సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్లను ( డీఈవో ) తమ ఉద్యోగాలలో యదావిధిగా కొనసాగించాలనీ, ఆరు నెలల పెండింగ్ వేతనాలు అడిగినందుకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగుల తొలగింపు అన్యాయం అని సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లు గత కొన్ని సంవత్సరాలుగా నిబద్ధతతో ఆసుపత్రి కి సేవలు అందిస్తున్నారని ఇప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వారిని ఉద్యోగాల నుండి తొలగించడం అన్యాయమని అన్నారు. ఆరోగ్యశ్రీ సేవల్లో వారి పాత్ర కీలకమైనదనీ వారిని తొలగించడం వల్ల దూర ప్రాంతాల నుండి కామారెడ్డి జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగుల సేవలకు అంతరాయం కలుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు. ఇట్టి విషయాన్ని పట్టించుకునే అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు గాని ఎవరూ లేకపోవడం శోషనీయమని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు సేవలందించిన డేటా ఎంట్రీ ఆపరేటర్లను తక్షణం తిరిగి విధుల్లో కొనసాగించాలనీ, వేతనాలు, పెండింగ్ బకాయిలను తక్షణం చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పిస్తూ శాశ్వత నియామకాలు చేయాలనీ, భవిష్యత్తులో ఇలాంటి తొలగింపులు జరగకుండా స్పష్టమైన పాలసీ రూపొందించాలనీ, ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బంది అందరికి సమాన హక్కులు ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. లేకపోతే నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేయవలసి వస్తుందని హెచ్చరించారు.