రాష్ట్రాన్ని నడిపే సత్తా రేవంత్‌కు లేదు
ఢిల్లీకి మూటలు..రైతులకు టోపీలు
దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించుదాం.. ఓటే తూటా..
బుద్ధిచెప్పే అవకాశం ముందుంది : ఆత్మగౌరవ గర్జన సభలో కేటీఆర్
నవతెలంగాణ-లింగంపేట్
”ఎన్నికల కంటే ముందు తెలంగాణ ధనికరాష్ట్రం అంటూ.. కేసీఆర్ అమలు చేసిన పథకాల కంటే ఎక్కువ అమలు చేస్తామని చెప్పారు.. కానీ గతంలో అమలు చేసిన పథకాలు సైతం ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మోసపూరిత హామీలు గుప్పించి గద్దెనెక్కారు.. కాంగ్రెస్ అభయహస్తం.. ఈ శతాబ్దపు మోసం” అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రాన్ని నడిపే సత్తా రేవంత్‌రెడ్డికి లేదని విమర్శించారు. దళిత వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పే రోజులు ఆసన్నమయ్యాయని తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ గర్జన సభలో కేటీఆర్ మాట్లాడారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు జాజాల సురేందర్ ఫొటోతో కలిపి ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన దళిత నాయకులు, మాజీ ఎంపీపీ ముదాం సాయిలును పోలీసులు దారుణంగా అవమానించారని అన్నారు. ఎక్కడైతే అవమానం జరిగిందో అదే సెంటర్‌లో ఆయనకు సన్మానం చేసి గౌరవించుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ”బోధించు.. సమీకరించు.. పోరాడు..” అనే సూత్రాలతో కేసీఆర్ 14 ఏండ్ల పాటు ప్రజలతో కలిసి పోరాటం చేస్తే తెలంగాణ సాకారమైందని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నట్టు తెలిపారు.
రైతు రుణమాఫీ రూ.50 వేల కోట్ల విడుదల చేయాలని బ్యాంకులు చెప్తే.. రూ.12 వేల కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో వేశారని అన్నారు. మిగతా నిధులు ఏమైనట్టని, ఢిల్లీకి మూటలు పంపిస్తూ.. రైతులకు టోపీలు పెడుతున్నారని విమర్శించారు. పెన్షన్ మొదలు బోనస్ బోగస్ అయిందని.. కౌలు రైతులకు ఏటా రూ.15 వేలు అని చెప్పి మోసం చేశారని అన్నారు. రేవంత్‌రెడ్డి గద్దెనెక్కి ఇన్ని రోజులవుతున్నా ఇంకా నిధులు లేవని, అప్పుల్లో కూరుకుపోయామని చెప్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని నడిపోటోడికి దమ్ముండాలని.. అప్పుడే ఆదాయం, సంపద సమకూరి పేదల బతుకులు మారుతాయని అన్నారు. సీఎం వేములవాడ వెళ్లిన రోజు భోజనం ప్లేటు ఖరీదు రూ.1.31 లక్షలని, అందాలభామల పోటీలకు ఒక్క ప్లేటు భోజనానికి లక్ష చొప్పున వెచ్చించారని.. అంత ఖర్చుపెడుతున్న రేవంత్‌రెడ్డి.. గురుకులాల్లో చదువుకునే పిల్లలకు కనీసం 100 రూపాయలు కేటాయించే పరిస్థితి లేదా అని ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్, పరీక్షలు, ఇంటర్వ్యూలు పూర్తయి.. ఎన్నికలు రావడంతో వారికి ఉద్యోగ నియామకపత్రాలు ఇవ్వడం ఆలస్యమైందని.. వాటిని ఇచ్చి 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించుకోవడం దారుణమన్నారు. త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రానున్నవని.. ప్రజాస్వామ్యంలో ఓటే తూటా అని దాన్ని సరిగ్గా ఉపయోగించుకొని దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించుదామని అన్నారు. అనంతరం ముదాం సాయిలు ఇంట్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గంపగోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్‌షిండే, బాజిరెడ్డి గోవర్ధన్, నాయకులు దఫెదర్ రాజు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ముజిబొద్దీన తదితరులు పాల్గొన్నారు.
అభయహస్తం ఈ శతాబ్దపు మోసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES