Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకుల వ్యవస్థను రద్దు చేయండి

కుల వ్యవస్థను రద్దు చేయండి

- Advertisement -

– సుప్రీంకోర్టు తీర్పు, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం : ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ-బంజారాహిల్స్‌

కుల వివక్షను రూపుమాపడం చేతకానప్పుడు ఎస్సీ హోదాను రద్దు చేయడం కాకుండా కుల వ్యవస్థనే పూర్తిగా రద్దు చేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. దళితులు క్రిస్టియన్‌గా మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తున్నామన్నారు. ఎస్సీల మత స్వేచ్ఛను హరించే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, అవి వివక్షతకు ప్రతిరూపమని చెప్పారు. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓసీ, బీసీ క్రైస్తవులకు లేని నిబంధనలు ఎస్సీలకు మాత్రమే ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15, 25కు విరుద్ధమన్నారు. దళితులపై మతపరమైన ఆంక్షలు విధించడం అన్యాయమని, వారు ఏ మతాన్ని అనుసరించాలి, ఎలా జీవించాలి అన్నది నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. దళితులు గొర్రెలు అనుకుంటున్నారా ? ఇకపై ఆ ఆటలు చెల్లవని హెచ్చరించారు. హిందూ దేవాలయాలు అందరివైనప్పుడు.. బ్రాహ్మణులు మాత్రమే పూజారులుగా ఎందుకుండాలని, అయోధ్య మొదలుకొని అన్ని దేవాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ తరగతులను పూజారులుగా నియమించాలని డిమాండ్‌ చేశారు. అందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు.క్రైస్తవ మతంలోకి మారిన అగ్రకులాల సామాజిక హోదా మారకపోతే, దళితుల ఎస్సీ హోదా ఎందుకు మారాలని ప్రశ్నించారు. అగ్రకులాలు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు పొందుతుండగా, దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదని అన్నారు. కుల వ్యవస్థ వల్ల దళితులను పశువుల కన్నా హీనంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ 1937లోనే మత మార్పిడి వల్ల దళితుల సామాజిక స్థితిగతులు మారవని స్పష్టం చేశారని గుర్తుచేశారు. కుల వ్యవస్థ అన్ని మతాలను ప్రభావితం చేస్తోందని, దాని వల్లే దళితులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. దళిత క్రైస్తవులు అంబేద్కర్‌, నెల్సన్‌ మండేలా, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ వంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకుని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వారి ఉద్యమాలకు ఎమ్మార్పీఎస్‌ అండగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్‌ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇంజం వెంకటస్వామి మాదిగ, ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్‌ మాదిగ, మహిళా నాయకులు జేపీ లత మాదిగ, కార్తీక్‌ మాదిగ, టీవీ నరసింహ మాదిగ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -