీస్పీ శ్రీనివాసరావు, నాంపల్లి సీఐ దూది రాజు, నాంపల్లి ఎస్‌ఐ లింగారెడి,్డ చింతపల్లి ఎస్‌ఐ రామ్మూర్తి, మర్రిగూడ ఎస్‌ఐ కృష్ణారెడ్డి సందర్శించారు. ఘటనా స్థలంలో పెట్రోలు బాటిల్, కారం, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఘర్షణలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుజాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టుగా తెలిసింది. మమత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి జంగిలి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు మర్రిగూడ ఎస్‌ఐ లింగారెడ్డి తెలిపారు.
మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



