ఛేదనలో చెలరేగిన అభిషేక్ శర్మ
పాకిస్తాన్ 171/5, భారత్ 174/4
పాక్‌పై భారత్ ఘన విజయం
అభిషేక్ శర్మ (74) ధనాధన్ దంచటంతో ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం జరిగిన సూపర్4 పోరులో సూర్యసేన బంతితో, బ్యాట్‌తో ఆధిపత్యం చెలాయించింది. 172 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఛేదించిన టీమ్ ఇండియా.. ఫైనల్లో చోటు దిశగా ఓ అడుగు ముందుకేసింది. ఈ మ్యాచ్‌లోనూ భారత్, పాక్ కెప్టెన్లు.. ఆటగాళ్లు కరచాలనం చేయలేదు.
నవతెలంగాణ-అబుదాబి
పాకిస్తాన్‌పై భారత్ సూపర్ విజయం సాధించింది. ఆదివారం అబుదాబిలో జరిగిన ఆసియా కప్ సూపర్4 సమరంలో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఛేదనలో అభిషేక్ శర్మ (74, 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టగా.. శుభ్‌మన్ గిల్ (47, 28 బంతుల్లో 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ నమోదు చేశాడు. ఓపెనర్లే 105 పరుగులు జోడించగా భారత్ అలవోక విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఫర్హాన్ (58, 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో రాణించాడు. సూపర్4లో భారత్‌కు ఇది తొలి విజయం.
అభిషేక్ అదరహో
172 పరుగుల ఛేదనలో భారత్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభం అందించారు. తొలి రెండు ఓవర్లలో అభిషేక నెమ్మదించినా.. శుభ్‌మన్ గిల్ (47) ఎదురుదాడి చేశాడు. అబ్రార్ ఓవర్లో విశ్వరూపం మొదలెట్టిన అభిషేక్ బౌండరీల వర్షం కురిపించాడు. 4 ఫోర్లు, 4 సిక్సర్లతో దండెత్తిన అభిషేక్ 24 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదాడు. ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా ఆడటంతో భారత్ తొలి వికెట్‌కు 59 బంతుల్లోనే 105 పరుగులు చేసింది. 9.4 ఓవర్లలో 105/0తో పటిష్టంగా కనిపించిన భారత్ డ్రింక్స్ విరామం తర్వాత గిల్, సూర్య (0) వికెట్లు కోల్పోయింది. సంజు శాంసన్ (13) స్పిన్‌పై తడబాటుకు గురయ్యాడు. తిలక్ వర్మ (30 నాటౌట్), హార్దిక్ పాండ్య (7 నాటౌట్) ఐదో వికెట్‌కు అజేయ భాగస్వామ్యంతో లాంఛనం ముగించారు. ఓపెనర్ల నిష్క్రమణ తర్వాత స్కోరు వేగం మందగించినా.. సాధించాల్సిన రన్‌రేట్ తక్కువ ఉండటంతో భారత్‌పై ఒత్తిడి పడలేదు. పాక్ బౌలర్లలో హరీశ్ రవూఫ్ (2/26) రాణించాడు.
ఫర్హాన్ మెరువగా..
టాస్ ఓడిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ రెండో బంతికే ఫర్హాన్‌కు జీవనదానం ఇచ్చాడు. క్యాచౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న షాహిబ్జాద ఫర్హాన్ (58) అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫకర్ జమాన్ (15) ఓపెనర్‌గా మూడు ఫోర్లతో మెరిసినా.. పవర్‌ప్లేలో వికెట్ నిలుపుకోలేదు. హార్దిక్ పాండ్య ఓవర్లో భారత్ తొలి బ్రేక్ సాధించింది. ఫర్హాన్ క్రీజులో నిలువగా తొలి పది ఓవర్లలో పాక్ పైచేయి సాధించింది. ఫర్హాన్ ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 34 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. అతడు రాణించగా తొలి ఐదు ఓవర్లలో 42 పరుగులు చేసిన పాక్, ఆ తర్వాతి ఐదు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. పది ఓవర్లలో 91/1తో నిలిచిన పాకిస్తాన్ భారీ స్కోరు సాధించేలా కనిపించింది. కానీ ఫర్హాన్ నిష్క్రమణతో భారత బౌలర్లు పుంజుకున్నారు. వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్‌లు మాయాజాలంతో బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో 11-15 ఓవర్లలో మూడు వికెట్లకు పాక్ 28 పరుగులే చేసింది. మహ్మద్ నవాజ్ (21), సల్మాన్ ఆగా (17 నాటౌట్), ఫహీమ్ (20 నాటౌట్) రాణించగా పాక్ మెరుగైన స్కోరు చేసింది. భారత పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా (0/45)తో నిరాశపరిచాడు. శివం దూబె (2/33), కుల్‌దీప్ (1/31), పాండ్య (1/29) రాణించారు.
స్కోరు వివరాలు :
పాకిస్తాన్ ఇన్నింగ్స్ : ఫర్హాన్ (సి) సూర్య (బి) 58, ఫకర్ జమాన్ (సి) శాంసన్ (బి) పాండ్య 15, ఆయుబ్ (సి) అభిషేక్ (బి) దూబె 21, హుస్సేన్ (సి) వరుణ్ (బి) కుల్‌దీప్ 10, నవాజ్ (రనౌట్) 21, సల్మాన్ నాటౌట్ 17, ఫహీమ్ నాటౌట్ 20, ఎక్స్‌ట్రాలు : 19, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 171.
వికెట్ల పతనం : 1-21, 2-93, 3-110, 4-115, 5-149.
బౌలింగ్ : హార్దిక్ పాండ్య 3-0-29-1, జశ్‌ప్రీత్ బుమ్రా 4-0-45-0, వరుణ్ చక్రవర్తి 4-0-25-0, కుల్‌దీప్ యాదవ్ 4-0-31-1, అక్షర్ పటేల్ 1-0-8-0, శివం దూబె 4-0-33-2.
భారత్ ఇన్నింగ్స్ : అభిషేక్ శర్మ (సి) రవూఫ్ (బి) అబ్రార్ 74, శుభ్‌మన్ గిల్ (బి) ఫహీమ్ 47, సూర్యకుమార్ యాదవ్ (సి) అబ్రార్ (బి) రవూఫ్ 0, తిలక్ వర్మ 30 నాటౌట్, సంజు శాంసన్ (బి) రవూఫ్ 13, హార్దిక్ పాండ్య నాటౌట్ 7, ఎక్స్‌ట్రాలు : 3, మొత్తం : (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 174.
వికెట్ల పతనం : 1-105, 2-106, 3-123, 4-148.
బౌలింగ్ : షహీన్ షా అఫ్రిది 3.5-0-40-0, ఆయుబ్ 3-0-35-0, అబ్రార్ అహ్మద్ 4-0-42-1, హరీశ్ రవూఫ్ 4-0-26-2, ఫహీమ్ అష్రాఫ్ 4-0-31-1.