వికలాంగులకూ.. ఎస్సీ/ఎస్టీ లాంటి కఠిన చట్టం అవసరమే : సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : చొరబాటుదారులు ఆధార్ కార్డులు సంపాదించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా పౌరులు కానివారు ఆధార్ కలిగిఉంటే.. వారికి ఓటు హక్కు కూడా ఇచ్చేయాలా? అని ప్రశ్నించింది. ఓటర్ల జాబితాలకు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ‘సర్’ కసరత్తుపై ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోరుమల్యా బాగ్చి ధర్మాసనం గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా పౌరసత్వానికి ఆధార్ ప్రూఫ్ కాదని స్పష్టం చేసింది. ‘ఆధార్ సామాజిక సంక్షేమ ప్రయోజనాలు అందరికీ చేరేలా చూసుకోవడానికి ఏర్పాటుచేసింది మాత్రమే.
రేషన్ కోసం ఆధార్ పొందిన వ్యక్తిని.. ఓటర్‌ను చేయాలా? విదేశాలకు చెందినవారు ఇక్కడ కార్మికుడిగా పనిచేస్తే.. వారికి కూడా ఓటు హక్కు కల్పించాలా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ఓటరు నమోదు ఫారం-6లో పేర్కొన్న వివరాలు సరైనవో, కావో నిర్ధారించుకునే అధికారం ఈసీకి ఉందని తేల్చి చెప్పింది. కొంతమంది పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. సర్ ప్రక్రియ సాధారణ పౌరులపై రాజ్యాంగ విరుద్ధమైన భారాన్ని మోపుతుందన్నారు. వారిలో అనేకమంది నిరక్షరాస్యులు ఉన్నారన్నారు. ఈ మొత్తం ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇక, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో సర్ నిర్వహించడాన్ని ప్రత్యేకంగా సవాల్ చేసిన పిటిషన్ల విచారణకు సుప్రీం షెడ్యూల్ చేసింది. డిసెంబరు 1లోపు వీటిపై స్పందన తెలియజేయాలని ఈసీని కోరింది.
వికలాంగులకూ..ఎస్సీ/ఎస్టీ లాంటి కఠిన చట్టం అవసరమే .
వికలాంగులను కించపరిచే వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎస్సీ/ఎస్టీ చట్టం లాంటి కఠినమైన చట్టాలు అవసరమని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించింది. యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా, సమరు రైనాలకు సంబంధించి పిటిషన్ల విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. కండరాల క్షీణత సమస్యపై అవగాహన కల్పిస్తూ బాధితులతో కలిసి ఓ ప్రదర్శన నిర్వహించాలని ఈ సందర్భంగా సమరు రైనాకు సుప్రీం కోర్టు సూచించింది. ఓ ఆన్‌లైన్ షోలో వెన్నె ముక కండరాల క్షీణత (ఎస్‌ఎంఏ)తో బాధపడుతున్న ఓ చిన్నారికి అవసరమైన ఔషధాల గురించి ప్రస్తావిస్తూ వారిని కించపరిచే విధంగా సమరు రైనా మాట్లా డాడు. ఈ షోలో పాల్గొన్న వారిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ అరుదైన వ్యాధి పై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం.. ఆ షోలో పాల్గొన్న వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు సమరు రైనా క్షమాపణలు చెప్పాడు.
ఆన్‌లైన్ కంటెంట్‌పై ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి
ఆన్‌లైన్ కంటెంట్ నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసే కంటెంట్ పై ఎవరో ఒకరు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వ్యక్తులు సొంతంగా ఛానళ్లు ప్రారంభించి.. ఆ తర్వాత బాధ్యతారాహిత్యంగా ఉండటం వింతగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.



