డాక్టర్ వద్దిరాజు రాకేశ్
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : ఆరోగ్యశ్రీ సీఈఓ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తొమ్మిది నెలలుగా చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ప్రభుత్వానికి వివిధ రూపాల్లో తమ సమస్యలను చెప్పినప్పటికీ పరిష్కారం కాకపోగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. లిఖితపూర్వకంగానూ, స్వయంగా కలిసి విన్నవించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యారోగ్యశాఖ మంత్రికి, ఆరోగ్యశ్రీ సీఈవోకు ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని కోరినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కారం కోసం, తమ ఆస్పత్రులు అనారోగ్యం పాలు కాకుండా కాపాడుకునేందుకే సేవల నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని వివరించారు. బకాయిలను మొత్తం చెల్లించాలనీ, ఇక నుంచి రెగ్యులర్‌గా చెల్లింపులు జరపాలనీ, ఎంఓయూ తిరిగి డ్రాఫ్ట్ చేయాలనీ, సమస్యల పరిష్కారం కోసం సౌలభ్యం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లాలని కోరారు.
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : ఆరోగ్యశ్రీ సీఈవో
ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు ఆరోగ్యశ్రీ సీఈవో ఉదరు కుమార్ విజ్ఞప్తి చేశారు. వైద్య సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు, గడిచిన 21 నెలల్లో రూ.1,779 కోట్లను చెల్లించిందని ఆయన వెల్లడించారు. ప్రయివేటు హాస్పిటళ్ల యాజమాన్యాలు దశాబ్ద కాలం ఎదురుచూసిన ప్యాకేజీల చార్జీల పెంపు డిమాండ్‌ను ఆమోదించి, 1,375 వైద్య చికిత్సల చార్జీలను సగటున 22 శాతానికిపైగా పెంచిన విషయాన్ని సీఈవో గుర్తు చేశారు. కొత్తగా 163 రకాల ఖరీదైన వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చి పేషెంట్లను ప్రభుత్వం ఆదుకుందని పేర్కొన్నారు. ఛార్జీల పెంపు, కొత్త ప్యాకేజీల చేర్పుతో అదనంగా రూ.487.29 కోట్లు పేషెంట్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వెల్లడిం చారు. 2014 నుంచి 2023 నవంబర్ వరకూ సగటున నెలకు రూ.57 కోట్లు హాస్పిటళ్లకు చెల్లించగా, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకూ సగటున నెలకు రూ.75 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. ప్రస్తుతం నెలకు రూ.95 కోట్లు చెల్లిస్తున్నామనీ, హాస్పిటళ్ల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు నెలకు రూ.వంద కోట్లు చెల్లించేం దుకు ప్రభుత్వం అంగీకరించిందని ఉదరు వెల్లడిం చారు. ఇతర విజ్ఞప్తుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఉదరు తెలిపారు.