ఆయుధాలు సమర్పించి జన జీవన స్రవంతిలో కలవండి : మావోయిస్టులకు డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : అజ్ఞాతంలో ఉన్న సీపీఐ(మావోయిస్టు) పార్టీ నాయకులు, క్యాడర్ వెంటనే హింసా మార్గాన్ని వీడాలని తెలంగాణ డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆయుధాలు సమర్పించి ప్రజాస్వామ్య ప్రధాన స్రవంతిలో చేరి సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితం గడపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ఇచ్చిన పిలుపు మేరకు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీ నాయకులు, క్యాడర్ తిరిగి వచ్చి జన జీవన స్రవంతిలో కలిసి, తమ కుటుంబీకులతో శాంతియుతమైన జీవనాన్ని సాగించాలని కోరారు. గత రెండేండ్ల కాలంలో తెలంగాణ పోలీసులు నిరంతర, సమన్వయ కృషి ఫలితంగా వివిధ స్థాయిలకు చెందిన మొత్తం 721 మంది అజ్ఞాత మావోయిస్టు క్యాడర్ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందినవారు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారని తెలిపారు.
వీరందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర పునరావాస పథకం కింద ఆర్థిక సహాయం సహా అన్ని రకాల ప్రయోజనాలు అందజేయబడినట్టు చెప్పారు. ప్రస్తుతం వీరంతా తమ కుటుంబాలతో కలిసి తమ స్వగ్రామాల్లో గౌరవప్రదంగా జీవిస్తున్నారని వివరించారు.తెలంగాణ రాష్ట్రానికి చెంది, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో వివిధ మావోయిస్టు నిర్మాణాల్లో పని చేస్తున్న అజ్ఞాత క్యాడర్‌కు కూడా డీజీపీ ఈ విజ్ఞప్తిని చేశారు. వీరిలో ముప్పాల్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి (72), పుసునూరి నరహరి ఎలియాస్ సంతోశ్, వర్త శేఖర్ ఎలియాస్ మంగ్తు, జోడే రత్నబాయి ఎలియాస్ సుజాత, నక్క సుశీల ఎలియాస్ రేలా, రంగబోయిన భాగ్య ఎలియాస్ రూపిలు ఉన్నారు. మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో ఉన్న క్యాడర్ కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు వారిని జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రోత్సహించాలని డీజీపీ కోరారు. మారుతున్న కాలంలో శాంతియుత, ప్రజాస్వామ్య మార్గాల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు.



